
- ఈ నెల 22న చెన్నైలో కార్యాచరణ సమావేశం
- మమత, రేవంత్ సహా 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం
- బీజేపీ సీఎం మోహన్ చరణ్ మాఝీకి కూడా..!
- దక్షిణాదిపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని ఫైర్
చెన్నై: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) విషయం లో కేంద్రంపై తమిళనాడు సీఎం స్టాలిన్ పోరాటానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు 7 రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయాలని కేంద్రం ప్రయత్నిస్తున్నదని, దీనికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఒక్కటవుదామని, జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేద్దామని పేర్కొన్నారు. ఇటీవల తమిళనాడులో ఆయన నేతృత్వంలో జరిగిన ఆల్‌పార్టీ మీటింగ్ తీర్మానం ఆధారంగా ఈ లెటర్లు రాశారు. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కేరళ, కర్నాటక సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు, పినరయి విజయన్, సిద్ధరామయ్యను ఆహ్వానించారు.
అలాగే డీలిమిటేషన్‌తో నష్టపోనున్న ఉత్తారాదికి చెందిన పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా సీఎంలు భగవంత్‌మాన్, మమతా బెనర్జీ, మోహన్ చరణ్ మాఝీకి కూడా లెటర్ పంపారు. డీలిమిటేషన్‌పై పోరుకు తమకు సమ్మతి తెలిపాలని కోరారు. అలాగే, జేఏసీ ఏర్పాటుకు సమష్టి కార్యాచరణ కోసం ఈ నెల 22న చెన్నైలో సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనికి ఈ రాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతలు, అధికార, ప్రతిపక్ష నాయకులు హాజరుకావాలని కోరారు.
పార్లమెంట్‌లో హక్కులకు కోతపెట్టడమే
పాపులేషన్ ఆధారంగా డీలిమిటేషన్ పేరుతో కేంద్ర సర్కారు సమాఖ్యవాదంపై దాడి చేస్తున్నదని స్టాలిన్ మండిపడ్డారు. పార్లమెంట్‌లో తమ హక్కులకు కోత పెట్టాలని చూస్తున్నదని మండిపడ్డారు. ఈ పద్ధతిలో డీలిమిటేషన్ చేయడం అంటే పాపులేషన్కంట్రోల్ చేసిన రాష్ట్రాలను శిక్షించడమే అవుతుందని ఫైర్ అయ్యారు. మంచి పాలన కొనసాగించిన రాష్ట్రాలను నియోజకవర్గ పునర్విభజన పేరుతో అన్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని స్టాలిన్ ఆరోపించారు. జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్ జరిగితే తమిళనాడు 8 సీట్లు కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అన్యాయాన్ని తాము సంహించబోమని అన్నారు.
మన ప్రజాస్వామ్య పునాది ప్రమాదంలో ఉన్నప్పుడు, మనం అలాంటి అస్పష్టమైన హామీలను అంగీకరిద్దామా? మన రాష్ట్రాల భవిష్యత్తుకు పెను ప్రమాదం వాటిల్లుతున్నప్పుడు కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు ఒక్కటి కావొద్దా?” అని ఏడు రాష్ట్రాల సీఎంలను లేఖలో స్టాలిన్ ప్రశ్నించారు. కేంద్రం చేస్తున్న అన్యాయంపై రాజకీయ సంస్థలుగా కాకుండా భవిష్యత్తును కాపాడగలిగే వారిగా కలిసి నిలబడదామని పిలుపునిచ్చారు. కాగా, తమిళనాడుపై కేంద్రం బలవంతంగా హిందీ రుద్దుతున్నదని స్టాలిన్ ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా హిందీ రుద్ది.. బీజేపీ గెలవాలని చూస్తున్నదని మండిపడ్డారు.