
- వచ్చే 30 ఏండ్ల పాటు వాటినే ప్రాతిపదికగా తీసుకోవాలి
- బీజేపీ, ఎన్టీకే, తమిళ్ మానీలా కాంగ్రెస్ గైర్హాజరు
- దక్షిణాది రాష్ట్రాల ఎంపీలతో జేఏసీ ఏర్పాటుకు సీఎం స్టాలిన్ ప్రపోజల్
- ఇండియాను హిందీయాగా మార్చే ప్రయత్నం: కమల్ హాసన్
చెన్నై: 1971 జనాభా లెక్కల ప్రకారం లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని తమిళనాడు డిమాండ్ చేసింది. డీలిమిటేషన్ ఇష్యూపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టాలిన్ తీర్మానం ప్రవేశపెట్టారు. ‘‘డీలిమిటేషన్‌లో భాగంగా ఎంపీ సీట్ల సంఖ్యను పెంచాలనుకుంటే.. అందుకు 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలి.
ఇందుకోసం అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలి. అదే విధంగా 2026 నుంచి మరో 30 ఏండ్ల పాటు డీలిమిటేషన్ ప్రక్రియకు 1971 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలి. ఈ మేరకు ప్రధాని మోదీ పార్లమెంట్‌లో ప్రకటన చేయాలి. అన్ని రాష్ట్రాల్లో జనాభా నియంత్రణను ప్రోత్సహించేందుకు 1971 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ చేపడతామని 2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయి హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా 2026 నుంచి మరో 30 ఏండ్ల పాటు 1971 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ చేపడతామని హామీ ఇవ్వాలి” అని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ సమావేశానికి హాజరైన అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి. సమావేశంలో అన్నా డీఎంకే, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో పాటు యాక్టర్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పాల్గొన్నాయి. బీజేపీ, ఎన్టీకే, తమిళ్ మనీలా కాంగ్రెస్ గైర్హాజరయ్యాయి.
జేఏసీ ప్రతిపాదన..
డీలిమిటేషన్ ఇష్యూపై దక్షిణాది రాష్ట్రాల ఎంపీలతో జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేయాలని స్టాలిన్ ప్రతిపాదించారు. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై ప్రజలకు కమిటీ అవగాహన కల్పిస్తుందని చెప్పారు. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల డిమాండ్లను కేంద్రానికి తెలియజేస్తుందని, వాటిని నెరవేర్చేలా ఒత్తిడి తీసుకొస్తుందని తెలిపారు.
ఇండియాను హిందీయాగా మార్చే ప్రయత్నం: కమల్ హాసన్
డీలిమిటేషన్, హిందీ ఇంపోజిషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ మండిపడ్డారు. అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇండియాను హిందీయాగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు. ‘‘దేశంలోని అన్ని రాష్ట్రాలు హిందీ మాట్లా డేలా చేసి, తద్వారా ఎన్నికల్లో మెజార్టీతో గెలవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. మనం ఇండియా గురించి ఆలోచిస్తుంటే.. వాళ్లు మాత్రం హిందీయా కలలు కంటున్నారు” అని విమర్శించారు. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. పార్లమెంట్‌లో ఎంపీల సంఖ్యను పెంచాల్సిన అవసరం లేదన్నారు.