కిరాణా సరుకులు డెలివరీ చేసేందుకు వెళ్లిన ఓ డెలివరీ బాయ్ ఓ అపార్ట్‌మెంట్ భవనంలో ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. ఈ ఘటన గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన మూసాపేట నివాసి ఎల్ హరీష్ (24) ఆన్‌లైన్ కిరాణా దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆర్డర్ డెలివరీ చేయడానికి తన సహోద్యోగి రాజేష్‌తో కలిసి 2023 మే 31న ఉదయం 6 గంటలకు గచ్చిబౌలిలోని ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు.
డెలివరీ చేసేందుకు అపార్ట్‌మెంట్ లోని మూడవ అంతస్తుకు వెళ్లాడు. కింద అతని కోసం రాజేష్ ఎదురుచూస్తున్నాడు. ఎంతసేపైనా హరీష్ రాకపోవడంతో అపార్ట్‌మెంట్ సెక్యూరిటీకి రాజేష్ సమాచారం అందించాడు, దీంతో వారు అతని కోసం వెతకగా అతను అపార్ట్‌మెంట్ పైన వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.