డెలివరీ బాయ్ ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపై పోలీసులు పంజా విసిరారు. సైబరాబాద్ లోని మాదాపూర్ జోన్ లో డెలివరీ బాయ్ వేషయంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరిని పట్టుకున్నారు. వీరి దగ్గర భారీగా డ్రగ్స్ మరియు గంజాయిని పట్టుకున్నారు. ఘటన పై మాదాపూర్ డీసీపీ స్పందిస్తూ కొండాపుర్ లో నివాసం ఉంటున్న మారం పవన్ కుమార్ అలియాస్ పచ్చ పవన్ మరియు ఆదర్శ కుమార్ సింగ్ లు డెలివరీ బాయ్స్ రూపంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పక్కా సమాచారం రావడంతో వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని చెప్పారు.
కొండాపుర్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న సమయంలో ఏస్ఓటి పోలీసులు మరియు మాదాపుర్ పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. నిందితులు యువకులను లక్ష్యంగా చేసుకోని బెంగళూరు నుంచి MDMA డ్రగ్స్ విశాఖ సరిహద్దుల్లో నుంచి గంజాయి తెచ్చి నగరంలో విక్రయిస్తున్నారని విచారణలో తెలిసిందన్నారు. నిందితుల నుంచి రూ. 8 లక్షల విలువ చేసే 21 గ్రాముల MDMA డ్రగ్స్ 800 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.