
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత హోటల్స్ కు వెళ్లే వాళ్ల సంఖ్య తగ్గింది. ఇష్టమైన హోటల్ నుంచి నచ్చిన ఫుడ్ ను ఇంటికే తెప్పించుకుని తినే సదుపాయం ఉండటమే అందుకు కారణం. జొమాటో, స్విగ్గీ మొదలైన యాప్స్ లో బుక్ చేసుకునే ఎంచక్కా లాగించేస్తున్నారు నగరవాసులు.
కానీ ఈ వార్త చదివితే శాడిజానికి పరాకాష్ట అంటే ఇదేనేమో అంటారు. ఎందుకంటే ఎంతో ఇష్టంగా ఆర్డర్ పెట్టిన ఫూడ్ ను కొందరు బాయ్స్ ఎలా డెలివరీ చేస్తున్న విధానం చూస్తే వద్దురా సామీ.. ఆన్ లైన్ డెలివరీ అనక మానరు. అసలు ఊహకందనంత అసహ్యమైన పనిచేశాడు ఓ డెలివరీ బాయ్.
Narayan Parvathy Parasuram, Bollywood music composer: "Waiting at the Huma Kanjurmarg bus stop in Mumbai, my sight fell upon this Zomato guy opening each one of his food packages and doing something. On looking closely, I realised that he was spitting in each of the packages and… pic.twitter.com/6DXOc1fGvs
— Rakesh Krishnan Simha (@ByRakeshSimha) March 28, 2025
ముంబై లో జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ దారుణమైన పని చేశాడు. కస్టమర్స్ ఆర్డర్ చేసుకున్న ఫుడ్ ను మధ్యలో ఒకచోట ఆపి అందులో ఉమ్మి వేయడం ఆందోళన కలిగిస్తోంది. మార్గమధ్యలో ఆపి ఈ దారణం చేస్తున్న బాయ్ ను స్థానికంగా ఒక వ్యక్తి చూసి వీడియో తీశాడు. రాకేశ్ సింహ అనే వ్యక్తి వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశాడు. కంజుర్ మార్గ్ ఏరియాలో డెలివరీ బాయ్ చేసిన ఈ చండాలమైన పనికి నెటిజన్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేసిన రాకేశ్.. తన స్నేహితుడు, మ్యూజిక్ కంపోజర్ అయిన నారాయణ్ పార్వతీ పరశురామ్ ఈ వీడియో తీసినట్లు చెప్పాడు. ఫుడ్ డెలివరీ బాయ్ అనుమానస్పదంగా ఏదో చేస్తున్నట్లు కనిపించడంతో గమనించి వీడియో తీసినట్లు తెలిపాడు. ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ‘‘ఫుడ్ సేఫ్టీ, హైజీన్ స్టాండర్డ్స్ పరిస్థితి ఏంటి..? ఎంతో నమ్మకంతో ఫుడ్ ఆర్డర్ చేస్తుంటాం. పరిస్థితి ఇలా ఉంటే ఇక తినేది ఎలా..?’’ అని ప్రశ్నిస్తున్నారు.
వీడియో తీసిన నారాయణ్ ఈ ఘటన గురించి.. ‘‘ముంబైలోని హుమా కంజుమార్గ్ లో బస్ కోసం ఎదురుచూస్తున్న టైం లో డెలివరీ బాయ్ ప్రతి ప్యాకెట్ ఓపెన్ చేసి ఏదో చేస్తున్నట్లు కనిపించింది. దగ్గరికి వెళ్లి చూసే సరికి.. ప్రతి ప్యాకెట్ లో ఉమ్మి వేస్తున్నాడు. ఆ తర్వాత మళ్లీ వాటిని ప్యాక్ చేస్తున్నాడు. వీడియో తీస్తూ నేను దగ్గిరికి వెళ్లడం చూసీ వెంటనే పారిపోయాడు’’ అని చెప్పాడు.
దీనిపై జొమాటో యాజమాన్యం స్పందిస్తూ.. ‘‘ హై రాకేశ్. ఇలాంటి ప్రవర్తనను మేము అస్సలు సహించం. ఈ ఇన్సిడెంట్ జరిగిన టైం.. లొకేషన్ షేర్ చేయండి. వెంటనే యాక్షన్ తీసుకుంటాం..’’ అని ఎక్స్ లో రిప్లై ఇచ్చింది.
ఈ ఘటన తర్వాత నెటిజన్స్ సీరియస్ కామెంట్స్ పెడుతున్నారు. ‘‘ఇక నుంచి నేను ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయను’’ కొందరు అంటుంటే.. ‘‘ఎవరిని నమ్మాలి.. ఎలా నమ్మాలి.. ఈ ఫుడ్ఎలా తినాలి..?’ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు ఐతే.. ‘‘ఫుడ్ డెలివరీ బాయ్ చేసిన తప్పు గురించే కాదు మాట్లాడేది. ముందు దాన్ని ఎలా వండుతున్నారు.. ఎవరు వండుతున్నారు..? డెలివరీ కాకముందే కలుషితం అయితే ఏంటి పరిస్థితి.. ఆన్ లైన్ ఫుడ్ గురించి ఆలోచించాల్సిందే..’’ అని కామెంట్ చేస్తున్నారు.