- ఓ బ్యాగ్‌లో రూ. 7 లక్షల విలువైన బంగారు ఆభరణాలు.. మరో బ్యాగ్‌లో రూ. 3 లక్షలు
- వివరాలు పరిశీలించిన అనంతరం బ్యాగులను అప్పగించిన ఆఫీసర్లు
గోదావరిఖని, వెలుగు : బంగారు నగలతో ఉన్న బ్యాగ్‌ను ఓ మహిళ ఆర్టీసీ బస్సులో మర్చిపోవడంతో ఆఫీసర్లు తిరిగి ఆమెకు అప్పగించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామానికి తోట లక్ష్మి ఈ నెల 19న సికింద్రాబాద్ నుంచి గోదావరిఖనికి వస్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు ఎక్కింది. తర్వాత తన బ్యాగ్‌ను బస్సులోనే మర్చిపోయి మధ్యలో దిగిపోయింది. బస్సులో బ్యాగ్‌ను గుర్తించిన కండక్టర్ కె.శ్రీనివాస్ దానిని గోదావరిఖని డిపో ఆఫీసర్లకు అందజేశారు.
బ్యాగ్‌లో రూ. 7 లక్షల విలువైన 89 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్టు ఆఫీసర్లు గుర్తించారు. అనంతరం తోట లక్ష్మి డిపో వద్దకు చేరుకొని బ్యాగ్ తనదేనని ఆధారాలతో పాటు, అఫిడవిట్ సమర్పించడంతో బ్యాగ్‌ను ఆమెకు అందజేశారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ఎం.నాగభూషణం, ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్ కె.గీతాకృష్ణ, కె.సదానందం, సత్యనారాయణ, అఖిల పాల్గొన్నారు. బ్యాగ్‌ను నిజాయితీగా అప్పగించిన కండక్టర్ శ్రీనివాస్‌ను డిపో ఆఫీసర్లు, లక్ష్మి కుటుంబ సభ్యులు అభినందించారు.
రూ. 3లక్షలు ఉన్న బ్యాగ్‌ను...
కరీంనగర్ టౌన్ : ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి మర్చిపోయిన డబ్బులను ఆఫీసర్లు తిరిగి అప్పగించారు. డోలి పవన్ అనే వ్యక్తి మంచిర్యాల డిపోకు చెందిన బస్సులో ఈ నెల 20న మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు బయలుదేరాడు. మధ్యలో పెద్దపల్లి బస్టాండ్‌కు రాగానే రూ. 3 లక్షలు ఉన్న బ్యాగ్‌ను బస్సులోనే పెట్టి కిందకు దిగి టాయిలెట్‌కు వెళ్లాడు. తిరిగి వచ్చేలోపు బస్ వెళ్లిపోయింది. వెంటనే అక్కడ డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ పి.రమేశ్‌కు విషయం చెప్పడంతో ఆర్టీసీ గమ్యం యాప్ ద్వారా బస్సును ట్రేస్ చేసి, డ్రైవర్‌కు సమాచారం ఇచ్చారు.
బస్సు కరీంనగర్‌కు చేరుకోగానే బస్‌డ్రైవర్ బ్యాగ్‌ను ఆర్టీసీ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్‌కు అప్పగించాడు. తర్వాత పవన్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆధారాలను పరిశీలించిన అనంతరం కరీంనగర్ ఆర్‌ఎం సుచరిత చేతుల మీదుగా శుక్రవారం పవన్‌కు బ్యాగ్‌ను అప్పగించారు. కార్యక్రమంలో డీఆర్‌ఎస్ భూపతిరెడ్డి, సత్యనారాయణ, సురేంద్రనాథ్ పాల్గొన్నారు.