
- వాతావరణ మార్పులే కారణం
న్యూఢిల్లీ: ‘‘వాతావరణ మార్పుల ఫలితంగా వేడి పెరుగుతోంది. అంతేగాక ప్రజలు సౌకర్యాన్ని కోరుకుంటున్నారు. అందుకే మనదేశ ఏసీ మార్కెట్ సైజు నాలుగేళ్లలో రెట్టింపు అయింది. కిందటేడాది1.5 కోట్ల ఏసీలు అమ్ముడయ్యాయి” అని ఒక కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఆయన మాటలను బట్టి చూస్తే మనదేశంలో ఏసీలు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయని అర్థమవుతోంది. హీటింగ్, వెంటిలేషన్, ఏసీ, రిఫ్రిజిరేషన్(హెచ్వీఏసీఆర్) ఇండస్ట్రీ వృద్ధి శరవేగంతో దూసుకెళ్తోంది. గత ఏడాది రెసిడెన్షియల్ ఏసీ సెగ్మెంట్సేల్స్ 35 శాతం పెరిగాయని వోల్టాస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ముకుందన్ మీనన్ వివరించారు.
నాలుగేళ్ల క్రితం మనదేశంలో ఏడాదికి 70 లక్షల ఏసీలు మాత్రమే అమ్ముడయ్యాయి. మన ప్రభుత్వాలు ఇన్ఫ్రా కోసం ఎక్కువ ఖర్చు పెడుతుండటం కూడా ఏసీ, ఎయిర్ ప్యూరిఫికేషన్ మార్కెట్గ్రోత్కు సాయపడుతోంది. ఏసీల వంటి వైట్గూడ్స్ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం రూ.6,700 కోట్ల విలువైన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) స్కీమును నిర్వహిస్తోంది. ఈ మొత్తంలో రూ.5,700 కోట్లను ఇది వరకే కంపెనీలకు చెల్లించింది. పీఎల్ఐ స్కీము వల్ల ఏసీ కంపెనీలు దిగుమతులను తగ్గించుకొని, మనదేశంలో ఉత్పత్తిని పెంచాయి.
ఎక్స్పర్టులు ఏమంటున్నారంటే...
సత్వ గ్రూప్ డైరెక్టర్మహేశ్ ఖైతాన్ మాట్లాడుతూ కమర్షియల్, రియల్ఎస్టేట్ ఎదుగుదల కూడా ఏసీల అమ్మకాలకు కారణమని చెప్పారు. ఏటా 10 కోట్ల చదరపు అడుగుల్లో నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. నగరాల విస్తరణ వల్ల ఆధునిక హెచ్‌వీఏసీ సొల్యూషన్స్‌కు డిమాండ్ పెరుగుతోందని, వాతావరణ మార్పులు ఇందుకు కారణమవుతున్నాయని వివరించారు. మేకిన్ ఇండియా వల్ల మనదేశంలో క్వాలిటీ ప్రొడక్టులు తయారవుతున్నాయని, మనం ఇంటర్నేషనల్ మార్కెట్‌తో పోటీ పడగలుగుతున్నామని చెప్పారు. ‘‘2070 నాటికి నెట్‌జీరో కార్బన్స్ గోల్ సాధించాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది.
దీంతో పర్యావరణ అనుకూల టెక్నాలజీలకు డిమాండ్ పెరుగుతోంది. ఇంధన పొదుపు విషయంలో టెక్నాలజీ, డిజిటల్ సొల్యూషన్స్, రియల్ టైం డేటా ఎనలిటిక్స్ కీలక పాత్ర పోషిస్తాయ” అని జాన్సన్స్కంట్రోల్ ప్రెసిడెంట్, ఎండీ అరుణ్ అవస్థీ చెప్పారు. స్మార్ట్, కనెక్టెడ్, క్లైమైట్కంట్రోల్ సొల్యూషన్స్ భారీ ఎత్తున అమ్ముడవుతున్నాయని ఇన్ఫార్మా మార్కెట్ ఎండీ యోగేశ్ ముద్రాస్ చెప్పారు. ఈ సెక్టార్ వృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వార్షిక వృద్ధి 16 శాతం వరకు ఉందని తెలిపారు. ముఖ్యంగా ఇన్వర్టర్ ఏసీలకు, డక్ట్‌లెస్ సిస్టమ్స్‌కు డిమాండ్పెరగడం ఈ గ్రోత్‌కు కారణమని వివరించారు.