చెన్నూరు పట్టు.. స్టేట్​లో బెస్టు... నాణ్యతతో పండిస్తుండగా దేశవ్యాప్తంగా డిమాండ్

  • మంచిర్యాల జిల్లాలో 7 వేల ఎకరాల్లో టస్సర్​ పట్టు సాగు
  • ఏడాదికి రెండు పంటలు తీస్తున్న పట్టు రైతులు 
  • ఈ సీజన్​లో టార్గెట్ మించి 29 లక్షల పట్టుగూళ్ల ఉత్పత్తి 
  • రాష్ట్రంలో 50 శాతం దిగుబడి ఇక్కడే..
  • త్వరలోనే ఓపెన్​ ఆక్షన్​ ద్వారా అమ్మకం 

మంచిర్యాల, వెలుగు: దసలి(టస్సర్) పట్టు గూళ్ల ఉత్పత్తిలో మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు బెస్ట్ గా.. ఫస్ట్ ప్లేసులో నిలుస్తోంది. తెలంగాణలో ఉత్పత్తయ్యే పట్టులో దాదాపు 50 శాతం దిగుబడి ఇక్కడ్నుంచే వస్తోంది.  ఇక్కడి పట్టు గూళ్లు నాణ్యతతో ఉంటుండగా దేశవ్యాప్తంగా మంచి డిమాండ్​ ఉంది. వివిధ రాష్ర్టాల వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేస్తుంటారు.

ఈసారి జిల్లాలో దాదాపు 7 వేల ఎకరా ల్లో పట్టు సాగవుతోంది. చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి, నెన్నెల మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 650 గిరిజన కుటుంబాలు పట్టు సాగు చేస్తున్నాయి. వీరికి పట్టు గుడ్లను ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తోంది. ఆగస్టు, సెప్టెంబర్​లో విత్తన పంట వేసి అక్టోబర్​, నవంబర్​లో రీలింగ్​లేదా కమర్షియల్​పట్టు గూళ్లు ఉత్పత్తి చేస్తున్నారు. ఇలా ఏటా రెండు పంటలు తీస్తూ ఒక్కో రైతు రూ.లక్ష వరకు సంపాదిస్తున్నారు.

దశాబ్దాల కాలంగా సాగు 

చెన్నూరు అడవుల్లో ఏరుమద్ది, నల్లమద్ది చెట్లు భారీగా ఉండడంతో ఇక్కడ వంద ఏండ్ల నాటినుంచే దసలి పట్టుగూళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. వీరి కృషిని గుర్తించిన ప్రభుత్వం 1982లో సెంట్రల్​సిల్క్​బోర్డు ఆధ్వర్యంలో చెన్నూరులో పట్టుగూళ్ల ఉత్పత్తి, అమ్మక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కమర్షియల్​గా ఉత్పత్తి చేస్తున్నారు. లంబడిపల్లి, ఎల్లక్కపేట శివార్లలో సెరికల్చర్​ డిపార్ట్​మెంట్​కు 306 ఎకరాలను కేటాయించింది. ఇందులో 90 ఎకరాలను సెంట్రల్​సిల్క్​బోర్డుకు, 206 ఎకరాలను స్టేట్ సెరికల్చర్​డిపార్ట్​మెంట్​కు ఇచ్చారు. ఆయా భూముల్లో పట్టుగూళ్ల ఉత్పత్తికి ప్లాంటేషన్ ఏర్పాటు చేసి వేల సంఖ్య లో ఏరుమద్ది, నల్లమద్ది చెట్లను పెంచుతున్నారు. ఇందులో 100 ఎకరాలకు పైగా భూములు గత ప్రభుత్వ హయాంలో కబ్జాదారుల పాలయ్యాయి. 

ఈ నెలాఖరులో ఓపెన్ ఆక్షన్  

జిల్లాలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో పట్టుగూళ్ల ఉత్పత్తి జరిగింది. టార్గెట్ 24.10 లక్షలు కాగా, అదనంగా మరో 5 లక్షలు కలుపుకుని 29.10 లక్షలు సాధించారు. రాష్ర్టవ్యాప్తంగా 60 లక్షల టార్గెట్​కు దాదాపు సగం ఇక్కడే పండించారు. ఈ నెలాఖరులో ఓపెన్​ఆక్షన్​ నిర్వహించేందుకు సెరికల్చర్​అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి రూ.6.50 ధర వస్తుందని అంచనా వేస్తున్నారు.  మహారాష్ర్ట, చత్తీస్​గడ్​​, మధ్యప్రదేశ్, జార్ఖండ్​, ఒడిశా, వెస్ట్​ బెంగాల్​ తదితర రాష్ర్టాల నుంచి వ్యాపారులు వచ్చి పోటీపడి కొనుగోలు చేస్తుంటారు. 

పనులు పూర్తి కాక..

చెన్నూరు​ కొత్త బస్టాండ్ పక్కన సెరికల్చర్​ గోడౌన్, సిబ్బంది క్వార్టర్లు ఉండగా.. వీటిని1985లో నిర్మించారు. స్టోరేజీ బిల్డింగ్ ​కోసం మూడేండ్ల కిందట అప్పటి కలెక్టర్​ భారతి హోళికేరి రూ.40 లక్షలు మంజూరు చేయగా..  బిల్డింగ్​ నిర్మాణం తుది దశలో ఉంది. పట్టుగూళ్ల నుంచి రైతులు దారం తీసి అమ్మితే అదనపు ఆదాయం కూడా వస్తుందని భావించి అవసరమైన మెషీన్లు, ట్రైనింగ్ కోసం మరో రూ.20 లక్షలు కేటాయించారు. ఏండ్లు గడుస్తున్నా పనులు పూర్తికాకపోవడంతో  పట్టు రైతులు అందుబాటులోకి రావడంలేదు.  ప్రభుత్వం ప్రోత్సహించినట్లైతే గిరిజన రైతు కుటుంబాలకు ఉపాధి లభించడమే కాకుండా టస్సర్​ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే నంబర్​వన్​గా నిలిచే అవకాశముంది. 

ALSO READ : వరదల్లేని నగరంగా హైదరాబాద్.. మూసీలో మంచినీళ్లు ప్రవహించేలా చేస్తం: సీఎం రేవంత్​​

జిల్లాలో ఏకైక వీవర్స్​ సొసైటీ

జిల్లాలోని నెన్నెల మండలం కుశ్నపల్లి లో ఏకైక టస్సర్ ​వీవర్స్​ సొసైటీ ఉంది. ఇక్కడ 20 కుటుంబాలు పట్టుగూళ్ల నుంచి దారం తీసి వస్ర్తాలను నేస్తున్నాయి. దీంతో పాటు రాష్ర్టంలో మహదేవపూర్​లో ఒకటి, మహబూబ్​నగర్​లో మరో రెండు సొసైటీలు టస్సర్​సిల్క్​ వస్ర్తాలను ఉత్పత్తి చేస్తున్నాయి. జిల్లాలో ఉత్పత్తి అయిన పట్టు గూళ్లలో 25 శాతం కుశ్నపల్లి వీవర్స్​సొసైటీకి 50 శాతం సబ్సిడీపై కేటాయిస్తున్నారు. 

రికార్డు స్థాయిలో ఉత్పత్తి

ఈ ఏడాది జిల్లాలో రికార్డు స్థాయిలో దసలి పట్టు గూళ్ల ఉత్పత్తి సాధించాం. ప్రాసెసింగ్​ప్రక్రియ పూర్తికాగానే ఈ నెలాఖరులో ఓపెన్​ఆక్షన్​ద్వారా అమ్ముతాం. పట్టుకు డిమాండ్​ఎక్కువగా ఉండడంతో ఒక్కో గూడుకు రూ.6.50 ధర వస్తుందనుకుంటున్నాం. త్వరలోనే పెండింగ్​పనులను పూర్తి చేసి గిరిజన రైతులకు దారం తీయడంపై శిక్షణ కూడా ఇస్తాం.
– పార్వతి రాథోడ్, సెరికల్చర్​ ఏడీ, చెన్నూరు