మొద్దు నిద్రలో ఎస్టీపీపీ యాజమాన్యం : పేరం రమేశ్

  •  బీఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేరం రమేశ్

జైపూర్, వెలుగు : కాంట్రాక్ట్ కార్మికుల హక్కులను కాలరాస్తున్న ఎస్టీపీపీ యాజమాన్యం మొద్దు నిద్ర వీడాలని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్​లో పని చేసే కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్​ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్​ ఎరుగా బీఎంఎస్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పేరం రమేశ్ మాట్లాడుతూ ఐదేండ్ల ఏళ్ల నుంచి పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, స్కిల్డ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల శ్రమను దోచుకుంటున్న కాంట్రాక్టర్లను తొలగించాలని, ఎస్టీపీపీ ప్రభావిత గ్రామాల కార్మికులకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.

ఎస్టీపీపీ క్యాంటీన్ లో పురుగుల అన్నం పెడుతున్నారని, వెంటనే క్యాంటీన్ కాంట్రాక్ట్ ను రద్దు చేయాలన్నారు. 300 మంది కార్మికులు చేస్తున్న ఈ నిరసనకు బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్, చెన్నూరు నియోజకవర్గ ఇన్​చార్జ్ అందుగుల శ్రీనివాస్ మద్దతు తెలిపి మాట్లాడారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఎస్టీపీపీ యాజమాన్యం బోనస్ చెల్లించకపోవడం బాధాకరమన్నారు. సీఎస్ఆర్ నిధులన్నీ సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారని, ఇసుక క్వారీల పేరుతో రోజుకు రూ.2 కోట్లను చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్​ దండుకున్నారని ఆరోపించారు. ఎస్టీపీపీ ప్రెసిడెంట్ రాజేందర్​రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుస్స భాస్కర్, వైస్ ప్రెసిడెంట్ చిలికాని వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ బోడకుంట శ్రీధర్, సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.