- జిల్లాలో ఇప్పటివరకు వెయ్యికి పైగా బైక్‌లు
- ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు పెరుగుతున్న డిమాండ్
- ఇంట్రెస్ట్ చూపిస్తున్న యూత్
- డైలీ సగటున 10 నుంచి 12 వరకు రిజిస్ట్రేషన్స్
హనుమకొండ, వెలుగు: ఎలక్ట్రిక్ వెహికల్స్ కు డిమాండ్ పెరిగింది. ఫ్యూయల్ ఛార్జెస్ సెంచరీ దిగకపోవడం, పొల్యూషన్ కూడా ఎక్కువవుతుండటంతో చాలామంది ఈ–వెహికల్స్‌కు మొగ్గు చూపుతున్నారు. ప్యాసింజర్ సేవల కోసం ఈ-ఆటోలకు డిమాండ్ ఎక్కువవుతుండగా, ఈ-బైక్స్ పై యూత్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో వాటి సేల్స్ పెరుగుతున్నాయి. గతంలో నెలకు ఒకట్రెండు మాత్రమే ఎలక్ట్రిక్ బైకులు అమ్ముడు కాగా, ఇప్పుడు ఆర్టీఏ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న టూ వీలర్స్ లో మూడో వంతు ఎలక్ట్రిక్ బైకులే
ఉంటున్నాయి.
ముప్పావు వంతు ఎలక్ట్రిక్ బైకులే..
హనుమకొండ జిల్లాలో ఏటా సగటున 8 వేలకు పైగా బైకులు పెరిగిపోతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం పెట్రోల్ తో నడిచే బైకులు 4.01 లక్షల వరకు ఉన్నట్లు అధికారుల రికార్డులు చెబుతుండగా, నిత్యం 40 నుంచి 50 వెహికల్స్ రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీస్ లో క్యూ కడుతున్నాయి. కొత్తగా రిజిస్ట్రేషన్ కోసం వచ్చే బండ్లలో కనీసం 10 నుంచి 12 వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలే ఉంటున్నాయి. ఇప్పటికే జిల్లాలో వెయ్యికిపైగా ఈ-బైక్స్ ఉండగా, ఈ మధ్యకాలంలో నెలకు సగటున 250 నుంచి 300 ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతుండటం విశేషం. గతంతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ పెరగగా, పెట్రోల్ వెహికల్స్ అమ్మకాలు కొంతమేర తగ్గినట్లు తెలుస్తోంది.
ఇంట్రెస్ట్ చూపుతున్న యూత్..
కాలుష్యాన్ని నియంత్రించి, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఇదివరకు కేంద్ర ప్రభుత్వం ఫేమ్ ఇండియా స్కీం వన్, టూ ఫేజ్ ల కింద కిలో వాట్ కు రూ.10 వేల చొప్పున సబ్సిడీలు కూడా అందించింది. దీంతో చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపగా, ఇటీవల కాలంలో ఆ ప్రభావం ఇంకాస్త ఎక్కువైంది. రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ సదుపాయం కల్పించడం, ఒక్కో ఈ-బైక్ 3 యూనిట్ల కరెంట్ తోనే 90 నుంచి వంద కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉండటంతో చాలామంది ఈ బైక్స్ కు మొగ్గు చూపుతున్నారు. కొన్ని కంపెనీలు స్కూటీతో స్పోర్ట్స్ బైక్ మోడల్స్ ను కూడా ఇంట్రడ్యూస్ చేయడంతో మరింత క్రేజ్‌వచ్చింది.
Also Read :- మంచి జరుగుతదని..గణపతి లడ్డూల చోరీ
ఈ-రిక్షాలకు పెరుగుతున్న డిమాండ్..
ఎలక్ట్రిక్ బైకుల ఇప్పటికే జనాల్లోకి వెళ్లిపోగా, ఆటోలు కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. జిల్లాలో మొత్తంగా 19,600కు పైగా ఆటో రిక్షాలు ఉండగా, ఈ-రిక్షాలకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఆటోల్లో 8 యూనిట్ల కరెంట్ తోనే 150 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే అవకాశం ఉండంతో చాలామంది డీజిల్ బండ్లను వదిలి ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికి ఆర్టీఏలో నమోదైన ప్రకారం కేవలం హనుమకొండ జిల్లాలోనే 12 ఈ-రిక్షాలు ఉండగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందకు పైగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ ఆటోల అమ్మకాలు పెరుగుతుండగా, అన్ని కంపెనీలు కలిపి నెలకు సగటుగా 20 కిపైగా సేల్ చేస్తున్నట్లు డీలర్స్ చెబుతున్నారు. మున్ముందు ఎలక్ట్రిక్ ఆటోల సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం
చేస్తున్నారు.
ఎలక్ట్రిక్ బైకులు పెరుగుతున్నయ్..
గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ఎలక్ట్రిక్ వెహికల్స్ సంఖ్య పెరిగింది. ఇదివరకు రిజిస్ట్రేషన్ కోసం పెట్రోల్ బైక్‌లే ఎక్కువ రాగా, ఇప్పుడు ఈ-బైకుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఎలక్ట్రిక్ ఆటోలు కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ, అవి కూడా రిజిస్ట్రేషన్ కోసం డైలీ 3 నుంచి 4 వస్తున్నాయి.
- రమేశ్‌రాథోడ్, ఎంవీఐ, హనుమకొండ