తెలంగాణలో కరెంట్ మస్తు వాడుతున్నరు: ఎండాకాలం లెక్క విద్యుత్ డిమాండ్

తెలంగాణలో కరెంట్ మస్తు వాడుతున్నరు: ఎండాకాలం లెక్క విద్యుత్ డిమాండ్
  • 14,500 మెగావాట్లకు పైగా నమోదు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరెంట్ మస్తు వాడుతున్నరు. పట్టణ ప్రాంతాల్లో గీజర్లు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ మోటార్లు ఎక్కువసేపు నడుస్తుండడంతో విద్యుత్ డిమాండ్ పెరిగింది. చలికాలంలోనే ఎండాకాలం లెక్క విద్యుత్ డిమాండ్ నమోదవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా గత వారం రోజులుగా ప్రతిరోజు 250 మిలియన్ యూనిట్లకు పైగా కరెంట్ వినియోగం జరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సాగు జోరందుకోవడంతో వ్యవసాయానికి కరెంట్ వినియోగం పెరిగింది.

రాష్ట్రంలో మొత్తం 29 లక్షల వ్యవసాయ మోటార్లు నడుస్తున్నాయి. ప్రతిరోజు వినియోగించే 260 మిలియన్ యూనిట్లలో వ్యవసాయానికే 80 మిలియన్ యూనిట్లకు పైగా వెళ్తున్నది. పట్టణ ప్రాంతాలతో గీజర్ల వాడకం పెరగడంతో కరెంట్ డిమాండ్ ఎక్కువగా ఉంటున్నది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు డొమెస్టిక్​యూసేజ్ పెరిగిందని, ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య పీక్​డిమాండ్​ ఉంటున్నదని అధికారులు చెబుతున్నారు. 

విద్యుత్ డిమాండ్ పీక్.. 

వచ్చే నెలలో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే పది రోజులుగా రోజూ 14 వేల మెగావాట్ల కంటే ఎక్కువ డిమాండ్​ నమోదవుతున్నది. గత గురువారం 14,785 మెగావాట్లు, శుక్రవారం 14,846 మెగావాట్ల డిమాండ్ రికార్డయింది. ఈ రోజుల్లో 268 మిలియన్​యూనిట్లు సరఫరా జరిగితే.. అందులో జెన్​కో ఉత్పత్తి చేసింది 87 నుంచి 89 మిలియన్​యూనిట్లు మాత్రమే.

ప్రస్తుతం సింగరేణి నుంచి 24, సెంట్రల్​జనరేటింగ్​స్టేషన్ల నుంచి 123, నేషనల్ ఎక్స్ఛేంజ్ ల 44 మిలియన్ యూనిట్ల వరకు సేకరిస్తున్నారు. మార్చి నాటికి విద్యుత్ డిమాండ్​17 వేల మెగావాట్ల వరకు ఉంటుందని అంచనా. ఎంత డిమాండ్​ఉన్నా సరఫరా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడానికి విద్యుత్ సంస్థలు ఈ నెల 27 నుంచి వారం రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నాయి.