హైదరాబాద్ లో ప్రీమియం ఇండ్లకు గిరాకీ.. కోటిన్నర నుంచి రూ.2.50 కోట్ల రేంజ్ ఇండ్లపైనే జనం మక్కువ

  • అమ్ముడైన యూనిట్లలో 40 శాతం ఆ రేంజ్​లోనివే
  • రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర మధ్యవి 37 శాతం 
  • సిలికాన్ సిటీగా పేరున్న వెస్ట్​జోన్​లోనే ఎక్కువ సేల్స్ 
  • ఇంటి రెంట్లు, ఫ్లాట్ల ధరల్లోనూ పెరుగుదల 
  • అనరాక్ మూడో త్రైమాసిక నివేదిక​లో వెల్లడి 

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్​ సిటీలో ప్రీమియం ఇండ్లకు గిరాకీ పెరుగుతున్నది. నిర్మాణం నుంచి కొనుగోళ్ల దాకా హైఎండ్​, లగ్జరీ ఫ్లాట్లవైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో కొత్తగా 13,900 యూనిట్ల నిర్మాణం జరగగా, అందులో 12,700 యూనిట్లు అమ్ముడుపోయాయి. వాటిలో ఎక్కువగా 40 శాతం వరకు రూ. కోటిన్నర నుంచి రూ.2.5 కోట్ల విలువైన ఫ్లాట్లపైనే ప్రజలు ఎక్కవగా ఆసక్తి చూపించారు. 37 శాతం మంది రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర రేంజ్​లో ఉన్న ఇండ్లను కొంటున్నారు.

అనరాక్ అనే ప్రాపర్టీ సంస్థ విడుదల చేసిన తాజా రిపోర్ట్​లో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా అత్యధిక యూనిట్లు అమ్ముడైన టాప్ 7 సిటీల జాబితాలో హైదరాబాద్ ఉన్నట్టు రిపోర్ట్​లో పేర్కొన్నారు. దేశంలో అమ్ముడైన ఇండ్లలో 12 శాతం యూనిట్లు హైదరాబాద్​లోనే ఉన్నాయి. అయితే, రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో త్రైమాసికంలో సేల్స్ 16 శాతం తక్కువగా ఉన్నా.. ఎక్కువ మంది మాత్రం అన్ని హంగులూ ఉన్న ఫ్లాట్లవైపే మొగ్గుచూపుతున్నట్టు రిపోర్ట్ వెల్లడించింది. 

ఎక్కువగా సిలికాన్ సిటీలోనే..

హైదరాబాద్ సిటీకి సిలికాన్ వ్యాలీగా పిలిచే వెస్ట్​జోన్​లోనే ఫ్లాట్లకు అధిక డిమాండ్ ఉన్నట్టు రిపోర్ట్ తేల్చింది. గచ్చిబౌలి, తెల్లాపూర్, కొండాపూర్, మణికొండ, కూకట్​పల్లి, అత్తాపూర్, కోకాపేట, మాదాపూర్, అప్పా జంక్షన్​లో ఫ్లాట్లు ఎక్కువగా సేల్ అవుతున్నాయి. మొత్తం అమ్ముడైన యూనిట్లలో 54 శాతం ఫ్లాట్లు ఈ వెస్ట్​జోన్​లోనే ఉన్నాయి. ఆ తర్వాత మియాపూర్, పోచారం, బాచుపల్లి, నిజాంపేట్, బొల్లారం, యాప్రాల్, శామీర్​పేట ప్రాంతాలున్న  నార్త్​జోన్​.. 28 శాతం అమ్మకాలతో రెండో ప్లేస్​లో ఉన్నది. అయితే, సర్కార్ ఫ్యూచర్​ సిటీని ఏర్పాటు చేస్తామని చెబుతున్న సౌత్​జోన్​లో ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు పెరుగుతున్నాయి.

శంషాబాద్, ఆదిభట్ల, మహేశ్వరం, షాద్​నగర్​, రాజేంద్రనగర్, శ్రీశైలం హైవే ప్రాంతంలో 13 శాతం యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈస్ట్​జోన్ అయిన ఎల్బీ నగర్, నాగోల్, ఉప్పల్, హబ్సిగూడ, ఘట్కేసర్, నాచారం, పీర్జాదిగూడ, వనస్థలిపురం ఏరియాల్లో 4 శాతం యూనిట్లు అమ్ముడవగా.. సెంట్రల్ జోన్​లో అత్యల్పంగా ఒక్క శాతం ఇండ్లు మాత్రమే సేల్ అయ్యాయి. వెస్ట్, నార్త్, సౌత్​జోన్​లతో పోలిస్తే సెంట్రల్​జోన్​లో ధరలు ఎక్కువగా, యూనిట్ల సంఖ్య తక్కువగా ఉండటం వల్లే అక్కడ సేల్స్ తక్కువగా ఉన్నట్టు రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. 

నార్త్ ఇండియన్స్ ఆసక్తి.. 

సాఫ్ట్​వేర్ ఇంజనీర్లు, ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగాల కోసం ఇక్కడికి వచ్చినవాళ్లు, ముఖ్యంగా నార్త్​ఇండియన్స్​కొనుగోళ్ల వల్లే వెస్ట్​జోన్​లో ఎక్కువ ఇండ్లు అమ్ముడవుతున్నాయని రియల్​ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి సిటీలతో పోలిస్తే హైదరాబాద్​లో ఫ్లాట్ల ధరలు తక్కువగా ఉంటుండడంతో చాలా మంది ఇక్కడ ఇన్వెస్ట్​చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు.

ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి సిటీల్లో 1200 చదరపుటడుగుల ఫ్లాట్​కు నాలుగైదు కోట్ల దాకా ధరలు ఉండగా.. హైదరాబాద్​లో రూ.2 కోట్లలోపే అన్ని హంగులతో లభిస్తుండడంతో ఇక్కడ కొనుగోలు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. మరోవైపు సాఫ్ట్​వేర్​తో పాటు దానికి లింక్ అయిన చాలా సంస్థలు వెస్ట్​జోన్​లోనే ఎక్కువగా ఉండటంతో ఆయా సంస్థల్లో పనిచేసే ఎంప్లాయ్స్, ఉన్నతస్థాయి అధికారులు ఇక్కడే ఇండ్లను కొంటున్నట్టు చెబుతున్నారు. దగ్గరగా ఉంటే ఆఫీసుకు వెళ్లడం ఈజీ అవుతుందని, ట్రాఫిక్ ఇబ్బందులూ ఉండవన్న ఉద్దేశంతోనే వెస్ట్​జోన్​లో ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారని భావిస్తున్నారు. 


ఇండ్ల ధరలు.. రెంట్లు పెరిగినయ్​

తొలిసారిగా హైదరాబాద్​లో అమ్మడానికి సిద్ధంగా ఉన్న ఇండ్లు లక్ష దాటాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 1,01,100 యూనిట్లు అమ్మకానికి రెడీగా ఉన్నట్టు రిపోర్ట్​లో పేర్కొన్నారు. సిటీలో ఒక స్క్వేర్​ఫీట్ ధర రూ.7,150గా ఉందని రిపోర్ట్ పేర్కొంది. గత త్రైమాసికంలో ఉన్న రూ.6,900 ధరతో పోలిస్తే ఈ క్వార్టర్​లో సగటున స్క్వేర్​ఫీట్​కు రూ.250 పెరిగింది. మొత్తంగా సిటీలోని అన్ని జోన్లలోనూ ఇండ్ల ధరలతో పాటు రెంట్లు కూడా పెరిగాయి. గచ్చిబౌలిలో స్క్వేర్​ఫీట్​కు రూ.8,900 ధర పలుకుతుండగా.. గత త్రైమాసికంతో పోలిస్తే 5 శాతం మేర ధర పెరిగింది.

ఇక్కడ రెంట్లు కూడా 30 వేల నుంచి రూ.42 వేల రేంజ్​లో ఉండగా.. ఒక శాతం మేర కిరాయి పెరిగింది. కొండాపూర్​లో స్క్వేర్​ఫీట్​కు రూ.8,600 ఉండగా.. ధరలు 5 శాతం పెరిగాయి. రెంట్లు రూ.27 వేల నుంచి రూ.33 వేల మధ్య ఉన్నాయి. కిరాయి 2 శాతం పెరిగింది. సౌత్, ఈస్ట్​జోన్లతో పోలిస్తే వెస్ట్​జోన్​లో ధరలు దాదాపు రెట్టింపుగా ఉన్నాయి. మరోవైపు ఎక్కువగా కొనుగోళ్లు జరుగుతున్న వెస్ట్​జోన్​లోనే.. మిగిలిపోతున్న ఫ్లాట్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటున్నట్టు రిపోర్ట్​లో తేలింది. వెస్ట్ జోన్ లోనే 60 శాతం యూనిట్లు అమ్ముడుపోకుండా ఉంటున్నాయని వెల్లడైంది. ఇటువైపు ప్రాంతాల్లో మాత్రం రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర మధ్య ఉన్న 51 శాతం ఫ్లాట్లు అమ్ముడుకాలేదని రిపోర్ట్ పేర్కొంది. 

సిటీలోని వివిధ ప్రాంతాల్లో రెంట్లు, ఇండ్ల ధరల వివరాలు..

ప్రాంతం                     రెంట్                        ఫ్లాట్​ధర                        రెంట్​         ఫ్లాట్​ధర

                            (నెలకు రూ.లలో)    (చదరపు అడుగుకు)    పెరుగుదల    పెరుగుదల


గచ్చిబౌలి                30,000‌‌‌‌–42,000                    8,900                          1%                5%
కొండాపూర్​              27,000–33,000                    8,600                          2%                 5%
మియాపూర్​             20,000–27,000                    6,700                          4%                 3%
ఎల్బీనగర్​               13,500–17,500                    6,800                          3%                 3%
ఆదిభట్ల                  14,000–19,000                     4,650                           3%                 3%