- జనవరి 22 కోసం మార్కెట్లో పెరిగిన డిమాండ్
- విదేశాల నుంచి కూడా వ్యాపారులకు ఆర్డర్లు
వారణాసి: అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో రామ మందిరం థీమ్ తో నేసిన బనారస్చీరలకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న విషయం తెలిసిందే. ఆ రోజు దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ పూజలకు సందర్భానుసారంగా ధరించేందుకు మహిళలు పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. అమెరికా సహా విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు. యూపీలోని ముబారక్‌పూర్ ప్రాంతానికి చెందిన నేత అనిసూర్ రెహమాన్ మాట్లాడుతూ..‘‘చారిత్రక విశేషాలను తెలుపుతూ తయారు చేసే చీరలకు మా దగ్గర చాలా డిమాండ్ ఉంది.
అయితే మేము ఇప్పుడు రామమందిరం థీమ్‌తో చీరలను సిద్ధం చేస్తున్నాం. ఇవి త్వరలో ఫ్యాషన్ ట్రెండ్సృష్టించబోతున్నాయి. ఈ చీరలు కట్టుకొని వారి వారి ప్రాంతాల్లో జనవరి 22 న పూజలలో పాల్గొనాలని మహిళలు భావిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మాకు ఆర్డర్లు రావడమే దీనికి నిదర్శనం’’ అని ఆయన చెప్పారు. పీలి కోఠి ప్రాంతానికి చెందిన మరో నేత మదన్ స్పందిస్తూ.. ‘‘రామ్ దర్బార్ వర్ణన ఉన్న చీరలకు చాలా డిమాండ్ ఉంది. రామ మందిర్ ప్రారంభోత్సవం నేపథ్యంలో అమెరికా నుంచి ఆర్డర్లు అందాయి” అని తెలిపారు. కాగా క్వాలిటీ, డిజైన్‌ను బట్టి ఒక్కో చీర ధర రూ.7,000 నుంచి రూ.లక్ష వరకు ఖరీదు చేస్తాయని వ్యాపారులు చెబుతున్నారు.