గెస్ట్ లెక్చరర్ల ఇంటర్ బోర్డు ముట్టడి.. రెన్యూవల్ చేయాలని డిమాండ్

గెస్ట్ లెక్చరర్ల ఇంటర్ బోర్డు ముట్టడి..  రెన్యూవల్ చేయాలని డిమాండ్

 

  • గెస్ట్ లెక్చరర్ల ఇంటర్ బోర్డు ముట్టడి
  • రెన్యూవల్ చేయాలని డిమాండ్
  • బోర్డు ఆఫీస్ ఎదుట ధర్నా.. అరెస్ట్
  • దిగొచ్చిన అధికారులు.. సాయంత్రానికి ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: హైకోర్టు ఆదేశాల మేరకు తమను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తూ గెస్ట్ లెక్చరర్లు మంగళవారం ఇంటర్ బోర్డు ఆఫీస్​ను ముట్టించారు. హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడం ఏంటని మండిపడ్డారు. వర్షాన్ని లెక్కచేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో గెస్ట్ లెక్చరర్లు తరలివచ్చి బోర్డు ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో గెస్ట్ లెక్చరర్లు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. పదేండ్ల నుంచి పని చేస్తున్న 1,654 మంది గెస్ట్ లెక్చరర్ల జీవితాలను రోడ్డు పాలు చేసిన పాపం ఈ ప్రభుత్వానిదేనన్నారు. 

కమిషనర్ నవీన్ మిట్టల్ పాత వాళ్లందరినీ తొలగించారని, ప్రభుత్వ పెద్దలను కలిసి విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి హైకోర్టును ఆశ్రయించగా.. పాత వారిని కొనసాగించాలని శుక్రవారం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. వాటిని నవీన్ మిట్టల్ బేఖాతర్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాల విషయమై అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదన్నారు. ఐదు నెలలుగా వేతనాలు పెండింగ్​లో ఉన్నాయని మండిపడ్డారు. ధర్నాలో గెస్ట్ లెక్చరర్ల సంఘం నేతలు యాకుబ్ పాషా, రాజ్​కుమార్, దార్ల భాస్కర్, మధుసూదన్ రెడ్డి, కీర్తి, ప్రీతి, ఆదర్శ, కల్పన తదితరులు పాల్గొన్నారు. 

ALSO READ :సీఎంగా రికార్డు దిశలో నవీన్​ పట్నాయక్​

రెన్యువల్ చేస్తూ ఆదేశాలు

గెస్ట్ లెక్చరర్ల ఆందోళనకు ఇంటర్ అధికారులు దిగొచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు గెస్ట్ లెక్చరర్లను 2023–24 విద్యాసంవత్సరంలోనూ కొనసాగిస్తూ ఆదేశాలు జారీచేశారు. ఈమేరకు ఇంటర్ బోర్డు అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. గెస్ట్ లెక్చరర్లు లేని స్థానంలో కొత్తవారిని తీసుకోవాలని ఆర్జేడీ జయప్రదబాయి ఆదేశాలిచ్చారు.