కాకతీయ టైగర్‌‌‌‌‌‌‌‌ రిజర్వ్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయాలి

కాకతీయ టైగర్‌‌‌‌‌‌‌‌ రిజర్వ్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయాలి

తెలంగాణ  రాష్ట్రంలోని ఉమ్మడి  వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా దట్టమైన అటవీ సంపదను కలిగి ఉండి అరుదైన వృక్ష,  జంతుజాలాలకు ఆవాసంగా ఉంది.  రెండు రక్షిత అభయారణ్యాలైన పాకాల అభయారణ్యం 839 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో,  ఏటూరు నాగారం అభయారణ్యం 806 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంది. జిల్లాల పునర్విభజన వల్ల పాకాల అభయారణ్యం మహబూబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోకి,  ఏటూరు నాగారం అభయారణ్యం ములుగు జిల్లాలోకి వెళ్లాయి.

ఈ రెండు అభయారణ్యాలు కూడా కృష్ణా,  గోదావరి  నదుల  పరీవాహక వ్యవస్థను కాపాడుతున్నాయి.  ఉదాహరణకి  కృష్ణా నదిలో కలిసే మున్నేరు వాగు పాకాల అభయారణ్యం నుంచి ఆవిర్భవించింది.  గోదావరి నదిలో కలిసే జీడివాగు, పెద్దవాగు, జంపన్నవాగు లాంటి చిన్నపాటి నదులన్నీ కూడా ఏటూరు నాగారం అభయారణ్యం నుంచి మొదలవుతాయి. ఈ రెండు అభయారణ్యాలు కూడా ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయి.  పాకాల సరస్సు, లక్నవరం సరస్సు ఈ రెండు అభయారణ్యాలలో కొలువై ఉండి ఆయా వృక్ష, జంతుజాలాలకు దన్నుగా నిలుస్తున్నాయి.

జీవవైవిధ్యానికి నెలవు

పాకాల అభయారణ్యంలో అరుదైన ఎన్నో వృక్ష జాతులైన సాపు తీగబరిగ,  సర్పగంద,  కీటకాహారి మొక్కలు డ్రెసీరా ఇండికా, డ్రెసీరా బర్మాని, నాగ దుందిలము, తపసి, తెల్ల పొనికి ఉన్నాయి.  ఏటూరు నాగారం అభయారణ్యంలో అనేక రకాల వృక్షజాతులు పెద్ద ఏగి, బొజ్జ, నల్లమద్ది, బండారు, కొండగోగు, నారేప వంటివి ఉన్నాయి.  అదేవిధంగా జంతుజాలం..  పెద్దపులి,  చిరుత పులి, హైనా, ఎలుగుబంటి, అడవి దున్న,  చుక్కల జింక, దుప్పి, నీలుగాయి  రేచుకుక్కలు, అడవి కోడి, అడవి పిల్లి వంటి జంతువులు, సరిసృపాలు, 200కు పైగా అరుదైన పక్షి జాతులు ఉన్నాయి. 

నిజాం నవాబులు ఈ అటవీ ప్రాంత జంతు సంపదకు ఆకర్షితులై ఈ ప్రాంతాన్ని గేమ్‌‌‌‌‌‌‌‌ రిజర్వుగా ప్రకటించి వేటకు  తరచుగా సందర్శించేవారని ప్రతీతి. అంతేకాక బ్రిటిష్‌‌‌‌‌‌‌‌ ఇండియా  వైస్రాయ్‌‌‌‌‌‌‌‌ లను ఈ ప్రాంతానికి వేటకోసం ఆహ్వానించేవారు అని కూడా రికార్డులు చెబుతున్నాయి. జీవ వైవిధ్యానికి ఆలవాలమైన  మల్లూరు గుట్ట, దొడ్ల, ఐలాపూర్‌‌‌‌‌‌‌‌ ప్రాంతాలు, గంగారం, మడ గూడెం, కర్ణ గండి, కామారం పాకాల బుడుగు, తాడువాయి ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు కిన్నెరసాని నదికి 
పరీవాహక  ప్రాంతంగా కూడా ఉన్నాయి.  

పర్యావరణహిత టూరిజంకి దన్ను

ఈ ప్రాంతమంతా దట్టమైన తేమ ఆకురాల్బ్చే అడవులు ఉండి కోయ, నాయక పోడ్‌‌‌‌‌‌‌‌, మన్నే వారు వంటి స్థానిక గిరిజన జాతులకు జీవనోపాధిని కూడా కల్పిస్తోంది. ఆయా తెగల ప్రజలు ఈ దట్టమైన అడవులలో దొరికే కలపేతర అటవీ ఉత్పత్తులయిన ఇప్పపువ్వు, పుట్ట తేనె, రకరకాల బంకలు, కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు,  ఔషధ మొక్కలు వంటివి సేకరించి స్థానిక ఏటూరు నాగారం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలో విక్రయించి ఉపాధి పొందుతున్నారు.

కాకతీయ పులుల సంరక్షణ కేంద్రం ప్రకటన ద్వారా జాతీయ పులి సంరక్షణ అథారిటీ, కేంద్ర ప్రభుత్వము నుంచి నిధులు మంజూరు అయ్యి ఈ తెగల ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టే అవకాశం ఉంటుంది. టైగర్‌‌‌‌‌‌‌‌ రిజర్వ్‌‌‌‌‌‌‌‌ ప్రకటన ద్వారా బఫర్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌ లో పర్యావరణహిత టూరిజంని అభివృద్ధిపరచడం అందులో స్థానిక గిరిజన యువకులను భాగస్వాములు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరచవచ్చు.  ఈ ప్రాంతంలోని అనేక జలపాతాల సందర్శనను ఏకో టూరిజంలో భాగంగా చేర్చవచ్చు. కొత్త రాతి యుగానికి సంబంధించినటువంటి ఆదిమానవుల డొలమైన్‌‌‌‌‌‌‌‌ సమాధులు కూడా ఏటూరు నాగారం అభయారణ్య ప్రాంతంలో ఉండడం ఒక ప్రత్యేకత.

జీవవైవిధ్య పరిశోధనా కేంద్రం

ఈ ప్రాంతంలో జీవవైవిధ్య పరిశోధన, కొత్త జీవ జాతులను గుర్తించడానికి పరిశోధన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు. ఈ పులుల సంరక్షణ ప్రధాన కేంద్రాన్ని ఏటూరు నాగారంలో ఏర్పరచడం వల్ల పర్యవేక్షణ సమర్థవంతంగా చేయవచ్చు.  వరంగల్​లోని కాకతీయ విశ్వవిద్యాలయ వృక్షశాస్త్ర, జంతు శాస్త్ర విభాగాల ఆచార్యులను, పరిశోధకులను సమన్వయం చేస్తూ జీవవైవిధ్య పరిశోధనలు చేపట్టవచ్చు.1973 నుంచి  ప్రారంభించిన  ప్రాజెక్టు టైగర్‌‌‌‌‌‌‌‌  ప్రధాన ఉద్దేశం పులుల ఆవాసాన్ని శాస్త్రీయంగా సంరక్షించడం.

అయితే, గత కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు అభయారణ్యాలు తీవ్రమైన మానవ చర్యలకు గురి కావడం వల్ల చాలా సున్నితమైన సమస్యను ఎదుర్కొంటున్నాయి.  అడవుల నరికివేత, పోడు వ్యవసాయం, అటవీ కలుపు మొక్కల సమస్య,  కోరు, బఫర్‌‌‌‌‌‌‌‌ అటవీ ప్రాంతాలలో పశువులను మేపడం, రహదారుల నిర్మాణం.. ఉదాహరణకి నర్సంపేట –- ఇల్లందు తారు రహదారి,  సమ్మక్క సారక్క జాతర వల్ల వచ్చే జనాలు చేసే పర్యావరణ రహిత చర్యల వల్ల ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. 

కాకతీయ పులుల  సంరక్షణ కేంద్రంతో  జీవవైవిధ్య మణిహారం

రెండు అభయారణ్యాలను సంయుక్తంగా కలిపి కాకతీయ సామ్రాజ్యం పేరిట కాకతీయ పులుల సంరక్షణ కేంద్రం లేదా కాకతీయ టైగర్‌‌‌‌‌‌‌‌ రిజర్వ్‌‌‌‌‌‌‌‌ పేరిట ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అధికంగా వచ్చే అవకాశం ఉంది.  ఫలితంగా  సంస్కరణ చర్యలు చేపట్టడం ద్వారా ఈ ప్రాంతంలో  అటవీ విస్తీర్ణాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచి జీవవైవిధ్యాన్ని అభివృద్ధి చేయవచ్చు.  ఫలితంగా స్థానికంగా వర్షపాతం పెరిగి గోదావరి,  కృష్ణా నదులలో  నీటి లభ్యత  కూడా పెరుగుతుంది.

అంతేకాకుండా జాతీయ జంతువు  పులి ఆవాసాన్ని శాస్త్రీయ పద్ధతిలో అభివృద్ధి చేసిన వారమవుతాం. ఇప్పటికే ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని కవ్వాల్​,  ఉమ్మడి మహబూబ్‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని మన్ననూరు పులుల సంరక్షణ కేంద్రానికి తోడుగా ఈ కాకతీయ పులుల సంరక్షణ కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి మరొక జీవవైవిధ్య మణిహారం కాగలదు.

- డా. ఎలగొండ నరసింహమూర్తి
అసిస్టెంట్​ ప్రొఫెసర్,
శాతవాహన యూనివర్సిటీ