కొత్తగూడెంలో కేసు కొట్టివేయిస్తానని  రూ.15 వేలు డిమాండ్​

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ‘రూ.15 వేలు ఇస్తే...కోర్టులో నీ మీదున్న కేసును కొట్టి వేయించేలా చూస్తా’ అని లంచం డిమాండ్​చేసిన కొత్తగూడెంలోని ఓ కోర్టు కానిస్టేబుల్​సోమవారం రెడ్​హ్యాండెడ్​గా ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాలను ఖమ్మం ఏసీబీ డీఎస్​పీ ఎస్​. సూర్యనారాయణ తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలానికి చెందిన జంపన్న కొంతకాలం కిందట బైక్​పై  వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో వ్యక్తి టూ వీలర్​పై వచ్చి ఢీకొట్టాడు. దీంతో జంపన్న అతడి బైక్​ తీసుకుని తన బండిని రిపేర్ ​చేయించాకే తిరిగి ఇస్తానని చెప్పాడు. మనస్తాపం చెందిన ఆ వ్యక్తి సూసైడ్​ చేసుకున్నాడు. దీంతో జంపన్నపై అశ్వాపురం పీఎస్​లో కేసు నమోదైంది.

కొత్తగూడెం కోర్టులో ఈ కేసు ట్రయల్​ నడుస్తోంది. కొద్దిరోజుల కింద జంపన్న కానిస్టేబుల్ ఈవెంట్స్​లో పాల్గొని క్వాలిఫై అయ్యాడు. మెయిన్స్​కు ప్రిపేర్​అవుతున్నాడు. విషయం తెలుసుకున్న కోర్టు కానిస్టేబుల్ ​రాంబాబు కేసు ఉంటే జాబ్ ​రాదని,  రూ.15వేలిస్తే కేసు కొట్టుడు పోయేలా చేస్తానని చెప్పాడు. అయితే, తాను తప్పు చేయలేదని, అలాంటప్పుడు డబ్బులెందుకివ్వాలని జంపన్న  ఏసీబీని కలిశాడు. వారి సూచనల మేరకు   కొత్తగూడెం బస్టాండ్​లో రాంబాబుకు రూ. 10వేలు ఇస్తుండగా రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఏసీబీ సీఐ బాలకృష్ణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.