నిర్మల్, వెలుగు : దిలావర్పూర్ మండలం గుండంపల్లి వద్ద నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ లోని ప్రజా సంఘాల కార్యాలయంలో వామపక్ష ప్రజాసంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. సీపీఐ జిల్లా సీనియర్ నేత ఎస్ఎన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం నూతన్ కుమార్, సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా జిల్లా కార్యదర్శి కె.రాజన్న, తెలంగాణ ప్రజా జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ ఆరేపల్లి విజయ్ కుమార్ తదితరులు హాజరై మాట్లాడారు.
ఇథనాల్ పరిశ్రమ వల్ల ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, ఇప్పటికే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నిర్మించిన ఇథనాల్ పరిశ్రమ వల్ల అక్కడి ప్రజలు అనేక దుష్ఫలితాలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ పరిశ్రమను నిర్మిస్తే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజా సంఘాల నాయకులు ఆర్.రామలక్ష్మణ్, ఐఎఫ్ టీయూ జిల్లా కార్యదర్శి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కె.లక్ష్మి, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తొడసం శంభు తదితరులు పాల్గొన్నారు.