హైడ్రా లెక్క ‘వాడ్రా’ కావాలి.. తెరపైకి కొత్త డిమాండ్

హైడ్రా లెక్క ‘వాడ్రా’ కావాలి.. తెరపైకి కొత్త డిమాండ్

హనుమకొండ సిటీ, వెలుగు: హైడ్రా తరహాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చెరువులు, నాలాల పరిరక్షణకు వాడ్రా ఏర్పాటు చేయాలని పౌర, సామాజిక సంఘాల నాయకులు డిమాండ్  చేశారు. మంగళవారం హనుమకొండ గెజిటెడ్​ ఆఫీసర్స్​ బిల్డింగ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పౌర, సామాజిక సంఘాల నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కేయూ రిటైర్డ్​ ప్రొఫెసర్  కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ.. వరంగల్  సిటీలోని చెరువులు, పార్కులు కబ్జాకు గురయ్యారని తెలిపారు. బాల సముద్రంలోని పార్కు స్థలాన్ని బీఆర్ఎస్  పార్టీ ఆక్రమించుకుని జిల్లా పార్టీ కార్యాలయాన్ని కట్టుకుందని ఆరోపించారు. వరంగల్  నగరంలోని భద్రకాళి చెరువు ప్రాంతంలో అనేక కట్టడాలు నిర్మించారన్నారు. 

వీటిని తొలగించేందుకు హైడ్రా తరహాలో వరంగల్ లో వాడ్రా ఏర్పాటు చేయాలని కోరారు. ఫోరం ఫర్  బెటర్​ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు పుల్లూరి సుధాకర్  మాట్లాడుతూ.. నగరంలోని చారిత్రక కట్టడాలు, చెరువులు, నాలాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక నాయకులు కాజీపేట పురుషోత్తం మాట్లాడుతూ.. గతంలో వరదలు వచ్చి 42 కాలనీలు నీట మునిగాయని, గత కలెక్టర్  ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ సంఘాల నాయకులు చీకటి రాజు, మండల పరుశురాములు, తిరునగిరి శేషు, సోమ రామ్మూర్తి, రావుల సదానందం, విజయబాబు, సంగాని మల్లేశ్వర్, వీరస్వామి, కొలిపాక ప్రకాశ్​​పాల్గొన్నారు.