మరోసారి తెరపైకి .. హుజూరాబాద్ కేంద్రంగా పీవీ జిల్లా ప్రకటించాలన్న డిమాండ్

  • అక్టోబర్ 1న జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం 
  • తొమ్మిది మండలాల జేఏసీ ఇన్ చార్జిలకు బాధ్యతలు 
  • ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు తలనొప్పిగా వ్యవహారం 

కరీంనగర్, వెలుగు : హుజూరాబాద్  కేంద్రంగా పీవీ జిల్లా ప్రకటించాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. కొద్ది రోజుల పాటు సోషల్ మీడియా వేదికగా జిల్లా డిమాండ్ పై చర్చలు జోరందుకోగా.. తాజాగా జిల్లా సాధన జేఏసీ  ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమైంది. హుస్నాబాద్, హుజూరాబాద్  నియోజకవర్గాలతో కూడిన పీవీ జిల్లా ఏర్పాటు కోసం అక్టోబర్ 1న హుజూరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని జేఏసీ నిర్ణయించింది. ఈ  మేరకు మండలాలవారీగా ఇన్ చార్జులను ప్రకటించి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జేఏసీ నాయకులు సిద్ధమవుతుండడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇన్నాళ్లు మరుగునపడిన ఈ డిమాండ్ ను ఎన్నికల ముందు తెరపైకి తీసుకురావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ డిమాండ్ ఏ పార్టీకి మైలేజీ ఇస్తుందో, ఏ పార్టీకి తలనొప్పిగా మారుతుందో అన్న చర్చ జోరుగా సాగుతోంది.

ఏడేళ్ల నాటి డిమాండ్

రాష్ట్రంలో 2016లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినపుడే హుజూరాబాద్  కేంద్రంగా పీవీ నర్సింహారావు జిల్లాను ప్రకటించాలని ఆందోళనలు, ప్రదర్శనలు చేశారు. అప్పట్లోనే హుజూరాబాద్  జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో నెలల తరబడి టెంట్లు వేసుకుని ఆందోళనలు నిర్వహించింది. హుజూరాబాద్, హుస్నాబాద్ రెండు నియోజకవర్గాలతో కూడిన కొత్త జిల్లాకు కావాల్సిన అన్ని రకాల అర్హతలు ఉన్నాయని, హుజూరాబాద్  కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యావంతులు, విద్యార్థులు అప్పుడు పెద్దఎత్తున ఉద్యమించారు. స్థానిక ఎమ్మెల్యే, అప్పటి మంత్రి ఈటల రాజేందర్, నాటి ఎంపీ వినోద్  కుమార్, హుస్నాబాద్  ఎమ్మెల్యే వి.సతీష్  కుమార్  అనేకసార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు. కానీ, జిల్లా ఏర్పాటుపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. పీవీ శతజయంతి సంవత్సరంలో కూడా మరోసారి పీవీ జిల్లా ఏర్పాటు అంశం తెరపైకి వచ్చి తెరుమరుగైంది.

ప్రాభవం కోల్పోతున్న హుజూరాబాద్

ఒకప్పుడు చుట్టుపక్కల వంద గ్రామాల ప్రజలకు హుజూరాబాద్  పట్టణం వ్యాపార కేంద్రంగా ఉండేది. చుట్టూ జమ్మికుంట, కమలాపూర్  మండల కేంద్రాల్లో అన్ని దుకాణాలు అందుబాటులోకి రావడంతోపాటు కరీంనగర్, హన్మకొండ సిటీల మధ్య ఉండడం వల్ల కూడా హుజూరాబాద్ లో వ్యాపార కార్యకలాపాలు తగ్గిపోయాయనే అభిప్రాయం స్థానికుల్లో బలంగా ఉంది. అంతేకాక ఇటీవల చేపట్టిన కరీంనగర్ –- హన్మకొండ హైవే హుజూరాబాద్  టౌన్ బయటి నుంచి వెళ్లేలా డిజైన్  చేయడంతో రాబోయే రోజుల్లో రవాణా మరింత తగ్గనుంది. దీంతో హుజూరాబాద్  ప్రాభవం కోల్పోయే ప్రమాదం ఉందని, దీనిని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే పూర్వ వైభవం వస్తుందనే డిమాండ్  వినిపిస్తోంది. 

ఆందోళనలు ..ఉధృతం చేస్తాం

హుజూరాబాద్  కేంద్రంగా పీవీ జిల్లా డిమాండ్  ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ. జిల్లా కోసం 2016 నుంచి 2020 వరకు వివిధ రూపాల్లో అనేక ఆందోళనలు నిర్వహించాం. బీఆర్ఎస్ అగ్రనేతలందరినీ కలిశాం. ఆ పార్టీ లీడర్లలో సమన్వయం లేకపోవడం, జిల్లా అయితే క్రెడిట్ ఎవరికి దక్కుతుందనే విషయంలో  భేదాభిప్రాయాలతోనే జిల్లా ఏర్పాటు కోసం వాళ్లెవరూ ముందుకు రాలేదు. ఇప్పటికైనా హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్  చేస్తున్నాం. అక్టోబర్ 1న నిర్వహించే రౌండ్  టేబుల్ సమావేశంలో కార్యాచరణ ప్రకటిస్తాం.  

వేల్పుల రత్నం, పలకల ఈశ్వర్ రెడ్డి, 
జిల్లా జేఏసీ బాధ్యులు