- స్థానికులకే 80 శాతం ఉద్యోగాలివ్వాలని డిమాండ్
- ప్లాంట్ సీజీఎంకు కాంగ్రెస్ లీడర్ల నోటీస్
గోదావరిఖని, వెలుగు : స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్ రామగుండం ఎరువుల ప్లాంట్(ఆర్ఎఫ్‌సీఎల్)కు కూడా పాకింది. మొన్నటి వరకు గోదావరిఖనిలోని సింగరేణి ఓపెన్‌కాస్ట్ 5 ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ఇక్కడి నుంచి పంపించివేయగా... అదే తరహాలో ఆర్ఎఫ్‌సీఎల్‌లో పనిచేస్తున్న స్థానికేతరులను కూడా తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ఆదేశాల మేరకు గురువారం మేయర్ బంగి అనిల్‌కుమార్, కాంగ్రెస్ కార్పొరేషన్ ఏరియా ప్రెసిడెంట్ బొంతల రాజేశ్ ఆధ్వర్యంలో ఆర్‌ఎఫ్‌సీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్రాజ్హంసన్కు డిమాండ్ నోటీస్కూడా ఇచ్చారు. స్థానికేతరులను తొలగించి వారి స్థానంలో స్థానిక నిరుద్యోగ యువతకు 80 శాతం ఉద్యోగాలు కల్పించాలని నోటీస్‌లో పేర్కొన్నారు.
డబ్బులు తీసుకొని స్థానికేతరులకు అవకాశం
మూతపడిన ఎరువుల ఫ్యాక్టరీ ఆర్‌ఎఫ్‌సీఎల్‌గా పునరుద్ధరించినప్పుడు స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని ఈ ప్రాంత నిరుద్యోగ యువత ఆశపడ్డారు. కానీ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని స్థానికేతరులకు ఉద్యోగాలు కల్పించారని కాంగ్రెస్ లీడర్లు పేర్కొంటున్నారు. అక్టోబర్1లోపు స్థానికేతరులను తొలగించి 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అప్పటిదాకా శాంతియుతంగా దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ప్రకటించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు
పాల్గొన్నారు.