ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీస్​ ముట్టడి ఉద్రిక్తం

బీజేపీ నాయకులపై పోలీసులు దౌర్జన్యం 

మంచిర్యాల, వెలుగు : వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్​ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో గురువారం తలపెట్టిన ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీస్​ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ముట్టడిని అడ్డుకునేందుకు పోలీసులు ఉదయమే బీజేపీ లీడర్లను అరెస్టు చేసేందుకు వారి ఇండ్లను చుట్టుముట్టారు. పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్టి వెంకటకృష్ణ పోలీసుల నుంచి తప్పించుకొని నాయకులు, కార్యకర్తలతో కలిసి క్యాంప్ ఆఫీస్​కు చేరుకున్నారు.

ఈ సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకొని దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసుల తీరుపై రఘునాథ్ తీవ్రంగా మండిపడ్డారు. టౌన్ ​సీఐ ముస్కె రాజుకు, రఘునాథ్​కు మధ్య కాసేపు తీవ్ర వాగ్వాదం జరగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రఘునాథ్, వెంకటకృష్ణలతో పాటు నాయకులను బలవంతంగా అరెస్ట్​ చేశారు. వారిని కాళ్లు, చేతులు పట్టి  ఈడ్చుకెళ్లి వ్యాన్​లో ఎక్కించి నస్పూర్ పోలీస్ స్టేషన్​కు తరలించారు. 

సర్కారు విఫలం

ఈ సందర్భంగా రఘునాథ్  మీడియాతో మాట్లాడుతూ.. మూడేండ్లుగా మంచిర్యాల పట్టణాన్ని వరదలు ముంచెత్తుతున్నా శాశ్వత పరిష్కారం కోసం ఎమ్మెల్యే ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. వేల ఇండ్లు నీట మునిగి కోట్లలో ఆస్తి నష్టం జరిగినప్పటికీ ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం చెల్లించలేదని మండిపడ్డారు. వరద బాధితులకు నష్టపరిహారం చెల్లించే వరకు బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు.

శాంతియుత ధర్నా తలపెట్టిన బీజేపీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్​ చేయడాన్ని ఖండించారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. నాయకులు అగల్ డ్యూటీ రాజు, తుల ఆంజనేయులు, బోయిని  హరికృష్ణ, తోట తిరుపతి, బండి మల్లికార్జున్, మద్ది సుమన్, కొండ వెంకటేశ్​, సిరికొండ రాజు పాల్గొన్నారు.