- జనగామ మార్కెట్ యార్డు గేట్లు తెరవాలని డిమాండ్
- పోలీసుల కాళ్లు మొక్కిన స్వీపర్
జనగామ, వెలుగు: జనగామ అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నాకు దిగారు. నాలుగు రోజులుగా మార్కెట్‌ను బంద్ పెట్టి, గేటుకు తాళం వేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మాట్లాడుతూ జనగామ మార్కెట్‌కు వడ్లు మాత్రమే కాకుండా చింతపండు, మొక్కజొన్న వంటి పంటలు కూడా వస్తాయన్నారు.
వడ్లకు మద్దతు ధర పేరుతో మొత్తం మార్కెట్‌నే బంద్ చేయడం సరికాదన్నారు. అర్జంట్‌గా డబ్బులు అవసరం ఉన్న రైతులు మార్కెట్‌లో వడ్లు అమ్ముకోకుండా అడ్డుపడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యార్డును బంద్ చేయడంతో మార్కెట్‌పై ఆధారపడిన వ్యాపారులు, హమాలీలు, స్వీపర్లు సుమారు 500 మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. మార్కెట్‌ను ఓపెన్ చేసి కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న జనగామ టౌన్ సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సైలు సృజన్, తిరుపతి ఘటనాస్థలానికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో యార్డ్ మూసి వేయడం వల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని, వెంటనే మార్కెట్‌ను తెరవాలని పోలీసుల కాళ్ల మీద పడింది. ఎంత చెప్పినా నాయకులు ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ ఆదేశాలతో మధ్యాహ్నం తర్వాత మార్కెట్‌ను ఓపెన్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సీహెచ్. రాజారెడ్డి, రైతు సంఘం నాయకులు, హమాలీలు, స్వీపర్లు పాల్గొన్నారు.
కనీస ధర రూ. 1,825 ఇచ్చేందుకు ట్రేడర్ల అంగీకారం
జనగామ అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోళ్ల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ట్రేడర్లు, రైతు సంఘం లీడర్లతో మార్కెట్ ఆఫీసర్లు సోమవారం నిర్వహించిన చర్చలు సఫలం అయ్యాయి. ఈ – నామ్ పద్ధతిలో కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించినట్లు మార్కెట్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్ చెప్పారు. వడ్లకు కనీస మద్దతు ధర రూ.1,825 ఇవ్వాలన్న నిబంధనతో కొనుగోళ్లకు ట్రేడర్లు అంగీకరించినట్లు తెలిపారు.