రెవెన్యూ డివిజన్​ సాకరమయ్యేనా..!

సిద్దిపేట/చేర్యాల, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల ముందు  చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉధృతమవుతోంది.  గత ఆరు నెలలుగా డివిజన్ ఏర్పాటుపై పలు రకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చిన జేఏసీ  ఇప్పుడు ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమవుతోంది.  ఇప్పటికే రిలే నిరాహార దీక్షలు ప్రారంభించిన జేఏసీ నేతలు శుక్రవారం  నాలుగు మండలాల పరిధిలో సడక్ బంద్​కు పిలుపునిచ్చారు.  మొన్నటి వరకు దూరంగా వున్న అధికార పార్టీ నేతలు కూడా ఇప్పుడు ఉద్యమానికి సహకరిస్తున్నారు.

ఇటీవలే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి దీక్షలకు సంఘీభావం తెలిపి వారితో కూర్చున్నారు. ఇటీవల మెదక్ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా పటన్ చెరు రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత  ఉధృతం చేస్తే  రెవెన్యూ డివిజన్​ కల సాకరమవుతుందని జేఏసీ నాయకులు భావిస్తున్నారు. 

ఆరేండ్లుగా డిమాండ్‌‌

చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్  గత ఆరేండ్లుగా కొనసాగుతోంది.  రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఆరు  రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినా చేర్యాలను మాత్రం మరిచిపోయింది. దీంతో ఈ ప్రాంత ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. 2020  ఫిబ్రవరిలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప రెడ్డిల ఆధ్వర్యంలో చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసం మహా ధర్నా నిర్వహించినా సర్కారు నుంచి ఎలాంటి స్పందన రాలేదు.  ప్రస్తుతం  కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీడీపీ, ప్రజా సంఘాలు జేఏసీగా ఏర్పడి ఉద్యమం చేస్తున్నాయి. మరోవైపు ఏఐఎఫ్​బీ ఆధ్వర్యంలో మరో జేఏసీ ఉద్యమిస్తోంది. 

ఉద్యమ ప్రణాళికకు రూప కల్పన

ఎన్నికల సమయంలోనే చేర్యాల రెవెన్యూ డివిజన్ ను సాధించుకోవాలనే ధ్యేయంతో జేఏసీ ఉద్యమ ప్రణాళికను రూపొందిస్తోంది. సడక్​ బంద్​కు బీజేపీ కూడా మద్దతు ప్రకటించింది.  రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్ర తరం చేయడంతో పాటు  మండల కేంద్రాల్లో నిరసనలు, బంద్, వంటా వార్పు కార్యక్రమాలకు రూప కల్పన చేసింది. ఇప్పటికే నాలుగు మండలాల పరిధిలోని అన్ని గ్రామాల్లో జేఏసీ గ్రామ కమిటీల ఏర్పాటు చేసింది. ఉద్యమంలో ప్రజల భాగస్వామ్యం పెంచే దిశగా జేఏసీ నేతలు పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నారు. 

ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం

చేర్యాల, మద్దూరు, ధూలిమెట్ట,  కొమురెల్లి మండలాలను కలిపి తక్షణమే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి. ఇందుకోసం క్షేత్ర స్థాయిలో జేఏసీ కమిటీలను ఏర్పాటు చేశాం. రానున్న రోజుల్లో మండల కేంద్రాల్లో ఆందోళనలు, బంద్, వంటావార్పు  నిరసన కార్యక్రమాలు చేపడుతాం. చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయ్యేంత వరకు  ఉద్యమాన్ని ఆపేది లేదు.  

రామగళ్ల పరమేశ్వర్, జేఏసీ అధ్యక్షుడు

ప్రజల ఆకాంక్షలను గౌరవించాలి

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నాలుగు మండలాలకు కేంద్రంగా చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేస్తే పరిపాలనా అంశాల్లో ఎదురవుతున్న  సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ప్రస్తుతం వివిధ శాఖలు వేరు వేరు చోట్ల ఉండటంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రెవెన్యూ డివిజన్​ ఏర్పాటుచేయాలి.

-  పుర్మ ఆగంరెడ్డి, చేర్యాల