- నాగర్ కర్నూల్ జిల్లాలో పెరిగిన పోటీ
నాగర్‌కర్నూల్, వెలుగు : కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు వడ్లు తరలించే ట్రాన్స్పోర్ట్ టెండర్లకు డిమాండ్ పెరిగింది. పెరుగుతున్న డీజిల్, ఇతర ఖర్చులకు ప్రభుత్వం ఇచ్చే రేట్ సరిపోకపోయినా టెండర్లు దక్కించుకోవడానికి పోటీపడుతున్నారు. ఒకరికొకరు తప్పుకోమని బుజ్జగిస్తున్నారు లేదంటే భయపెడుతున్నారు. అవసరమైతే టెండర్లు వేయకుండా అడ్డు కుంటున్నారు.ఈ నెల 11న సివిల్ సప్లై ట్రాన్స్పోర్ట్ టెండర్లను కలెక్టరేట్లో ఓపెన్ చేయాల్సి ఉండగా, ఒకరు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్ట్ స్టే విధించింది. ఈ నెల 24న హియరింగ్ అనంతరం జడ్జిమెంట్ వస్తుందని సమాచారం. అప్పటి వరకు టెండర్ల ప్రక్రియను చేపట్టవద్దంటూ కోర్టు ఆదేశించింది.
టెండర్లపై కోర్టు స్టే..
నాగర్ కర్నూల్ జిల్లాలో వడ్ల కొనుగోలు కోసం 290 వరకు కేంద్రాలు తెరుస్తారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ, పీఏసీఎస్, మెప్మా ద్వారా కొనుగోలు చేసే వడ్లను రైస్ మిల్లులకు తరలించేందుకు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కంపెనీల నుంచి సివిల్ సప్లై శాఖ టెండర్ తీసుకుంటుంది. టెండర్లలో పాల్గొనే వారికి సొంతంగా 10 లారీలు,15 కిరాయి లారీలు ఉండాలి. టెండర్ దక్కితే రూ.10 లక్షలు బ్యాంక్ గ్యారెంటీ, రూ.20 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్కింద చెల్లించాలి. జిల్లాలోని నాలుగు డివిజన్లకు కలిపి 100 లారీలు ఉండేలా సివిల్ సప్లై అధికారులు నిబంధనలు విధించారు. కొనుగోలు కేంద్రం నుంచి 8 కిలోమీటర్ల వరకు రూ.221 చెల్లిస్తారు.
కల్వకుర్తి డివిజన్లో నాలుగు టెండర్లు, అచ్చంపేట డివిజన్లో రెండు టెండర్లు, కొల్లాపూర్, నాగర్ కర్నూల్ డివిజన్లో ఒక టెండర్ చొప్పున దాఖలయ్యాయి. ఈ నెల 9న ఆన్లైన్లో టెండర్లు పిలిచిన సివిల్ సప్లై అధికారులు 11న కలెక్టరేట్లోని సివిల్సప్లై డీఎం ఆఫీస్‌లో డాక్యుమెంట్లు ఇవ్వాలని పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ డివిజన్ ట్రాన్స్పోర్ట్ కోసం టెండర్ వేసిన నీరజ కలెక్టరేట్‌కు రాగా.. ఆమెను కొందరు కారు దిగకుండా అడ్డుకున్నారు. కలెక్టరేట్‌లోకి వెళ్లిన తరువాత ఆమె బ్యాగ్ గుంజుకున్నారు. సివిల్ సప్లై డీఎం పోలీసులకు సమాచారం ఇచ్చిన తరువాత అక్కడికి చేరుకున్న పోలీసులు దౌర్జన్యానికి పాల్పడిన వారిని అడ్డుకోకపోవడంతో నీరజ సివిల్ సప్లై ఆఫీసులోకి వెళ్లలేకపోయింది.
టెండర్ డాక్యుమెంట్లు ఆఫీస్‌లో ఇవ్వకపోతే, టెండర్ వేయకపోయినా తమకే దక్కుతుందని అడ్డుకున్నవారు భావించారు. తనను అడ్డుకున్న వారికి పోలీసులు, అధికారులు సపోర్ట్‌గా నిలిచారని ఆరోపించారు. అనంతరం ఆమె హైకోర్ట్‌లో పిటీషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టుటెండర్ ప్రక్రియపై స్టే విధించింది. ఈ నెల 24న హియరింగ్ అనంతరం తుది ఆదేశాలు జారీ అవుతాయని సమాచారం. ఇదిలాఉంటే జిల్లాలోని నాలుగు డివిజన్ల టెండర్లను తిరిగి నిర్వహిస్తామని సివిల్ సప్లై డీఎం తెలిపారు.
లారీలు పంపించక రైతులకు తిప్పలు..
గతంలో ట్రాన్స్పోర్ట్ టెండర్లు దక్కించుకున్నవారు కొనుగోలు కేంద్రాలకు సకాలంలో లారీలు పంపించకపోవడం, మధ్యలోనే కాంట్రాక్ట్ నుంచి తప్పుకోవడం, వేరే వారికి సబ్ కాంట్రాక్ట్ అప్పగించడం వంటివి చోటు చేసుకున్నాయి. సివిల్ సప్లై అధికారులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ల మధ్య రైతులు నష్టపోయారు. కొన్ని సందర్భాల్లో రైతులే తమ వడ్లను రైస్ మిల్లులకు తీసుకెళ్లారు. ఈ సారి గతంలో మాదిరిగా ఇబ్బంది పెట్టవద్దని రైతులు కోరుతున్నారు.