కాళేశ్వరం లెక్కలపై శ్వేతప్రతం విడుదల చేయాలి: ఎమ్మెల్యే రఘునందన్ రావు

సిద్దిపేట రూరల్, వెలుగు : కాళేశ్వరం అప్పు తీరిపోయిందన్న సీఎం కేసీఆర్ ప్రాజెక్టు లెక్కలపై శ్వేతపత్రం విడుదల చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్​ చేశారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని బీజేపీ జిల్లా ఆఫీస్ లో పార్టీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎంత అప్పు అయ్యింది, ఎక్కడి నుంచి తెచ్చారు, ఎప్పుడు, ఏ విధంగా అప్పు తీర్చారో ప్రజలకు తెలుపాల్సిందేనని డిమాండ్​ చేశారు. అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.86 వేల కోట్లు ఖర్చయిందని, వాటిలో 80 వేల కోట్లు వివిధ సంస్థల నుంచి అప్పు చేసినట్లు తెలిపారని, వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో భారత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణకు 3.6 లక్షల కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారని, వాటిలో కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు ఉన్నట్లా, లేనట్లా అని ప్రశ్నించారు. 

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు తప్పుడు అఫిడవిట్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.  పాలమూరు జిల్లాలో మంత్రిపై కూడా ఎన్నికల ఖర్చు తప్పుగా నమోదు చేశారని కోర్టు కేసు ఉందని, పాత కరీంనగర్ కు చెందిన ఎమ్మెల్యే, జహీరాబాద్ కు చెందిన ఎంపీ లు ఎన్నికల కేసులు ఎదుర్కొంటున్నారని, వాటిపై సీఎం కేసీఆర్ స్పందించి వారిని రాజీనామా చేయించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, పత్రి శ్రీనివాస్, ఉపేందర్రావు, మల్లేశం యాదవ్, అంబటి బాలేష్ గౌడ్, విబీషన్ రెడ్డి, రమేశ్​ గౌడ్, వేణుగోపాల్, అరుణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ALSO READ :ఎమర్జెన్సీ అయితే తప్ప.. ప్రజలు బయటకు రావొద్దు

 పేద విద్యార్థులకు అండగా ఉంటున్నా.. 

దుబ్బాక, వెలుగు: విద్యలో ప్రతిభ కనబరుస్తున్న పేద విద్యార్థులకు అండగా ఉంటున్నానని ఎమ్మెల్యే రఘునందన్​రావు తెలిపారు. ఐఐటీ కాన్పూర్​లో సీటు సంపాదించిన దుబ్బాక మండలం అచ్చుమాయపల్లి గ్రామానికి చెందిన చింతల మానసకు ఎమ్మెల్యే రూ. లక్ష విలువైన ల్యాప్​ టాప్​ను మంగళవారం ఉచితంగా అందజేశారు.