పిట్లం, వెలుగు: పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న జుక్కల్ఎమ్మెల్యే హన్మంత్‌షిండేకు బుధవారం నిరసన సెగ తగిలింది. పిట్లం మండలంలోని గోద్మేగాంలో కొత్తగా నిర్మించిన పంచాయతీ బిల్డింగ్‌ని ప్రారంభించడానికి వెళ్లిన ఎమ్మెల్యే కాన్వాయ్ ని గ్రామస్తులు, యువకులు అడ్డుకున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి గ్రామానికి చేసిందేమీ లేదని, గడిచిన తొమ్మిదేండ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. గ్రామస్తులకు ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పరిస్థితి ఉదృక్తంగా మారడంతో పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. అనంతరం బందోబస్తు మధ్య ఎమ్మెల్యే పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. అనంతరం పిట్లంలో 108,104 అంబులెన్స్ లను ప్రారంభించారు. తిమ్మానగర్ లో అంబేద్కర్ విగ్రహం, మార్దండలో బీసీ కమ్యూనిటీ హాల్, రాంపూర్, గౌరారం, చిన్న కొడప్గల్ గ్రామాల్లో కొత్తగా నిర్మించిన జీపీ బిల్డింగులు, అంగన్ వాడీ సెంటర్లను ప్రారంభించారు. ఎంపీపీ కవిత, జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి ఆయన వెంట ఉన్నారు.