గద్వాల, వెలుగు: కేసీఆర్ రాష్ట్రానికి సీఎం కావడం దురదృష్టకరమని, ప్రజలకు సేవ చేయకుండా డబ్బు సంపాదనకు మార్గంగా రాజకీయాలను మార్చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. సోమవారం అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గద్వాల వైఎస్సార్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా 5 వేల ఇండ్లు ఇస్తానని చెప్పిన సీఎం, ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. గతంలో పేదలకు పంచిన ఇంటి జాగలను గుంజుకొని, ఇండ్లు ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు. ఎన్నో మాయమాటలు చెప్పి గద్దెనెక్కి మోసం చేశారని పేర్కొన్నారు. ఆ కులం, ఈ కులం అంటూ చీలికలు తెచ్చి ఓట్లు దండుకునేందుకు కుట్ర చేస్తున్నారని, ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రామచంద్రారెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి, రామాంజనేయులు, బండల పద్మావతి, మండల వెంకట్రాములు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం
నారాయణపేట: అనేక హామీలు ఇచ్చి దగా చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి, సీనియర్ నేత నాగురావు నామాజీ పిలుపునిచ్చారు. సోమవారం నారాయణపేటలో డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించారు. అనంతరం వివేకానంద పార్క్ వద్ద నిర్వహించిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. బీజేపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మహబూబ్ నగర్ అర్బన్: అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని మహబూబ్ నగర్ లోని టీటీడీ ధర్నా చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, ట్రెజరర్ శాంతికుమర్, రాష్ట్ర కార్య వర్గ సభ్యురాలు పద్మజారెడ్డి, జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ టౌన్: పేదలందరికీ డబుల్ ఇండ్లు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దిలీప్ ఆచారి డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ బీజేపీ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు, సతీశ్ మాదిగ, కొండ మన్నెమ్మ, సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.
వనపర్తి: జిల్లాలో ఇండ్లు లేని పేదలకు కాకుండా ఇతరులకు ఇండ్లు ఇచ్చారని, దీనిపై విచారణ జరిపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి, బి.కృష్ణ, వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శ్రీశైలం, బచ్చు రాము పాల్గొన్నారు.