- సిరిసిల్ల అర్బన్ మండలం చేయాలని మున్సిపల్
- వీలీన గ్రామస్తుల నిరసన
- అన్యాయంగా మున్సిపల్ లో కలిపారని ఆవేదన
సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామాలను మండలాలుగా ప్రకటించాలనే డిమాండ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఓకే మండలానికి చెందిన మూడు గ్రామాల ప్రజలు మండలాలను కోరడం విశేషం. జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు, వల్లంపట్ల, గాల్ పల్లి గ్రామాలను మండలాలుగా ప్రకటించాలని ఆందోళన చేస్తున్నారు. ఇందు కోసం కార్యచరణ ప్రకటించుకొని కలెక్టర్ కు వినతి పత్రాలు ఇస్తున్నారు. వంటావార్పులు చేస్తూ తమ నిరసనను తెలియజేస్తున్నారు.
మొదటి డిమాండ్ పొత్తూరు నుంచి..
ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని మొదట డిమాండ్ వచ్చింది. పొత్తూరు సమీపంలో ఉన్న కట్కూరు, నర్సన్న పేట, జువారిపేట, గాల్ పల్లి, రంగంపేట, మానువాడ, ఓగులపూర్, మల్లాపూర్, కృష్ణారావుపేట గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పొత్తూరును మండలంగా ప్రకటిస్తారని వదంతులు రావడంతో ఇల్లంతకుంట మండలంలోని గాల్ పల్లి, వల్లంపట్ల గ్రామాలను కూడా మండలాలుగా ప్రకటించాలని గ్రామస్తులు ఆందోళన ప్రారంభించారు. గాల్పల్లి మండలం కోసం జువారిపేట, తాళ్లపల్లి, మద్దికుంటపల్లె, రంగంపేట, పారువెల్ల, నర్సక్కపేట గ్రామస్తులు.. కట్కూరు, కృష్ణారావుపేట, చీర్లవంచ, వెల్జిపూర్, ఓగులపూర్ గ్రామాలను కలిపి వల్లంపట్లను మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్లు ప్రారంభమయ్యాయి. ఇల్లంతకుంట మండలంలో ప్రస్తుతం 33 గ్రామాలు ఉన్నాయి. 50 వేలకుపైగా జనాభా ఉంది. మండలానికి చివరన ఉన్న కొన్ని గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో కొత్త మండలాల కోసం డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
7 గ్రామాలతో సిరిసిల్ల అర్బన్ కోసం డిమాండ్..
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఇటీవల విలీనమైన గ్రామాల ప్రజలు మున్సిపల్ పరిధి నుంచి తొలగించి గ్రామ పంచాయతీలుగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 7 గ్రామాలు.. రగుడు, చంద్రంపేట, ముష్టిపల్లి, పెద్దూరు, సర్దపూర్, బోనాల, జగ్గరావుపల్లిని సిరిసిల్ల మున్సిపల్ లో విలీనం చేశారు. అయితే తమకు ఇష్టం లేకున్నా బలవంతంగా మున్సిపల్ లో విలీనం చేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. 7 గ్రామాలను కలిపి సిరిసిల్ల అర్బన్ మండలంగా ప్రకటించాలని కోరుతున్నారు. మున్సిపల్ పరిధిలో హౌస్ ట్యాక్సీలు, రిజిస్ట్రేషన్, చార్జీలు ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్లతో సమానంగా విలీన గ్రామాలను డెవలప్ మెంట్ చేస్తానని మంత్రి కేటీఆర్ మాట ఇచ్చారని కానీ ఇప్పుడు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.
మండల కేంద్రం చేస్తేనే అభివృద్ధి
ఇప్పుడున్న మా మండలంలో 33 గ్రామాలు, 50 వేలకు పైగా జనాభా ఉంది. ఎక్కవ గ్రామాలు ఉండటంతో వల్లంపట్లను మండలకేంద్రంగా చేయాలి. అప్పుడే అభివృద్ధి జరుగుతుంది. వల్లంపట్లలో 3వేలకుపైగా జనాభా ఉంది. చుట్టూ ఉన్న 8 గ్రామాలను కలిపి మండలాన్ని ఏర్పాటు చేయాలి.
- కేతిరెడ్డి అనసూయ, సర్పంచ్, వల్లంపట్ల
మా భూములు విరాళం ఇస్తాం
గాల్పల్లి గ్రామాన్ని మండల కేంద్రం చేస్తే ఆఫీస్ల కోసం మా గ్రామం నుంచి భూములు విరాళం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. మా గ్రామంలో 3వేలకు పైగా జనాభా ఉన్నారు. చుట్టుపక్కల 15 గ్రామాలను కలిపి గాల్ పల్లిని కొత్త మండలంగా ప్రకటించాలి.
- మల్లుగారి వాణి, సర్పంచ్, గాల్పల్లి