
- మార్కెట్ పడుతుండడమే కారణం
- మొత్తం డీమాట్ అకౌంట్లు 19 కోట్లు..యునిక్ ఇన్వెస్టర్లు 11 కోట్లు
ముంబై: ప్రతీ నెల డీమాట్ అకౌంట్లు పెరుగుతున్నా, ఫిబ్రవరిలో మాత్రం గత 21 నెలల్లో తక్కువ అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. కిందటేడాది డిసెంబర్‌లో 32.6 లక్షల డీమాట్ అకౌంట్లు ఓపెన్ కాగా, ఈ ఏడాది జనవరిలో 28.3 లక్షల అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. ఫిబ్రవరిలో మాత్రం ఈ నెంబర్ 22.6 లక్షలకు తగ్గింది. చివరిసారిగా 2023 మే నెలలో ఓపెన్ అయిన 21 లక్షల డీమాట్ అకౌంట్లే ఫిబ్రవరి కంటే తక్కువగా ఉన్నాయి. స్టాక్ మార్కెట్ పడుతుండడంతో డీమాట్ అకౌంట్లు ఓపెన్ అవ్వడం నెమ్మదించిందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఎన్‌ఎస్‌డీఎల్, సీడీఎస్‌ఎల్ డేటా ప్రకారం, కిందటి నెల ముగిసేనాటికి ఇండియాలో మొత్తం 19.40 కోట్ల డీమాట్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. అంతకు ముందు నెల ముగిసేనాటికి ఈ నెంబర్ 18.81 కోట్లుగా నమోదైంది. ఎన్‌ఎస్‌ఈ వద్ద రిజిస్టర్ చేసుకున్న యునిక్ ఇన్వెస్టర్లు (ఒక పాన్ కార్డుపై ఒక అకౌంట్) 11 కోట్ల మార్క్‌ను దాటారు. కాగా, ఒకే పాన్ కార్డుపై వేరు వేరు బ్రోకరేజ్ కంపెనీల దగ్గర డీమాట్ అకౌంట్లను ఓపెన్ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ పడుతున్న టైమ్‌లో కొత్త డీమాట్ అకౌంట్ల ఓపెనింగ్స్ పడిపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో షేర్లను అమ్మేస్తుండడంతో గత ఆరు నెలలుగా మార్కెట్ పడుతున్న విషయం తెలిసిందే. దీనికితోడు చాలా షేర్ల వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉండడం, ఆర్థిక వ్యవస్థ వృద్ధి నెమ్మదించడం, కంపెనీల రిజల్ట్స్ మెప్పించకపోవడం, గ్లోబల్‌గా టారిఫ్ వార్ వంటివి మార్కెట్ పతనానికి కారణం. సాధారణంగా బేరిష్ మార్కెట్‌లో ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ తగ్గిపోతుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు సెన్సెక్స్, నిఫ్టీ 4.5 శాతం చొప్పున పడ్డాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ అయితే 14 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌యితే 17 శాతం పతనమయ్యాయి.
ఆప్షన్స్ ట్రేడింగ్ తగ్గడంతోనే
మరోవైపు సెబీ మార్జిన్ రూల్స్ కఠినం చేయడంతో పాటు, ఇతర చర్యలు తీసుకోవడంతో డెరివేటివ్స్ మార్కెట్( ఎఫ్ అండ్ ఓ) లో ట్రేడింగ్ యాక్టివిటీ పడిపోయింది. గత కొన్ని నెలలుగా కొత్త డీమాట్ అకౌంట్ల ఓపెనింగ్స్ తగ్గడానికి ఇదొక కారణం. సెబీ రూల్స్‌తో ఆప్షన్స్ ట్రేడింగ్‌లో అవకాశాలు తగ్గిపోయాయని ఎనలిస్టులు చెబుతున్నారు. దీంతో పాటు కొత్త ఐపీఓలు రాకపోవడం కూడా డీమాట్ అకౌంట్ ఓపెనింగ్స్ పడిపోవడానికి కారణమని వివరించారు. మరోవైపు మార్కెట్ పతనంతో చాలా మంది ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. తమ పొజిషన్లను లాస్‌లో అమ్మాల్సి వచ్చింది. దీంతో రిస్క్ తీసుకోవడానికి ఇన్వెస్టర్లు వెనకడుగేస్తున్నారు. తాజా కరెక్షన్ షార్ట్ టెర్మ్ అని ఎనలిస్టులు చెబుతున్నా, ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ మాత్రం పడిపోయిందని చెప్పొచ్చు.
గత ఆరు నెలల నుంచి మార్కెట్ పడుతోంది. ఏయే నెలలో ఎన్ని
కొత్త డీమాట్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయంటే?
నెల కొత్త అకౌంట్లు
(లక్షల్లో)
సెప్టెంబర్–2024 44.7
అక్టోబర్ 33.4
నవంబర్ 31.7
డిసెంబర్ 32.6
జనవరి–2025 28.3
ఫిబ్రవరి 22.6