అలనాటి యుద్ధభూమి నందనవనమైంది

డెబ్భయి ఏళ్ల కిందట అదో యుద్ధ భూమి. రెండు కొరియాలు హోరాహోరీ తలపడ్డ ప్రాంతం. ‘డీ మిలిటరైజ్డ్ జోన్’ (డీఎంజెడ్) గా ఒకప్పుడు పాపులర్. అయితే అదంతా గతం. ఒకప్పటి వార్ జోన్ ఇప్పుడు ఓ టూరిస్టు స్పాట్ గా మారింది. ప్రకృతి సోయగాలకు వేదికగా మారింది. అలనాడు తుపాకుల చప్పుళ్లతో దద్దరిల్లిన ప్రాంతంలో  ఇప్పుడు పక్షుల కిలకిలారావాలు వినిపిస్తున్నాయి.

ఒకప్పుడు సామాన్య ప్రజలకు అది నిషేధిత ప్రాంతం. సైనిక బలగాలకు మాత్రమే  అక్కడ ఎంట్రీ ఉండేది. మూడేళ్ల పాటు జరిగిన కొరియన్ యుద్ధానికి సాక్ష్యంగా నిలిచింది ఆ ఏరియా. అయితే అదంతా గతం. ఒకప్పటి యుద్ద భూమి కాస్తా  ఇప్పుడు ఓ టూరిస్టు స్పాట్ గా మారింది.250 కిలోమీటర్ల పొడవు నాలుగు కిలోమీటర్ల వెడల్పు ఉన్న  విశాలమైన ప్రదేశాన్ని  ఓ అద్భుతమైన టూరిస్టు స్పాట్ గా తీర్చిదిద్దారు. టూరిస్టులకు అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు.

డీఎంజెడ్ ట్రైన్ జర్నీలో మజానే మజా!

టూరిస్టు స్పాట్ గా మారిన కొరియాల యుద్ధ భూమి  విస్తీర్ణంలో చాలా పెద్దది. దీంతో ఈ ప్రాంతంలోని అందమైన ప్రదేశాలను చూడటానికి వీలుగాప్రత్యేకంగా ఓ ట్రైన్ ఏర్పాటు చేశారు. దీనినే ‘డీఎంజెడ్ ట్రైన్’ గా పిలుస్తారు. 2014 నుంచి ఈ ట్రైన్ సదుపాయం టూరిస్టులకు అందుబాటులోకి వచ్చింది. ట్రైన్ బోగీలపై ఉన్న బొమ్మలు అందరినీ ఆకర్షిస్తాయి. జర్నీ సాగుతుంటే దారిలో ‘ఫ్రీడమ్ బ్రిడ్జి ’ కనిపిస్తుంది. కొరియన్ యుద్ధంలో ఈ బ్రిడ్జి చాలా వరకు దెబ్బతింది. ఎంతో పాపులరైన ఈ బ్రిడ్జి ని చూశాకనే వేరే ప్రదేశాలకు వెళ్లిపోతుంటారు టూరిస్టులు.

బస్సులో తిరుగుతూ అందాలు చూడొచ్చు

టూరిస్టు స్పాట్ లోని కొన్ని ప్రాంతాలకు ట్రైన్ వెళ్లలేదు. దీంతో ఓ బస్సును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. డొరసన్ స్టేషన్ కు ట్రైన్ చేరుకునే  టైం కు బస్సు అక్కడ రెడీ గా ఉంటుంది. ట్రైన్ లో వచ్చిన టూరిస్టులను ఎక్కించుకుని ఏరియా మొత్తం చుట్టేస్తుంది.

బస్సు బయల్దేరిన కాసేపటికి ‘డొరసన్ పీస్ పార్క్’ కనిపిస్తుంది. 2008లో ఈ పార్క్ ను డెవలప్ చేశారు. కొరియా యుద్ధం బ్యాక్  డ్రాప్ ను ఈ తరానికి తెలియచేయడమే ఈ శాంతి పార్కు  ప్రధాన ఉద్దేశం. ఎన్నో విగ్రహాలు, చరిత్రను తెలియచేసే అనేక శిలా ఫలకాలు, ఓ చిన్న మ్యూజియం… వీటన్నిటినీ ఈ పార్కులో ఏర్పాటు చేశారు.

యుద్ధం  తరువాత రెండు కొరియాలు కలిసిపోయిన సందర్భంగా చరిత్రాత్మకమైన బెర్లిన్ గోడలోని కొంత భాగాన్ని టూరిస్టుల కోసం ఇక్కడ ఏర్పాటు చేశారు. కొరియా దేశాలకు జర్మనీకి ఏం సంబంధం లేదు కానీ, రెండు గా విడిపోయినప్పుడు ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ మధ్య కట్టుకున్న గోడను కలిసిపోయాక కూలగొట్టారు. అందుకే ఈ గోడను పోలిన గోడను ఇక్కడ ఏర్పాటు చేశారు.

ఆకలి తీర్చే మిలటరీ కెఫెటేరియా

కనువిందు చేసే టూరిస్టు ప్లేసెస్ లో తిరిగిన తరువాత ఆకలి వేస్తే  మంచి రుచికరమైన భోజనం పెట్టడానికి కూడా ఏర్పాటు చేశారు. అదే ‘మిలటరీ కెఫెటేరియా’. ఇష్టమైన డిషెస్ వడ్డించుకుంటూ ఈ మిలటరీ మెస్ లో కడుపునిండా భోజనం చేయవచ్చు.

పాస్ పోర్ట్ ఉంటేనే పర్మిషన్

టూరిస్టు స్పాట్ అయినప్పటికీ ఇక్కడకు రావడానికి చాలా  ప్రాసెస్ ఉంటుంది. పాస్ పోర్టు తప్పనిసరిగా ఉండాలి. ఐడీ కార్డులు కూడా తీసుకెళ్లాలి.  ఇక్కడ డ్రస్ కోడ్ చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తారు. ఫలానా డ్రస్సే వేసుకోవాలంటూ  రూల్స్ ఏమీ ఉండవు కానీ చూడటానికి పద్ధతిగా ఉండే డ్రస్సే వేసుకోవాలి. దోక్కుపోయినట్లు అనిపించే జీన్స్ వంటివి వేసుకోకూడదు.

1953లో కొరియా యుద్ధం

1910 వరకు కొరియా ద్వీపకల్పం జపాన్ స్వాధీనంలో ఉండేది. 1945లో రెండో ప్రపంచ యుద్ధం చివరిలో జపాన్ లొంగిపోయిన తరువాత కొరియాను రెండుగా విభజించారు. 1948లో రెండు కొరియాల్లో వేర్వేరు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఉత్తరాన ‘ది డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా’ పేరుతో నార్త్  కొరియా, దక్షిణ ప్రాంతంలో ‘రిపబ్లిక్ ఆఫ్ కొరియా’ పేరుతో సౌత్ కొరియా ఏర్పడ్డాయి. అయితే రెండు దేశాల మధ్య సరిహద్దు తగాదాలు ఉండేవి. దీంతో రెండు కొరియాల మధ్య అప్పుడప్పుడు చిన్నపాటి గొడవలు జరిగేవి. ఈ గొడవలు చివరకు కొరియన్ యుద్ధానికి దారితీశాయి. నార్త్ కొరియా దళాలు 1950 జూన్ 25న సౌత్ కొరియాను ముట్టడించడంతో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో సౌత్ కొరియాకు అమెరికా అండగా నిలిస్తే నార్త్ కొరియాకు అప్పటి సోవియట్ యూనియన్  మద్దతు పలికింది. ఒకదశలో నార్త్ కొరియాకు సపోర్ట్ గా చైనా రావడంతో యుద్ధం మరీ ముదిరిపోయింది. మూడేళ్ల పాటు సాగిన కొరియన్ యుద్ధం 1953లో ముగిసింది. అయితే ఈ యుద్ధంలో ఎంతమంది చనిపోయారు అనే వివరాలు చాలావరకు బయటకు రాలేదు. దాదాపు 50 లక్షల మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. అయితే వీటికి కూడా కచ్చితమైన ఆధారాల్లేవు. కొరియా యుద్ధం బ్యాక్ డ్రాప్ లో అనేక సిన్మాలు వచ్చాయి. వీటిలో 1955లో వచ్చిన ‘ ది బ్రిడ్జెస్ ఎట్ టోకో –రీ’, 1958 లో వచ్చిన ‘ది హంటర్స్ ’ సిన్మాలు ముఖ్యమైనవి.