- జాతీయ స్థాయి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో నారాయణ
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రజాస్వామ్యం, లౌకిక శక్తుల పరిరక్షణే ధ్యేKaయంగా జన సేవాదళ్ కార్యకర్తలు రెడ్ ఆర్మీలా పనిచేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పిలుపునిచ్చారు. దేశ రక్షణలో సైన్యం ఉంటే.. జన సేవాదళ్ దేశాన్ని మతోన్మాద శక్తుల నుంచి కాపాడాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఖమ్మంలో పది రోజుల పాటు జరిగిన జన సేవాదళ్ జాతీయ స్థాయి శిక్షణ శిబిరం మంగళవారం ముగిసింది. నారాయణతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, నాయకులు హేమంతరావు, పోటు ప్రసాద్ తదితరులు జన సేవాదళ్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ.. దేశంలో మతోన్మాద శక్తులు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నాయని, రాజ్యాంగానికి సైతం తూట్లు పొడిచి తమకు అనుకూలమైన అంశాలను పొందుపర్చాలని చూస్తున్నాయని ఆరోపించారు.
విపత్కర పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలు, సామాన్యులకు అండగా నిలిచి పోరాటం చేశాయని గుర్తుచేశారు. సీపీఐ ఆవిర్భవించి వందేండ్లు గడచిన సందర్భంగా 2024 డిసెంబరు 26న ఢిల్లీలో లక్ష మంది జన సేవాదళ్ కార్యకర్తలతో ఎర్ర కవాతు నిర్వహిస్తామని నారాయణ తెలిపారు. కూనంనేని మాట్లాడుతూ యువతతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందన్నారు. పోరాటాల ద్వారానే పాలకుల వైఖరిలో మార్పు వస్తుందన్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం యువత ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు మహ్మద్ మౌలానా, నార్ల వెంకటేశ్వరరావు, యువజన విద్యార్థి సంఘాల నాయకులు సిద్దినేని కర్ణకుమార్, రావి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.