ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేవి సంస్కరణలే

అబ్రహాం లింకన్ అన్నట్లు ప్రజాస్వామ్యం అంటే ‘ప్రజల చేత- ప్రజల కొరకు- ప్రజలే పాలించడం’ అనే మాటలు ప్రజాస్వామ్యానికి సంపూర్ణ అర్థాలు. ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజల ఓటుతో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. వాళ్లు కట్టే పన్నులతోనే అవి నడుస్తున్నాయి. ‘‘ఓటు వేసేది మనమే పన్నులు కట్టేది మనమే’’ ఈ స్పృహ ప్రజలకు వస్తే ప్రజాస్వామ్యంలో పెను మార్పులు సంభవిస్తాయి. కానీ ‘ఇచ్చేది వారు.. పుచ్చుకునేది మనం, వారిది పై చేయి.. మనది కింద చేయి’ అనే భావన ఇప్పటికీ కొనసాగుతున్నది. వేసే ఓటుకు అందే సౌకర్యాలకు ఉన్న లంకెను ప్రజలు అర్థం చేసుకున్న నాడు ఓటు విలువ తెలుస్తుంది. దీన్ని అర్థం కాకుండా చేయడానికి సాంప్రదాయ రాజకీయ పక్షాలు ప్రయత్నిస్తున్నాయి. వాటినే క్లుప్తంగా ‘సారా’ పార్టీలు అని పిలవచ్చు. అవి ప్రజలను గందరగోళంలో ముంచేస్తాయి. హామీలు ఇస్తాయి. చాలాసార్లు వాటిని గంగలో కలుపుతాయి. మళ్లీ కొత్త హామీలు పుట్టుకొస్తాయి. ఇదంతా ఒక విష వలయం. ‘జిలేబీ కా చెక్కర్’లో ప్రజలు తమ స్వార్థాన్ని వెతుక్కుంటుంటే, పాలకులూ స్వార్థంతోనే పనిచేస్తున్నారు.  

సంపూర్ణ ప్రజాస్వామ్యం అంటే..

ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ, ప్రజల నిర్ణయాధికారం, ప్రజల భాగస్వామ్యం, చట్టబద్ధపాలన, స్వయం దిద్దుబాటు అనే ఐదు మూల సూత్రాలు ఉన్నాయి. వీటిపై ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ఒక సర్వే జరిగింది. అందులో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పిలుస్తున్న మన దేశ స్థానం 35 మాత్రమే. డెన్మార్క్, స్వీడన్, నార్వేలాంటి చిన్న దేశాలు మొదటి మూడు స్థానాల్లో ఉంటే, మనం మన కన్నా వెనుకబడిన దేశాల కంటే ప్రజాస్వామ్య స్ఫూర్తిని రక్షించడంలో, సంపూర్ణ ప్రజాస్వామ్యం వైపు పయనించడంలో మరింత వెనుకబడి ఉన్నాం. మన పాలకులు, ప్రజలు ఆలోచిస్తున్న తీరు వల్ల ఈ దుస్థితిలో ఉన్నాం. దీన్ని మార్చాలి. అందుకే ఈ సర్వేలో పేర్కొన్న ప్రజాస్వామ్య మూల సూత్రాలేమిటి? వాటిలో మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 

స్వేచ్ఛ: మన దేశంలో స్వేచ్ఛకు కొదవలేదు. దాని వెనుక నిర్బంధం నీడలా వెంటాడుతూనే ఉంటుంది కూడా. ఒక్కోసారి ప్రజాస్వామ్య ఉద్యమకారులు, ప్రజల మీద పాలకులకు కోపం వస్తే ప్రకటిత, అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతూనే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అనే మొదటి అంశానికి సర్వేలో ఇండియాకు వందకు 80 శాతం ఓట్లు వచ్చాయి.

ప్రజల నిర్ణయాధికారం: ప్రజలకు కుల, మత, ప్రాంత, భాష, లింగ వివక్ష లేకుండా సార్వజనీన ఓటు హక్కు మొదటి సార్వత్రిక ఎన్నికల నాటి నుంచీ ఉన్నది. అంటే ప్రాథమిక స్థాయి పంచాయతీ సభ్యుడు నుంచి కౌన్సిలర్, కార్పొరేటర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ వరకు మన పాలకులను మనమే ఓటు వేసి ఎన్నుకుంటున్నాం. ఓటు హక్కుతో సాంకేతికంగా ప్రజలకు పాలకులను ఎన్నుకునే నిర్ణయాధికారం ఉన్నట్లే లెక్క. అది దుర్వినియోగం అవుతున్న సంగతి వేరు. 

ప్రజల భాగస్వామ్యం: ఇక్కడే ప్రజాస్వామ్య స్ఫూర్తికి దెబ్బ పడుతున్నది. ఈ అంశమే ఆ సర్వేలో మనల్ని వెనక్కి నెట్టింది. ఇందులో మనకు కనీసం పాస్ మార్కులు కూడా రాలేదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పనిచేయాలంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలనే భావన జనంలో కొరవడింది. దీన్ని పెంపొందించే బాధ్యతను పాలకులు మరిచిపోయి, నిద్ర నటిస్తున్నారు. అందుకే మధ్యతరగతి, ధనికవర్గ ప్రజల్లో ఓటు హక్కు గురించి సదాభిప్రాయం లేదు. మనం ఓటు వేయకపోతే కొంపలేమీ మునిగిపోవులే అనే ఒక నిర్లిప్త భావన ఆ వర్గాల్లో నెలకొంది. అయితే నిరక్షరాస్యులు, పేద ప్రజలు, గ్రామీణులు మాత్రం కచ్చితంగా ఓటు వేస్తున్నారు. ఓటు వేయడం ఎవర్నో ఒకరిని గెలిపించడం మరొకరిని ఓడించడం ఆ తర్వాత గెలిచిన వారి మీద కోపం వచ్చిన ప్రతీసారి వారిని పదవి నుంచి దిగిపొమ్మని అరవడం ఇదీ మనం చేస్తున్నది. ఐదేళ్లకోసారి, ఇంకా చెప్పాలంటే ప్రతి ఎన్నికల ముందు ఆ తర్వాత జరిగే తంతు ఇదే! దీన్నే మార్చాలి.

విష బీజాలు నాటితే అమృత ఫలాలు వస్తాయా?

ప్రజాస్వామ్యం అనే పొలంలో మనం నాటుతున్నది అమృత ఫలాలను ఇచ్చే విత్తనాలనా, లేక విషపు ఫలాలు ఇచ్చే విత్తనాలనా? అని ఆలోచించకుండా ఓటు వేస్తున్నందున ఇలాంటి పరిస్థితి దాపురిస్తున్నది. విషపు విత్తనాలను నాటి అమృత ఫలాలు ఆశిస్తే కచ్చితంగా ఆశాభంగమే ఎదురవుతుంది. అందుకే పాలనలో ప్రజల భాగస్వామ్యం కొరవడింది. పాలిస్తున్న ప్రభుత్వాలు మనవి కావులే అనే భావన ప్రజల్లో పాదుకొంది. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రజల ఓట్లను కొల్లగొట్టడం కోసం తాత్కాలిక తాయిలాలు, మద్యం, డబ్బులు పంచుతూ ఓటర్లను రాజకీయ పార్టీలు ఆకట్టుకుంటున్నాయి. ఓటర్లు డబ్బులు తీసుకుంటున్నారు. మద్యం తాగుతున్నారు. ‘సబ్ కా సున్ నా అప్ నా కర్ నా’ అనే సూత్రాన్ని పాటిస్తూ వారికి నచ్చిన వారికే ఓటేస్తున్నారు. ఇది మారాలంటే ఓటు అనే వజ్రాయుధంతో ప్రభుత్వాలను మార్చవచ్చనేదే కాకుండా ప్రభుత్వాలతో పని చేయించవచ్చనే సత్యాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పగలగాలి. 

చట్టబద్ధ పాలన: భారత రాజ్యాంగాన్ని చూస్తే పైకి చట్టబద్ధ పాలన రాతపూర్వకంగా అద్భుతంగా కనిపిస్తుంది. మనది అతి పెద్ద లిఖిత రాజ్యాంగం కాబట్టి అందులో అనేక విషయాలను మనం పేర్కొన్నాం. అందుకే ఈ సర్వేలో ఈ విషయానికి ఎక్కువ ఓట్లు పడ్డాయి. కానీ ఆచరణలో చట్టబద్ధ పాలన విఫలమవుతున్నది. రాజ్యాంగంలో రాసుకున్న దానికి ప్రస్తుతం దేశంలో జరుగుతున్న దానికి పొంతన లేదు. అందుకే చట్టబద్ధ పాలన విషయంలో మార్కులు ఎక్కువగా వచ్చినా, క్షేత్రస్థాయిలో అది కనిపించదు. పైరవీ, లంచం లేకుండా హక్కుగా అందాల్సిన సేవలతో సహా మనకు ప్రభుత్వ సేవలు అందడం లేదు. మన హక్కులను కాపాడుకోవడానికి ఇతరులను ఆశ్రయించాల్సిన అవసరం ఎక్కువవుతున్నది. అందుకే చట్టం కొందరికి చుట్టం అయిపోయింది.

స్వయం దిద్దుబాటు: స్వాతంత్ర్యం వచ్చి75 ఏండ్లు పూర్తయింది. రాజ్యాంగం రాసుకొని అమల్లోకి తెచ్చుకొని కూడా 70 ఏండ్లు గడిచింది. మన రాజ్యాంగంలో 110కి పైగా సవరణలు చేసుకున్నాం. ఇది స్వయం దిద్దుబాటుగా పైకి అనిపిస్తుంది. కానీ అవసరమైన మార్పులు చేయడానికి ఇది సరిపోదు. అందుకే స్వయం దిద్దుబాటు అంశంలో మనం అంతకుమించి ఆలోచించాల్సిన అవసరమే ఉంది. ప్రజాస్వామ్యంలో మొదట రాజకీయ, పాలనా సంస్కరణలు  రావాలి. ఈ రెండు అంశాలు మౌలికంగా మారాలంటే ఎన్నికల సంస్కరణలు కావాలి. న్యాయ, పోలీస్​ వ్యవస్థల్లోనూ సంస్కరణలు రావాలి. 

స్థానిక ప్రభుత్వాల సాధికారత

ప్రజలు ఎక్కడ నివసిస్తారో అక్కడ సౌలత్​ల కల్పన తప్పనిసరి. నివాసయోగ్యమైన గ్రామాలు, పట్టణాలు ఏర్పడాలంటే స్థానిక ప్రభుత్వాల సాధికారతతో పనిచేయాలి. ‘ఇంటి ముందు పాలన కంటి ముందు ప్రభుత్వం’ అనే ఆచరణాత్మకమైన నినాదంతో స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఇవ్వాలి. ప్రస్తుతం ఉన్న అధికార కేంద్రీకరణ నుంచి వికేంద్రీకరణ వైపు సంస్కరణలు జరగాలి. వ్యవసాయంలో కూడా ‘గిట్టుబాటు వ్యవసాయం’ అనే పాత నినాదాన్ని పక్కనపెట్టి ‘లాభసాటి వ్యవసాయం’ వైపు ఆలోచించేలా వ్యవసాయ సంస్కరణలు ప్రవేశపెట్టాలి. లంచం లేకుండా పౌర సేవలు అందే కొత్త వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలి. పన్నులు కడుతున్న మనమే ప్రభుత్వాల మీద హక్కుగా లభించే పౌర సేవలను డిమాండ్ చేయగలగాలి.

రాజకీయ పార్టీలు ఇటువైపు ఆలోచించాలంటే డిమాండ్ సప్లయ్​సూత్రం వర్తిస్తుంది. ప్రజలు కోరితే మేం అది చేస్తామని రాజకీయ పార్టీలంటాయి. పార్టీలు వాటిని అమలు చేస్తే మేము ఓటు వేస్తామని ప్రజలు అంటారు. పరస్పరం ప్రయోజనం ఉంటే తప్ప అటు పాలకులు, ఇటు ప్రజలు ఆ రీతిన ఆలోచించరు. ‘ప్రజాస్వామ్య పాలన సంస్కరణలు’ అనే అంశాన్ని ప్రజలు, రాజకీయ పార్టీలు ఆలోచించాలి. అప్పుడే ‘ప్రజలే ప్రభువులు.. పాలకులు సేవకులే’’ అనే నినాదం నిజమవుతుంది. లేదంటే మేడిపండు ప్రజాస్వామ్యం కొనసాగుతూనే ఉంటుంది.

- బండారు  రామ్మోహన్​ రావు, సోషల్​ ఎనలిస్ట్