విశ్లేషణ: డేంజర్​లో డెమొక్రసీ?

హుజూరాబాద్​ ఉప ఎన్నిక ముగిసింది. అయితే ఈ ఎన్నిక ఇప్పుడు ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా ఇది నిలిచిందని రాజకీయ నాయకులే చెప్పుకుంటున్నారు. ఇక ప్రత్యర్థిని ఓడించడం కోసం అధికార పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. నోటిఫికేషన్​ రాకముందు నుంచే ప్రలోభాల పర్వం మొదలుపెట్టింది. వేల కోట్ల రూపాయల పథకాలతో నిర్దిష్ట కులాలను ప్రలోభ పెట్టడం, అభివృద్ధి పథకాల పేరుతో అప్పటికప్పుడు పనులు చేయడం ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇక కులాలను విడదీసి ప్రత్యేక ప్యాకేజీలతో వ్యక్తిగతంగా, సామూహికంగా ఓట్లు కొనే ప్రయత్నాలు చివరి వరకూ సాగాయి. ఇక ఓటుకు రూ.6 వేలను కవర్లలో పెట్టి అందించడం ఈ ఎన్నికల అవినీతికి పరాకాష్ట. దీనికి తోడు తమకు పైసలు రాలేదంటూ జనాలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయడం ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి వెళుతోందనడానికి సంకేతం. ఇదే పరిస్థితి కొనసాగితే కోటీశ్వరులు, నేర చరిత్ర ఉన్నవారు తప్ప.. సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితులు ఉండకపోవచ్చు.

ఎన్నికల కమిషన్ ఏం చేయాలి?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాంగ వ్యవస్థగా ఎన్నికల కమిషన్​ ఏర్పాటైంది. పార్లమెంట్ తో పాటు అన్ని రాష్ట్రాల చట్టసభల ఎన్నికలను నిర్వహిస్తోంది. ఆయా రాష్ట్రాల ఓటర్ల జాబితాలను సంబంధిత రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులు, ఇతర అధికారుల చేత తయారు చేయించి ప్రతి ఐదేండ్లకు ఒకసారి సాధారణ ఎన్నికలతోపాటు వివిధ కారణాలతో వచ్చే ఉపఎన్నికలను జరిపిస్తుంది. కులమతాలకు అతీతంగా, ఎలాంటి ప్రలోభాలు, రాజకీయ ఒత్తిళ్లకు తావివ్వకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించాలని రాజ్యాంగం చెబుతోంది.

ఆచరణలో ఏం జరుగుతున్నది?
70 ఏండ్ల స్వతంత్ర భారతంలో స్వతంత్ర ప్రతిపత్తితో పని చేయాల్సిన ఎన్నికల కమిషన్ దశాబ్దాలుగా ఓటర్ల జాబితాల తయారీ దగ్గర నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రభుత్వాల ఒత్తిళ్లకు లోనవుతూ నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించలేకపోతోంది. గతంలో అయితే బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్, దొంగ ఓట్ల లాంటి అనేక ఎన్నికల నేరాలు యథేచ్చగా సాగిపోయేవి. ఎన్నికల కమిషన్ నియమాల్లోని లోపాలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని లొసుగుల కారణంగా చట్టసభల్లో కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులు, నేర చరిత్ర గలిగిన వ్యక్తులే ఎక్కువగా ప్రవేశించ గలుగుతున్నారు. టీఎన్​ శేషన్  చీఫ్​ ఎలక్షన్​ కమిషనర్(సీఈసీ)గా ఉన్న కాలంలో అనేక ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చారు. ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు పరుస్తూ బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్, దొంగ ఓట్ల లాంటి అనేక ఎన్నికల నేరాలకకు అడ్డుకట్ట వేశారు. తద్వారా ఎన్నికలను సజావుగా నిర్వహించి శేషన్​ ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. ఆ తర్వాత కొంత కాలం ఎన్నికల నిర్వహణలో ఆయన ముద్ర కనపడినా తర్వాత మళ్లీ డబ్బు, అధికారానికి ప్రాధాన్యం పెరగడం ప్రజాస్వామ్యానికి విఘాతంగా మారింది.

నోటిఫికేషన్ రాకముందు నుంచే..
హుజూరాబాద్​ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్​ రాకముందు నుంచే ప్రలోభాల పర్వం మొదలైంది. ఇక నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి పోలింగ్​ తేదీ వరకు నియోజకవర్గంలో జరిగిన ప్రచార సరళిని గమనిస్తే మన ఎన్నికల వ్యవస్థ ఎటుపోతోందో అనే ఆందోళన కలిగింది. రాజ్యాంగ వ్యవస్థలుగా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ఎన్నికల ప్రలోభాలను ఆశించిన స్థాయిలో అరికట్టలేకపోయాయి. ఎన్నికల నియమావళి స్ఫూర్తికి విరుద్ధంగా వేల కోట్ల రూపాయల ప్రభుత్వ పథకాలతో నిర్దిష్ట కులాల ఓటర్లను ప్రలోభపెట్టడం నోటిఫికేషన్​ రాకముందే మొదలైంది. ఇక ఎలక్షన్​ తేదీ వచ్చిన తర్వాత ఏ కులానికి ఆ కులాన్ని విడదీసి ప్రత్యేక సమావేశాలు, ప్రత్యేక ప్యాకేజీలతో ఓట్లను కొల్లగొట్టడానికి ప్రయత్నాలు సాగాయి. రకరకాల వ్యక్తిగత, సామూహిక తాయిలాలు ఓటర్లకు చేరాయి. అధికార దుర్వినియోగం సాగింది.

పోలింగ్ రోజున పతాక స్థాయికి..
ఎన్నికల ప్రచారానికి తెరపడిన నాటి నుంచి పోలింగ్​ జరిగే వరకు 48 గంటల సమయంలో ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేపట్టకూడదు. కానీ దేశ ఎన్నికల చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో బాహాటంగా ఓటర్ల ఇంటింటికీ తిరిగి ఓటుకు రూ.1,500 నుంచి రూ.6,000 ఇంకా పైపెచ్చు ధరతో వందల కోట్లను వెచ్చించారు. అంగట్లో సరుకులాగా ఓట్లను కొనుగోలు చేశారు. ఈ ఎన్నిక కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన లిక్కర్ ను పకడ్బందీగా టోకెన్లు జారీ చేసి మరీ పంపిణీ చేశారు. ఎన్నికల అవినీతి, ప్రలోభాలను నియంత్రించాల్సిన మోడల్ కోడ్ మానిటరింగ్ అధికారులు, స్ట్రాటజిక్ సర్వయిలెన్స్ టీంలు, ఎన్నికల నిఘా వర్గాలు, కేంద్ర, రాష్ట్ర బలగాల డేగ కళ్లు వీటిని ఎందుకు ఆపలేకపోయాయో అర్థమవట్లేదు.

పైసల కోసం ఓటర్లు ధర్నాలు చేయడమా?
ఓటుకు రూ.6,000 చొప్పున పొరుగు వారికి ఎన్నికల తాయిలంగా నగదు ముట్టిన నిజాన్ని గుర్తించిన ఓటర్లు అనేక గ్రామాల్లో మాకూ పైసలివ్వకుంటే ఓట్లు వేయమని నిరసనలకు, ధర్నాలకు దిగడాన్ని బట్టి ఎన్నికల అవినీతి నేరుగా ఓటర్లను కొనుగోలు చేసే స్థాయికి దిగజారిన వైనం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. నిజానికి ఎన్నికల సమయంలో తమకు రోడ్లు లేవనో, మంచి నీటి సదుపాయం లేదనో, మరేదో సామూహిక అవసరం కోసమో అవి సమకూర్చితేనే ఓట్లు వేస్తామనే నిరసనలను దశాబ్దాలుగా మనం గమనిస్తూనే ఉన్నాం. కానీ ఈ ఉప ఎన్నికలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా అనేక గ్రామాల్లో తమకు డబ్బు అందలేదని ఆగ్రహించి వీధులకెక్కి తోటి వారికిచ్చినట్లు మాకూ రూ.6,000 ఇస్తేనే ఓట్లు వేస్తాం.. లేకుంటే వెయ్యమని ధర్నాలకు దిగడం ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతిష్టకు మాయని మచ్చే. ఇలా కాకుకండా చైతన్యవంతులైన హుజూరాబాద్ ఓటర్లు నోటుకు, మద్యానికి తమని కొనడం చట్టరీత్యా నేరమని రాజకీయ నాయకులకు బుద్ధి చెబితే బాగుండేది.

నోట్ల పంపిణీపై చర్యలేవి?
ఉప ఎన్నిక సందర్భంగా ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా నోట్ల కట్టల వీడియోలు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం అయ్యాయి. విచ్చలవిడిగా డబ్బు పంచడంపై కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అలాగే డబ్బు కట్టలు, కవర్లు చేతులు మారిన దృశ్యాలు సోషల్ మీడియాలో జోరుగా సర్క్యులేట్​ అయ్యాయి. అయితే ఇవన్నీ ఫేక్ న్యూస్ అని, అలాంటి ఊహాజనిత వార్తలపై చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని ఎన్నికల అధికారులు చెప్పడం బాధాకరం. అదే నిజమైతే ఫేక్ వార్తలను ప్రచారం చేసిన సోషల్ మీడియాను నియంత్రించాల్సిన బాధ్యత లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కళ్ల ముందే నోట్ల కట్టలు పంచుతున్న నాయకులు కనపడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఎన్నికల సంస్కరణలు రావాలె
ఎన్నికల అవినీతి, ప్రలోభాల పర్వం ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో పార్లమెంట్​కు, వివిధ రాష్ట్రాల చట్టసభలకు జరిగే ఎన్నికల్లో పోటీ పడాలంటే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందనే నిజం హుజూరాబాద్ ఉప ఎన్నిక ద్వారా రుజువైంది. ఈ నేపథ్యంలో అపర కుబేరులు, కోటీశ్వరులు తప్ప ఎన్ని అర్హతలున్నా మధ్య తరగతి, అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజలకు పోటీ చేసే అవకాశమేలేదని రూడీ అయ్యిందని చెప్పకతప్పదు. అందువల్ల ప్రజాస్వామ్యం పిడికెడు మంది చేతుల్లో బందీగా మారకుండా ఉండాలంటే దేశంలో ఎన్నికలను నిర్వహించే రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎన్నికల కమిషన్ పూర్తి స్వతంత్రంగా తన బాధ్యతలను నిర్వర్తించాలి. ప్రభుత్వాలు కూడా మరిన్ని ఎన్నికల సంస్కరణలను తీసుకురావడం ద్వారా ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలి. పత్రికలు, ప్రసార సాధనాల తోడ్పాటుతోపాటు పౌర సమాజం, మరీ ముఖ్యంగా ఓటర్లు సైతం ఎన్నికల ప్రలోభాలతో తమ ఓట్లతో రాజ్యాధికారం పొంది.. ఆ తర్వాత తమ సమస్యల పరిష్కారం పట్ల ఉదాసీనత ప్రదర్శిస్తూ రాజకీయాలను వ్యాపారంగా మార్చి కోట్లకు పడగలెత్తుతున్న రాజకీయ నాయకుల పట్ల ఏమరుపాటుగా ఉండాలి. నిజాయితీపరులు,సేవాదృక్పథం గల అభ్యర్థులనే ప్రతినిధులుగా చట్ట సభలకు పంపడం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం కట్టాలి.
- నీలం సంపత్, సామాజిక కార్యకర్త