- ఈశాన్య రాష్ట్రంలో అల్లర్ల వెనుక బీజేపీ సర్కారు
- పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే హింస
- ఇదే అసలైన సంవిధాన్ హత్య.. బీజేపీపై విరుచుకుపడ్డ కాంగ్రెస్
న్యూఢిల్లీ: పంచాయతీ ఎన్నికల ప్రకటన తర్వాత త్రిపురలో చెలరేగిన హింసాత్మక ఘటనల వెనుక బీజేపీ మాస్టర్ ప్లాన్ ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈశాన్య రాష్ట్రంలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని మండిపడింది. ఇదే అసలైన సంవిధాన్హత్య అని పేర్కొంది. త్రిపురలో కాంగ్రెస్ నాయకులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ట్విట్టర్(ఎక్స్)లో బీజేపీపై విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో అల్లర్లకు డబుల్ ఇంజిన్ సర్కారే(బీజేపీ) సూత్రధారి అని ఆరోపించారు. ఇది భారత రాజ్యాంగ సంస్థలు, దాని సూత్రాలు, విలువలు, నిబంధనలపై బీజేపీకి మాత్రమే సాధ్యమయ్యే దాడి అని త్రిపుర కాంగ్రెస్ ఇన్చార్జి గిరీశ్ ఛోడంకర్ పెట్టిన పోస్ట్‌ను ట్యాగ్చేస్తూ జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. త్రిపురలో పంచాయతీ ఎన్నికలకు ఆగస్టు 8న పోలింగ్ జరగనుంది. ఆగస్టు 10న కౌంటింగ్, ఫలితాలను వెల్లడిస్తామని ఈసీ ప్రకటించింది.
నామినేషన్ వేయకుండా బీజేపీ అడ్డుకుంటున్నది..
ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులను పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేయకుండా బీజేపీ అడ్డుపడుతోందని, హింసకు పాల్పడుతోందని గిరీశ్ ఛోడంకర్ ట్వీట్ చేశారు. పంచాయతీ ఎన్నికల ప్రకటన వచ్చిన మరుసటిరోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలపై బీజేపీ లీడర్లు దాడులు ప్రారంభించారని చెప్పారు. కాంగ్రెస్ తరఫున పోటీచేయొద్దని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
“ప్రియమైన మోదీ జీ త్రిపురలో హింసను ఆపాలని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని మీ పార్టీకి చెప్పండి. లేకుంటే మణిపూర్లాగే త్రిపుర ఓటర్లు కూడా మీకు తగిన శిక్ష విధిస్తారు” అని చురకలంటించారు. ఈ దారుణమైన హింసను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందని ఏఐసీసీ నేషనల్సెక్రటరీ జరితా లైత్ఫలాంగ్ పేర్కొన్నారు.