ప్రజాస్వామ్యం  కొన్ని దేశాల్లో కుదరదు

ప్రపంచమంతా ఒకే తీరుగా ఉండదు. అలా ఉండటం సాధ్యం కాని పని. ప్రపంచవ్యాప్తంగా ఉండే వివిధ పాలనా విధానాలను నడిపించే ప్రధానమైన సంస్కృతులను అర్థం చేసుకోవడంలో అమెరికా విఫలమైంది. అన్నింటికీ ఒకే మంత్రం పనిచేయదనే విషయాన్ని అమెరికా ముందుగానే నేర్చుకోవాల్సింది. దురదృష్టవశాత్తు, నేటి ఆధునిక ప్రపంచం పరిపాలనకు ప్రజాస్వామ్యం ఒక్కటే తగిన విధానమని నమ్ముతోంది. దానికి కారణం గతంలో ఎప్పుడూ అంత కంటే మెరుగైన పాలనా వ్యవస్థను చూడకపోవడం. ప్రపంచంలోని అన్ని దేశాలను ప్రజాస్వామ్య దేశాలుగా మార్చాలని అమెరికా ఉవ్విళ్లూరుతోంది. కానీ, ఆ ప్రయత్నం పగటికలగానే మిగిలిపోతుంది, అది ఎన్నటికీ సాకారం కాదు. విజయవంతంగా మనుగడలో ఉన్న ప్రజాస్వామ్య దేశాలను పరిశీలిస్తే ఆ దేశాల్లో సహనం, నిర్దిష్టమైన సామాజిక విలువలతో కూడిన బలమైన సాంస్కృతిక పునాదులు కనిపిస్తాయి. కానీ, ఏ దేశాల్లో అయితే ఏకపక్ష, మిశ్రమ పాలనను చూశాయో అవి ప్రజాస్వామ్య స్ఫూర్తిని అర్థం చేసుకోలేవు, ప్రజాస్వామ్యయుత పరిపాలనను అమలు చేయలేవు. ప్రజాస్వామ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయలేమని తెలిపేందుకు ఎన్నో విఫల ఉదాహరణలను మనం చూడవచ్చు.


1947కు పూర్వం ఇండియాలో ప్రజాస్వామ్యం లేదు. కానీ, విదేశీయుల దాడులు జరగడానికి 800 సంవత్సరాల ముందు ఈ ప్రాంతాన్ని రాజులు పరిపాలించారు. వారి పాలన ప్రజాస్వామ్యం కన్నా మిన్నగా ఉండేది. సహనం, నిరాడంబరత, దైవత్వం, స్వయం సమృద్ధి, సార్వజనీన సామరస్యం, విజ్ఞానం వంటివి శతాబ్దాల తరబడి భారతదేశ సాంస్కృతిక పునాదులుగా నిలిచాయి. ఆ ప్రాచీన విలువలు, సంస్కృతి 1947 తర్వాత ఇండియాను సులభంగా ప్రజాస్వామ్యాన్ని అందిపుచ్చుకునేలా చేశాయి. అది దీర్ఘకాలంగా విజయవంతంగా కొనసాగుతూ భారత్​ను అతి పెద్ద, క్రియాశీల ప్రజాస్వామ్య దేశంగా నిలుపుతోంది. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలైన పరస్పర గౌరవం, సహనం, సామాజిక సామరస్యం, ఇతర విలువల వంటి సాంస్కృతిక పునాదులు లేని దేశాల్లో ఇతరులు బలవంతంగా ప్రజాస్వామ్యాన్ని రుద్దితే అది ఫలితాన్ని ఇవ్వదు.
విధ్వంసానికి విందు
ప్రజాస్వామ్యాన్ని ఎగుమతి చేసేందుకు అమెరికా చేసిన దుస్సాహసానికి తాజా ఉదాహరణ అఫ్గానిస్తాన్. ఒక దేశంలో ఎలాంటి పాలనా విధానం ఉండాలో సూచించి అక్కడి ప్రజలు దానిని అనుసరించాలని విదేశీ శక్తులు నిర్దేశించలేవు. ప్రజాస్వామ్యం అనేది ఒక ఆలోచనా విధానం. ప్రపంచానికి ఇప్పటి వరకు దొరికిన పాలనా విధానాల్లో అది ఉత్తమమైనది కావచ్చు. ప్రపంచమంతటికీ అది ఆదర్శమని అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ వంటి కొన్ని ప్రజాస్వామ్య దేశాలు భావిస్తుంటాయి. కానీ, అన్ని దేశాలూ ఆ తరహా విధానానికి ఒప్పుకోవు, అంగీకారం కూడా తెలుపవు. ప్రపంచ దేశాల్లో కేవలం 49% మాత్రమే ప్రజాస్వామ్య పాలనా విధానాన్ని అనుసరిస్తున్నాయి. వాటిల్లో 19% మాత్రమే నిజమైన క్రియాశీలక ప్రజాస్వామ్యాలు, మిగిలిన 30% లోపభూయిష్టమైనవి లేదా నిష్క్రియమైన ప్రజాస్వామ్యాలు. అంటే ప్రపంచంలో ప్రజాస్వామ్య పంథాను అనుసరించని దేశాలు 51% ఉన్నాయి. చైనా, యూఏఈ, సౌదీఅరేబియా, వియత్నాం, జోర్డాన్ వంటి ప్రజాస్వామ్యేతర దేశాలు ఆర్థికంగా పరిపుష్టంగా నిలుస్తూ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో సమర్థతను ప్రదర్శిస్తున్నాయి. ప్రజాస్వామ్య దేశం కాకపోయినా విభిన్ననమైన పాలనా విధానంతో సామాజిక, ఆర్థికపరంగా ప్రపంచ శక్తిగా చైనా ఎదిగింది.
మనుషులందరికీ ఒకే రకమైన ఆకాంక్షలు ఉంటాయనే భావనతో ఒక దేశపు స్వభావాన్ని మార్చి దాని ద్వారా వాటిని సాధించవచ్చనేది కచ్చితంగా లోపభూయిష్టమైన ఆలోచనే. సంస్కృతి, రాజకీయ పరంగా ఇలాంటి పిచ్చి తలంపులు మహా విధ్వంసానికి విందు భోజనం వంటివి.
ప్రపంచ ఫలితాలు
అఫ్గానిస్తాన్ ప్రస్తుతం ఒక విచ్ఛిన్న దేశంగా నిలిచింది. సమీప భవిష్యత్తులో అది కోలుకోవడం అసాధ్యమే. ఉహించ సాధ్యం కాని భయంతో కుటుంబాలతో కలిసి దేశం నుంచి పారిపోయేందుకు అక్కడి అమాయక ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం. విమానాలు పట్టుకొని వేలాడుతున్న అక్కడి వారి దుస్థితి చూస్తుంటే అఫ్గాన్ పౌరుల అంతులేని నిరాశా నిస్పృహలను కళ్లకు కట్టినట్టుగా చూపుతున్నాయి. ఇలాంటి పరిణామాలు ఆ దేశంపైనే కాదు పొరుగు దేశాలు, ప్రాంతాలు, ఉప ఖండం, ఏకంగా ఖండాన్నే ప్రభావితం చేస్తాయి. ఈ అరాచక ప్రభావం ప్రపంచమంతటా ఉంటుంది. అది ఆ ప్రాంతంలోని అనేక దేశాలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అస్థిరపరచగలదు. దురాక్రమణ ఉద్దేశాలు, స్వార్థపూరిత రాజకీయ లక్ష్యాలు కలిగిన దేశాలకు ఈ పరిణామాలు అవకాశాలుగా మారుతాయి. ప్రజాస్వామ్యం అన్నది ఒక ఎగుమతి చేసే వస్తువు కాదనే విషయాన్ని అమెరికా, యూరోప్ లోని దాని మిత్రదేశాలు గ్రహించాలి. తమ విధానాల్ని ఎక్కడెక్కడి దేశాల్లోనో ఏకపక్షంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తే ఆ దేశం పతనమవడమే కాదు అది అంతర్జాతీయంగా తీవ్రఘటనలకు దారి తీస్తుంది. విశ్వవ్యాప్తంగా లక్షలాది మంది నిరాశ్రయులు కావడమే కాదు వారి జీవితాలు నాశనమైపోతాయి.

రివర్స్ ఇంజినీరింగ్
సైనిక శక్తిపరంగా లేదా రుణదౌత్యం ద్వారా తాను ఆక్రమించిన భూభాగాల్లో సమీప భవిష్యత్ లో తన తరహా పాలనా విధానాన్ని చైనా జొప్పించదలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ప్రజాస్వామ్యం అనేది ఒక కొనుగోలు వస్తువు కాదనే విషయం అనేక దశాబ్దాల తర్వాత అమెరికాకు అవగతమైనట్టు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల మాట్లాడిన మాటలు తెలియజేస్తున్నాయి. సదుద్దేశంతో అయినప్పటికీ బలవంతంగా ఒక దేశపు పాలనా స్వరూపాన్ని మార్చి దాని భవిష్యత్తును అమెరికా, దాని మిత్రదేశాలు నిర్ణయించలేవు. వియత్నాం, ఇరాక్, సిరియా, లిబియా, ఈజిప్టు వైఫల్యాల నుంచి ఇటీవలి అఫ్గాన్ వరకు గొప్ప గుణపాఠాలు నేర్పుతున్నాయి. ఆ దేశాల్లో సహజంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చెందిన పాలనా విధానాల్లో జోక్యం చేసుకోకూడదని ఆ పరిణామాలు తేటతెల్లం చేశాయి.

నశించిపోయిన దేశాలు
యుద్ధం ఒక దేశాన్ని నాశనం చేసిందంటే నేను అర్థం చేసుకోగలను. ముందు జాగ్రత్తగా లేదా ప్రతిస్పందనగా ఒక దేశం మరో దేశంపై దాడి చేయడాన్ని కూడా నేను అర్థం చేసుకోగలను. కానీ, ఒక దేశపు మౌలిక స్వరూపాన్ని మార్చేందుకు ఆక్రమించుకోవడమన్నది ఒక తెలివితక్కువ పని. దేశాలు నిర్మించాలనే మతిమాలిన చర్యల కారణంగా ఇటీవలి కాలంలో అనేక దేశాలు భయంకరమైన అరాచకత్వం, హింస, పేదరికంలో చిక్కుకుపోయాయి. లక్షలాది మంది జీవితాలను శాశ్వతంగా అస్థిరపరిచాయి. రాజకీయ, సైనిక నిర్ణయాలపై ఏ మాత్రం నియంత్రణ కలిగి ఉండని సామాన్యులు అంతులేని బాధ, వేదనకు గురవుతున్నారు.                                                                                    - కె.కృష్ణసాగర్​రావు, బీజీపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి