తెలంగాణలో ప్రజాపాలన ఆవిష్కృతం అవుతున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక దశాబ్ద కాలంపాటు అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న తెలంగాణ పౌర సమాజం ఇప్పుడు ప్రజాస్వామ్య గాలులు పీలుస్తున్నది. నియంతృత్వ పోకడలు, నిత్య నిర్బంధాలతో తెల్లారిన తెలంగాణ ఇప్పుడు నూతన ఉషోదయాలను చవి చూస్తున్నది. తెలంగాణ మా జాగీర్ అని నీలిగిన గత పాలకులకు రాష్ట్ర ప్రజానీకం నిశ్శబ్దంగా కర్రుకాల్చి వాత పెట్టింది. ‘తెలంగాణ అంటే పిడికెడు మాట్టారా.. పిపీలికాదీ బ్రహ్మ పర్యంతం కంపరం పుట్టించే మందుపాతర’.. అన్న చందంగా బీఆర్ఎస్ను బొంద పెట్టారు. తెలంగాణ నిద్రాణమై ఉన్నట్లు కనిపించినా...ఆత్మగౌరవంపై దాడి చేస్తే అది పేలేందుకు సిద్ధంగా ఉండే మందుపాతరేనని గత పాలకులకు రుచి చూపించింది. ప్రత్యామ్నాయంతో ప్రజాస్వామ్యపు పునాదులను మరింత పటిష్టం చేసుకున్నది.
రైతులకు బేడీలు వేసిన బీఆర్ఎస్
తెలంగాణను వికాసం వైపు నడిపిస్తారనుకుంటే రాష్ట్రాన్ని విధ్వంసం, నిర్బంధం కోరల్లో నిలిపిన చరిత్ర బీఆర్ఎస్ ది. నక్సలైట్ ఎజెండా మాదని ప్రగల్భాలు పలికిన కేసీఆర్.. రాజ్యాంగబద్ధంగా నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేసిన పాపం నాటి పాలకులది. ప్రజాస్వామ్య పాలన అందిస్తామని ప్రమాణం చేసి రోజులు కూడా గడవకముందే ధర్నాచౌక్ ఎత్తేసి పౌర సమాజానికి స్పష్టమైన సందేశం ఇచ్చారు. అది ప్రజాస్వామ్య పాలన అంతర్ధానంకు సాక్ష్యంగా నిలిచింది. ఆరుగాలం పంట పండించే రైతులు మద్దతు ధర అడిగినందుకు ఖమ్మంలో బేడీలు వేసిండ్రు. ఇదేం దుర్మార్గమని నిలదీసిన నాటి ప్రతిపక్ష నాయకులపై జులుం ప్రదర్శించిండ్రు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో కొలువులు ఏవి అని..? కొట్లాడిన ఉద్యమ సారథి కోదండరాం ఇంటి తలుపులు బద్దలుకొట్టి అరెస్ట్ చేసిన దుర్మార్గాన్ని ఎవరు మరిచిపోతారు.? తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని పదవులు ఆశించకుండా పోరాడిన ఓయూ , కేయూ విద్యార్థులు.. ప్రభుత్వ నిర్లక్ష్యం, పేపర్ లీకులతో కరెంట్ స్తంభాలకు ఫొటోలై వేలాడిన విషాదం ఇంకా గగుర్పాటుకు గురి చేస్తున్నది.
అణచివేత అధికమైతే తిరుగుబాటు
తిరుగుబాటు ఈ నేల పొత్తిళ్ళలో అంతర్లీనంగా ఉంటుంది. అన్యాయం, అణచివేతలు అధికమైనప్పుడు ఈ నేల తిరుగుబాటుకు పురుడుపోసింది. పోస్తుంది కూడా. అలాగే అనేక దుర్మార్గాలు, దోపిడీలు కొనసాగుతున్న వేళ తిరుగుబాటును గడీలపై ఎక్కుపెట్టింది. గడీల పాలనను కుప్పకూల్చింది. తెలంగాణ చైతన్యాన్ని మరోసారి చాటింది. ఈ ఎరుకను మరిచిన గత పాలకులు.. కళ్లు మూసుకొని పిల్లి పాలు తాగినట్లు.. వాళ్ళ దోపిడీ, అరాచకాలను తెలంగాణ సమాజం గమనించడం లేదనుకొని ఇష్టారీతిన రాష్ట్రాన్ని లూఠీ చేసిండ్రు. ఇంకానా.. ఇకపై మీ దోపిడీ పాలన చెల్లదని తెలంగాణ ప్రజానీకం సామూహికంగా గర్జించింది. ప్రజాపాలన అందిస్తామన్న పార్టీని సింహాసనంపై కూర్చోబెట్టి.. మరోసారి తెలంగాణ ఆత్మగౌరవ జెండాను సమున్నత శ్రేణిలో రెపరెపలాడించింది. ఈ దృక్కోణం నేటి ప్రజా ప్రభుత్వం కలిగి ఉంటూ ప్రజా రంజక పాలన అందించాలి. కాంగ్రెస్ సర్కారు పాలన ఆ దిశగానే సాగుతున్నది. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి పథకం (ఉచిత బస్సు ) ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. రాజీవ్ గాంధీ ఆరోగ్య బీమా పథకాన్ని కూడా అమలు చేసిండ్రు. మిగతా గ్యారంటీలను వంద రోజుల్లోపు అమలు చేస్తామన్న హామీకి కట్టుబడి హామీ అమలు దిశగా వడివడిగా అడుగులు వేస్తుండ్రు. కానీ, ప్రభుత్వ పెద్దల కాళ్లలో కట్టెలు పెట్టేవిధంగా మాట్లాడుతున్నరు గత పదేండ్లు అధికారం చెలాయించి ఇచ్చిన హామీలను నెరవేర్చని అసమర్థులు. సమర్థవంతమైన ప్రజా ప్రభుత్వానికి బీఆర్ఎస్ నేతలు సుద్దులు చెప్పడం హాస్యాస్పదం. కొత్తగా బీఆర్ఎస్ పార్టీ బీసీల గురించి మాట్లాడుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ ఘనతే.
అనితర సాధ్య ప్రగతి
ఉద్యమకారులకు గుర్తింపు లభిస్తున్నది. తెలంగాణ పాటల ఊట గద్దరన్న పేరిట అవార్డులు ఇస్తామనే ప్రకటన తెలంగాణ స్వీయ అస్తిత్వానికి సమున్నత గుర్తింపునివ్వడమే. పురోభివృద్ధి అన్నది అంచెలంచెలుగా జరుగుతోంది. మూడు నెలల వ్యవధిలో సాధించిన ప్రగతి అనితర సాధ్యమని చెప్పాలి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రోజుకు18 గంటలు కష్టపడుతూ, అస్తవ్యస్త వ్యవస్థను గాడిన పెడుతున్నారు. అన్ని శాఖలపై సంపూర్ణ అవగాహన సాధిస్తూ, నిత్య సమీక్షలు నిర్వహిస్తున్నారు. పరిపాలన అంటే ఇదీ అని నిరూపిస్తూ.. ప్రజాహితంగా ముందుకు సాగుతున్నారు మన ముఖ్యమంత్రి రేవంతన్న. ప్రజలతో మమేకమై ప్రజలతో పాటు ఉంటూ వారి అవసరాలు తెలుసుకుంటూ వారికి తగు సేవ చేయడమే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. - పాలకులం కాదు సేవకులం అన్నమాటకు నిలువెత్తు నిదర్శనంగా ముందుకుపోతున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి.
ప్రజాస్వామ్య చుక్కాని ధర్నాచౌక్
అధికారం కోల్పోయ్యాకే బీఆర్ఎస్కు బీసీలు గుర్తుకొచ్చారంటే అది కాంగ్రెస్ చలువే కదా? హామీల అమలు కోసం చిత్తశుద్ధితో సూచనలు చేయడం ప్రజాహితం.. సకల జనహితం. అంతేకానీ, ప్రజా ప్రభుత్వం అనే విధానంతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేల్చడం మాని.. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పరిష్కారానికి ప్రభుత్వానికి సూచనలు చేయండి. అప్పుడే ప్రజల్లో విశ్వసనీయత పొందుతారు. మేము పాలకులం కాదు..సేవకులం అన్నట్లుగానే.. ప్రగతి భవన్ కంచె తొలగించి.. ప్రభుత్వ పెద్దలను ఎప్పుడైనా ప్రజలు కలవొచ్చు అనే సందేశాన్ని ముఖ్యమంత్రి రేవంతన్న ఇచ్చారు. సెక్రటేరియట్ ద్వారాలను ఎప్పుడూ తెరిచే ఉంచుతూ.. మంత్రులు ప్రజలను కలుస్తున్నారు. సమస్యలపై రివ్యూలతో మంత్రులు బిజీ అవుతున్నారు. గతంలో ఒక్క మంత్రి సొంతంగా ఒక్క రివ్యూ చేసిన దాఖలా ఉన్నదా..? కానీ, ఇప్పుడు మంత్రులు తమ శాఖలపై సొంతంగా నిర్ణయాలు తీసుకునే ప్రజాస్వామిక వాతావరణంలోకి రావడం శుభపరిణామం. తెలంగాణ ప్రజాస్వామ్యానికి చుక్కాని " ధర్నా చౌక్ " పునరుద్ధరణ ప్రజాస్వామ్యానికి ఊపిరి పోయడమే.
- ఇందిరా శోభన్
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు