విజయం నాదే కమలా హారిస్ ధీమా..  ట్రంప్ ఎలాంటోడో తెలుసని కామెంట్

విజయం నాదే కమలా హారిస్ ధీమా..  ట్రంప్ ఎలాంటోడో తెలుసని కామెంట్

వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో వెనుకబడినప్పటికీ, విజయం మాత్రం తనదేనని అమెరికా వైస్ ప్రెసిడెంట్, డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల మద్దతుతో ఎన్నికల్లో విజయం సాధిస్తానని చెప్పారు. శనివారం మసాచుసెట్స్ లో నిర్వహించిన ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా  తనకు పార్టీ నేతల నుంచి తగినంత మద్దతు ఉందన్నారు.

‘‘మనం ఎలాంటి దేశంలో జీవించాలని అనుకుంటున్నాం? స్వేచ్ఛ, భద్రత ఉన్న దేశంలోనా? లేదంటే భయం, ద్వేషం ఉన్న దేశంలోనా?” అని ట్రంప్ ను ఉద్దేశించి ఓటర్లను ప్రశ్నించారు. తనతో డిబేట్ కు ట్రంప్ అంగీకరిస్తారని అనుకుంటున్నట్టు చెప్పారు.  ‘‘నేను గతంలో లాయర్ గా పని చేశాను.  మహిళలను వేధించినోళ్లను, మోసాలకు పాల్పడినోళ్లను, రూల్స్ ఉల్లంఘించినోళ్లను.. ఇలా ఎంతోమంది క్రిమినల్స్ ను చూశాను. వీరిలో ట్రంప్ ఏ రకానికి చెందినవారో నాకు తెలుసు. ఆయన నాపై చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధం” అని అన్నారు. 

వారంలో 20 కోట్ల డాలర్ల విరాళాలు.. 

కమలా హారిస్ విరాళాల సేకరణలో దూసుకెళ్తున్నారు. ఆమె వారం రోజుల్లోనే 20 కోట్ల డాలర్లు సేకరించారు. ‘‘గత వారం రోజుల్లో కమలా హారిస్ 20 కోట్ల డాలర్ల విరాళాలు సేకరించారు. దాతల్లో 66 శాతం మంది మొదటిసారి విరాళాలు ఇచ్చిన వారే ఉన్నారు. దీన్ని బట్టి ఆమెకు మద్దతు పెరుగుతున్నదని అర్థమవుతున్నది” అని కమల టీమ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మైఖేల్ టైలర్ తెలిపారు. ఆమెకు మద్దతు క్రమంగా పెరుగుతున్నదని, అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరిగే అవకాశం ఉందని చెప్పారు. 

 ట్రంపే గెలుస్తడు: ఆస్ట్రాలజర్ అమీ ట్రిప్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న తేదీని ముందుగానే అంచనా వేసిన జ్యోతిష్యురాలు అమీ ట్రిప్ తాజాగా మరో జోస్యం చెప్పారు. అగ్రరాజ్య అధినేతగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవుతారని  అంచనా వేశారు. ఇంటర్నెట్ లో ఫేమస్ జ్యోతిష్యురాలు అమీ ట్రిప్. ప్రెసిడెంట్ జో బైడెన్ తన ఎన్నికల ప్రచారానికి జులై 21న ముగింపు పలుకుతారని గతంలో ఆమె తెలిపారు.

వయసు కారణాల రీత్యా బైడెన్ వైదొలుగుతారని.. ప్రెసిడెంట్ పదవికి కమలా హారిస్ పోటీ పడతారని ఆమె ముందుగానే  పేర్కొన్నారు.  అమీ అంచనా వేసినట్టుగానే సరిగ్గా ఆ రోజునే ప్రచారానికి బైడెన్ బై బై చెప్పారు. తాజాగా ఆమె మరో ప్రకటన చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రొఫెషనల్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారని.. ఈ సారి ప్రెసిడెంట్ గా ఆయన ఎన్నికవుతారని అమీ జోస్యం చెప్పారు. సమీప భవిష్యత్తులో బైడెన్ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడా వెల్లడించారు. ఆయన ఆరోగ్యపరమైన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉందని వివరించారు.

బైడెన్ పై కుట్ర: డొనాల్డ్ ట్రంప్ 

అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని ప్రెసిడెంట్ జో బైడెన్ ను సొంత పార్టీ నేతలే బెదిరించారని రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. అధ్యక్ష రేసు నుంచి తప్పుకోకపోతే ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పిస్తామని బైడెన్ ను డెమోక్రటిక్ నేతలు బెదిరించారని, అందుకే ఆయన రేసు నుంచి తప్పుకున్నారని చెప్పారు.

శనివారం మిన్నెసోటాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ తో కలిసి ట్రంప్ మాట్లాడారు. కమలా హారిస్ గెలిస్తే దేశాన్ని నాశనం చేస్తారని విమర్శించారు. అటార్నీ జనరల్ గా శాన్ ఫ్రాన్సిస్కోను ఆమె నాశనం చేసిందన్నారు. ‘‘బైడెన్, కమల  హయాంలో నేరాలు పెరిగాయి. నేను గెలిస్తే లా అండ్ ఆర్డర్ పునరుద్ధరిస్తా. వారు తెచ్చిన చెత్త పాలసీలు రద్దు చేస్తా. దేశ బార్డర్లను మూసేస్తా. అమెరికాలోకి ఎవరూ చొరబడకుండా అడ్డుకుంటా” అని ట్రంప్ చెప్పారు. ఎన్నికల్లో కమలను ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు.