
- టారిఫ్ వాయిదా’ ప్రకటనకు ముందే ‘కొనుక్కోవాలని’ సోషల్ మీడియాలో పోస్ట్
- ఆ రోజే హిస్టారికల్ ర్యాలీ చేసిన యూఎస్ మార్కెట్లు
- ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’కు పాల్పపడ్డాడని ఆరోపిస్తున్న డెమొక్రాట్లు
న్యూఢిల్లీ: ‘‘తను 2.5 మిలియన్ డాలర్లు (రూ.21.50 కోట్లు) సంపాదించాడు ఈరోజు. అతనైతే 900 మిలియన్ డాలర్లు (రూ.7,740 కోట్లు) . మ్..పర్వాలేదు’’ అంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన సన్నిహితులతో నవ్వుతూ మాట్లాడుతున్న ఓ వీడియో వైరల్ అవుతోంది. చరిత్రలోనే అతిపెద్ద స్టాక్ మానిప్యులేషన్‌కు ట్రంప్ పాల్పడ్డారని, ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేశారని చాలా మంది ఆరోపిస్తున్నారు. ఆయన కంపెనీ ట్రంప్ మీడియా మార్కెట్ క్యాప్ అయితే 415 మిలియన్ డాలర్లు (రూ.3,570 కోట్లు) పెరిగింది. ‘90 రోజుల పాటు వాయిదా’ ప్రకటన చేసే 4 గంటల ముందు ‘కొనుక్కోవడానికి ఇదే మంచి సమయం’ అంటూ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ను ‘డీజీటీ’ పేరుతో ముగించారు. ఇది ఆయన పేరు ఇనీషియల్స్ కాగా, ఆయన కంపెనీ ట్రంప్ మీడియా టిక్కర్ సింబల్ కూడా కావడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు సాధారణ స్టాక్‌లను కొనమని చెప్పారా? లేదా ప్రత్యేకంగా ట్రంప్ మీడియా షేర్లనే కొనమని ప్రోత్సహించారా? అనే ప్రశ్నలకు వైట్ హౌస్ సమాధానం ఇవ్వలేదు.
టారిఫ్‌లను వాయిదా వేయాలనే నిర్ణయాన్ని ఎప్పుడు తీసుకున్నారనే విషయాన్నీ బయటపెట్టలేదు. "మార్కెట్లకు, అమెరికన్లకు భరోసా ఇవ్వడం అధ్యక్షుడి బాధ్యత" అని మాత్రం చెప్పుకొచ్చింది. "ఈరోజు ఉదయం అనుకుంటా. గత కొన్ని రోజులుగా నేను దీనిని గురించి ఆలోచిస్తున్నాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ నిర్ణయం తీసుకున్నాను” అని టారిఫ్ వాయిదాపై ట్రంప్ సమాధానమిచ్చారు. మరోవైపు "ఇన్‌సైడర్ ట్రేడింగ్ కుంభకోణం" జరిగిందని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. ట్రంప్ టారిఫ్ వాయిదాలను ప్రకటించిన తర్వాత యూఎస్ మార్కెట్లు హిస్టారికల్ ర్యాలీ చేసిన విషయం తెలిసిందే. నాస్‌డాక్ అయితే 15 శాతం వరకు పెరిగింది. డౌజోన్స్, ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్‌లు 5 శాతానికి పైగా ర్యాలీ చేశాయి. ట్రంప్‌కు 53 శాతం వాటా ఉన్న ట్రంప్ మీడియా షేర్లు బుధవారం 23 శాతం పెరిగాయి.