మళ్లీ ఉద్యమిస్తేనే ప్రజాస్వామిక తెలంగాణ

మళ్లీ ఉద్యమిస్తేనే ప్రజాస్వామిక తెలంగాణ

ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతోందని, మన రాష్ట్రం, మన పాలన వస్తే తెలంగాణ బిడ్డల బతుకులు బాగుపడుతాయని కొట్లాడి, ప్రాణ త్యాగాలు చేసి స్వరాష్ట్రం సాధించుకున్నాం. కానీ ఏడేండ్ల టీఆర్‌‌ఎస్ పాలనలో యువత, రైతులు, టీచర్లు, కార్మికులు సహా అన్ని వర్గాలకూ ఏ మంచి జరగలేదు. వంద రోజుల్లోనే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ప్రభుత్వ అధీనంలోకి తీసుకుని తెరిపిస్తామని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చి, పదవిలోకి వచ్చాక సీఎం కేసీఆర్ ఆ మాట మర్చిపోయారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనుకున్న యువత, మన నీళ్లు మనకు వస్తాయనుకున్న రైతులు కూడా దగాపడ్డారు. పైగా గడిచిన ఏడేండ్లలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ రోడ్లపైకి వచ్చి ఎవరైనా కొట్లాడినా, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినా నిర్భంధాలు, దాడులు చేస్తోంది అధికార పార్టీ.

ఉమ్మిడి రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమలను తెరిపించి తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ గెలిచాక ఆ హామీని గాలికొదిలేసింది. వంద రోజుల్లో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ప్రభుత్వం అధీనంలోకి తీసుకుని తెరిపిస్తామని 2014 ఎన్నికల్లో కేసీఆర్ ప్రకటించారు. ఈ ఫ్యాక్టరీ మళ్లీ రన్నింగ్‌‌లోకి వస్తే వేలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతుందని రాష్ట్ర ప్రజలంతా సంతోషించారు. కానీ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నప్పటికీ ఆ ఫ్యాక్టరీని ప్రభుత్వం రీస్టార్ట్ చేయలేదు. అంతే కాదు, ఏటూర్ నాగారంలోని రేయాన్స్, వరంగల్ లోని ఆజంజాహీ మిల్లు, కాగజ్ నగర్ లోని సర్ సిల్క్, పేపర్ మిల్స్, అంతర్గాం స్పిన్నింగ్ మిల్స్ సహా హైదరాబాద్ సిటీలో మూతపడిన అనేక పరిశ్రమల్లో ఏ ఒక్క దాన్నీ టీఆర్ఎస్ సర్కారు తెరిపించలేదు. పైగా రన్నింగ్‌‌లో ఉన్న చాలా ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఫలితంగా వేలాది కార్మికులకు ఉపాధి పోయింది. కొత్తగా వస్తాయనుకున్న ఉద్యోగాలూ రాలేదు. కార్మిక చట్టాలు సక్రమంగా అమలు చేయకుండా బడా పెట్టుబడిదారులకు సర్కారు అండగా నిలిచి కార్మికుల జీవితాలను రోడ్డుపడేస్తోంది. 
ఉపాధి, ఉద్యోగాలు వస్తయ్
తెలంగాణ ఉద్యమ లక్ష్యాల్లో చాలా కీలకమైనది నిరుద్యోగ సమస్య తీర్చడం. కానీ తెలంగాణ వచ్చాక తెరిపిస్తామని చెప్పిన టీఆర్ఎస్ ఆ పని చేయకపోవడంతో నిరుద్యోగం అలానే ఉండిపోయింది. పైగా ప్రభుత్వంలో ఖాళీ అయిన లక్షలాది పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఈ సమస్య మరింత పెరిగింది. మూతపడిన కంపెనీలు, పరిశ్రమలు తెరిపిస్తే వేల మందికి ఉద్యోగాలు దొరకడంతో పాటు వాటిపై ఆధారపడి పరోక్షంగా ఉపాధి పొందేవాళ్లూ భారీగా ఉంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సర్కారు మూతపడిన ఫ్యాక్టరీలను తెరిపించే ఆలోచన చేయాలి.
ప్రశ్నిస్తే దాడులా?
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో లాయర్ల పాత్ర ముఖ్యమైనది. అది ఎవరు చెరిపినా.. చెరగని చరిత్ర. కానీ ఆ లాయర్లే నేడు సర్కార్​ తీరుపై పోరాడుతున్నందుకు తప్పుడు కేసులు, నిర్బంధాలు, చివరికి హత్యలకు గురవుతున్న పరిస్థితి దాపురించింది. టీఆర్ఎస్ సర్కారులో ఎవరి అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించినా సరే దాడులు తప్పడం లేదు. ఇందులో భాగమే పెద్దపల్లి జిల్లా కల్వచెర్ల దగ్గర ఫిబ్రవరి 17న జరిగిన వామన్ రావు, నాగమణి దంపతుల హత్యలు. ఇందులో గ్రామ, మండల, నియోజక వర్గస్థాయి నేతలు పాత్రధారులుగా, అగ్రనాయకత్వం సూత్రధారులుగా ఉన్నారన్నది చాలు ఆ పార్టీ ఎంతటి అరాచక పాలన సాగిస్తున్నదో తెలుసుకోవడానికి. 
భూములు ఇవ్వకపోగా లాక్కుంటున్నరు
రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని టీఆర్ఎస్ సర్కారు ఏడేండ్లలో పూర్తిగా ప్రైవేటుపరం చేసింది. రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారికి, సంపన్నులకు సహజ వనరులైన భూమి, నీరు, ఇతర వనరులు ధారపోసింది. భూములు ఆక్రమించుకున్న వారిని శిక్షించి వాటిని ప్రజల పరం చేసే బదులు జీవో.59/2015 తెచ్చి వాటిని కబ్జాకోరులకు నామమాత్రపు ధరతో కట్టబెట్టినది. దీంతో ప్రభుత్వ పెద్దలకు భారీగా సొమ్ములు అందాయని ఆరోపణలు ఉన్నాయి. ఇంకో వైపు దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీ గాల్లో కలిసింది. పైగా గత ప్రభుత్వాలు దళితులకు, పేదలకిచ్చిన భూములను ప్రభుత్వం పరిశ్రమలు, ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల పేరుతో గుంజుకుంటోంది. ఇంక ఆదివాసీలు తెలంగాణ రాష్ట్రం ఎందుకొచ్చిందా? అని బాధపడుతున్నారు. పోడు చేసుకుంటున్న భూములు హరిత హారం పేరుతో గుంజుకుంలోంది. రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ ప్రాంతమైన ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని అత్యధిక ప్రాంతంలో ఆదివాసీలు తరాలుగా పోడు చేసుకుని బతుకుతున్నరు. రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ స్ఫూర్తి, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఆ ప్రజలకు, ఆ భూముల మీద సర్వ హక్కులు ఉన్నాయి. అయితే అడవిని పెంచాలంటూ వారిని ఆ భూముల్లోంచి ఎల్లగొట్టడం, నిత్యం వారిమీదికి అటవీ, పోలీసు సిబ్బందిని పంపి సర్కారు దాడులు చేయిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు అధికారంలోకి వచ్చిన నెలరోజులకే పోడు భూములకు పట్టా ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి మూడేండ్లయినా పట్టాలు ఇవ్వలేదు. 
మళ్లీ ఉద్యమిస్తేనే ప్రజాస్వామిక తెలంగాణ
బంగారు తెలంగాణ పేరు చేప్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కేవలం 70 వేల కోట్ల అప్పుంటే, ఈ ఏడేండ్లలో కాళేశ్వరం రీడిజైన్​, ప్రజా సంక్షేమం, విద్యుత్, పాతవి కూలగొట్టి కొత్తవి కట్టే  పేరుమీద దాదాపు మూడున్నర లక్షల కోట్లు అప్పులు చేశారు. అప్పులు చేసిన సొమ్ముతో ప్రజలకు ఏ మాత్రం మేలు చేయకపోగా, టీఆర్‌‌ఎస్ పార్టీ నేతలు కమీషన్లు దండుకుంటూ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. ఈ అవినీతిని ప్రశ్నిస్తున్న ప్రతి వ్యక్తి, శక్తి, పార్టీ, మీడియా, ప్రజాసంఘాల నాయకులు, లాయర్లను అణచివేస్తున్నారు. నయానో, భయానో టీఆర్ఎస్‌‌లో చేర్చుకొని ప్రతిపక్షాలను బలహీనంగా మార్చి, అక్రమ కేసులతో మీడియాను గుప్పిట్లో పెట్టుకుని విచ్చలవిడిగా దోపిడీ చేస్తోంది. పార్టీ అధినాయకత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని మండల, గ్రామ స్థాయి నాయకులు కూడా దోపిడీకి పాల్పడుతూ తెలంగాణ ప్రజలకు ఆశలు, ఉద్యమ ఆకాంక్షలను నాశనం చేస్తున్నారు. ఈ దుర్మార్గపు పాలనకు కారణమైన టీఆర్ఎస్ పార్టీని గద్దె దించి, కూకటివేళ్లతో పెకిలించకుంటే తెలంగాణ ప్రజలకు మంచి రోజులు రావు. అన్ని వర్గాలు కలిసి మళ్లీ ప్రజాస్వామిక ఉద్యమాలు చేస్తేనే ప్రజాస్వామిక తెలంగాణ సాధనకు బాటలుపడతాయి. 

ప్రజల పక్షాన పోరాడే నాయకులు ఉండొద్దని..
కొత్త రాష్ట్రంలో టీఆర్ఎస్ గద్దెనెక్కిన నాటి నుంచే సభలు, సమావేశాలు, ధర్నాలపై అప్రకటిత నిషేధం విధించింది.  ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను పార్టీలో చేర్చుకుంది. చేరని వారిని ఇప్పటికీ వేధిస్తోంది. తన దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే ప్రజలకు నాయకత్వం లేకుండా చేసే కుట్ర ఇది. పోరాడుతున్న వారిని తప్పుడు కేసులలో ఇరికించడం, నిర్బంధాలకు గురిచేయడం జరిగినది. పొడు భుములు, హక్కుల కోసం పోరుడుతున్న ఆదివాసీలు, మైనారిటీలు, లాయర్ల మీద లాకప్ డెత్‌‌లు, బూటకపు ఎన్​కౌంటర్లు, మర్డర్ల రూపంలో దమనకాండ సాగిస్తున్నది.

బతుకులు మారలే..
రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లయినా సగటు తెలంగాణ బిడ్డ బతుకులు ఏం బాగుపడలేదు. నిరుద్యోగం ఎక్కువైంది. రెండు, మూడు సంక్షేమ పథకాలు, అరకొర అభివృద్ధి తప్ప పెద్దగా ప్రజలకు జరిగింది ఏమీలేకపోగా, రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.69 వేల కోట్లు ఉన్న అప్పులు ఇప్పుడు మూడున్నర లక్షల కోట్లకు పైగా అయినయ్. ఇందులో 40% పైగా డబ్బు అధికార పార్టీ నేతలు అవినీతి, అక్రమాలకు పాల్పడి తమ జేబులు నింపుకొన్నారనే ఆరోపణలు ఉన్నాయి. -చిక్కుడు ప్రభాకర్, కన్వీనర్, తెలంగాణ డెమాక్రటిక్ ఫ్రంట్.