బీఆర్ఎస్ ఆఫీసు కూల్చేయండి .. ప్రభుత్వ స్థలంలో పర్మిషన్ లేకుండా కట్టిండ్రు : మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ:  ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ న‌ల్గొండ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ.. పేదలకు ఇండ్లు కట్టుకుంటే అధికారులు ఊరుకోరని, బీఆర్ఎస్ ఆఫీసు విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. దాదాపు రెండు కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసి పార్టీ ఆఫీసు నిర్మించారని అన్నారు. ఇప్పటికే రెండు నోటీసులు ఇచ్చినట్టు మున్సిపల్ కమిషనర్ తెలుపగా..  దానిని వెంటనే కూల్చివేయాలని అన్నారు. మంత్రిగా తాను ఆదేశాలు జారీ చేస్తున్నానని చెప్పారు.  

పంద్రాగస్టులోపు రుణమాఫీ

ఆగస్టు 15లోపు 32 వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తున్నామని మంత్రి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.   రైతులకు రెండు లక్షల రుణమాఫీని ఏకకాలంలో  చేస్తున్నామన్నారు.  ఏడు లక్షల కోట్ల అప్పు ఉండి కూడా సీఎం రేవంత్ రెడ్డి  రైతులకు రుణమాఫీ చేయడానికి ముందుకు వెళ్తున్నారని చెప్పారు. పైసా పైస పోగు చూసి రైతులకు సహాయం చేస్తున్నామన్నారు.  యావత్ తెలంగాణ రైతులకు అండగా ఉంటామని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు చేసిన రైతు రుణమాఫీ వల్ల రైతులకు ప్రయోజనం కలగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని, అందుకు రైతు రుణమాఫీ ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు.  నాగార్జునసాగర్, ఏఎంఆర్పీ ప్రాజెక్టు ల కింద లక్షల మంది రైతులు బత్తాయి రైతులు ఉన్న జిల్లాగా  నల్గొండ జిల్లాకు పేరున్నదన్నారు.