- అంగీకారం తెలిపిన 198 కుటుంబాలు
- 47 కుటుంబాలు ఒప్పుకోలే.. 19 ఫ్యామిలీస్ తటస్థం
యాదాద్రి, వెలుగు : సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ఇండ్ల కూల్చివేతకు మెజార్టీ కుటుంబాలు ఓకే చెప్పాయి. కొన్ని కుటుంబాలు మాత్రం వ్యతిరేకించగా మరికొన్ని కటుంబాలు ఎటూ తేల్చుకోలేదు. అయితే కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ కుటుంబాలను కూడా ఒప్పించేందుకు ఆఫీసర్లు ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో సీఎం కేసీఆర్ ప్రకటించిన బంగారు వాసాలమర్రికి కొంతమేర లైన్ క్లియర్అయ్యింది.
మూడేండ్ల తర్వాత..
మూడేండ్ల తర్వాత పట్టాలెక్కిన వాసాలమర్రి పునర్నిర్మాణం వేగంగా ముందుకు కదులుతోంది. ఇటీవలే యాదాద్రి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వినయ్ కృష్ణారెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. 481 ఇండ్ల నిర్మాణం కోసం రూపొందించిన లే అవుట్ ప్రకారం చర్యలు చేపట్టారు. రెండు రోజులుగా జరుగుతున్న అభిప్రాయ సేకరణ బుధవారం ముగిసింది. వీటిలో 103 పక్కా ఇండ్లు పోగా మిగిలిన 327 పెంకుటిండ్లను కూల్చి కొత్తవి నిర్మించేందుకు అభిప్రాయాలు అడగగా..
198 కుటుంబాలు ఒప్పుకున్నాయి. దీంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం జరిగే వరకూ పునరావాసంలో భాగంగా ప్రభుత్వం నిర్మించే తాత్కాలిక నివాసాల్లో ఉండేందుకు అంగీకరించాయి. 52 కుటుంబాలు తాము వేరే చోట నివాసముంటామని తెలిపాయి. 19 కుటుంబాలు ఏ నిర్ణయం తీసుకోలేదు. మరో 11 మంది అందుబాటులో లేరు. అయితే 47 కుటుంబాల యజమానులు మాత్రం తాము ఇక్కడే ఉంటామని, కొత్తగా నిర్మించే ఇండ్లు అవసరం లేదని తిరస్కరించాయి.
వారిని ఒప్పించండి : కలెక్టర్
తిరస్కరించిన కుటుంబాలను సాధ్యమైనంత త్వరగా ఒప్పించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. వాసాలమర్రిలో బుధవారం ఆయన రివ్యూ నిర్వహించి లేఅవుట్ను పరిశీలించారు. కుటుంబాలను ఒప్పించిన వెంటనే ఇప్పటికే గుర్తించిన 11 ఎకరాల్లో తాత్కాలిక నివాసాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఇండ్ల కూల్చివేతతో పాటు లేఅవుట్ అభివృద్ధి, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం వేర్వేరుగా టెండర్లు పిలవాలని సూచించారు.
వచ్చే నెలలో పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ఈడీ జినుకల శ్యాంసుందర్, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్ కుమార్, ఆఫీసర్లు శంకరయ్య, కరుణాకరన్, మల్లికార్జున్, యాదగిరి, దేశా నాయక్, ఉమాదేవి, వెంకటేశ్వర్లు ఉన్నారు.