- బ్లాస్టింగ్స్ చేస్తే బ్యారేజీకే ముప్పు
- డైమండ్ కటింగ్ చేయాలని ఇంజనీర్ల నిర్ణయం
- ముంబై నుంచి మెషీన్లు తెప్పించేందుకు ఏర్పాట్లు
- పునాదిపై ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్టు ఇవ్వాలన్న ఎన్డీఎస్ఏ
- రాడార్ సర్వే చేపట్టిన ప్రైవేట్ ఏజెన్సీ
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లర్లను కూల్చడం ఆఫీసర్లకు సవాల్‌గా మారింది. నిర్మించడం కంటే కూల్చడమే పెద్ద రిస్క్ అని ఇరిగేషన్ ఇంజనీర్లు అంటున్నారు. పక్కన ఉన్న పిల్లర్లు, బ్యారేజీ ఫౌండేషన్ దెబ్బతినకుండా పనులు చేపట్టాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇందుకోసం డైమండ్ కటింగ్ చేయాలని పేర్కొంటున్నారు. కుంగిన మూడు పిల్లర్లను జాగ్రత్తగా కూల్చేందుకు దాదాపు 2 నుంచి 3 నెలలు పట్టే అవకాశం ఉందంటున్నారు. పిల్లర్ల కూల్చివేత కోసం ముంబై నుంచి డైమండ్ కటింగ్ మెషీన్లు తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు బ్యారేజీ పునాదిపై ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ) ఆదేశించింది. ఈ మేరకు ఓ ప్రైవేట్ఏజెన్సీతో ఎల్‌అండ్‌టీ సంస్థ రాడార్సర్వే చేయిస్తున్నది.
బ్లాక్ 7లోని అన్ని పిల్లర్లు కూల్చాల్సిందే..
మేడిగడ్డ బ్యారేజీని 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 1,632 మీటర్ల పొడవుతో నిర్మించారు. ఎనిమిది బ్లాక్‌లలో 85 గేట్లను అమర్చారు. రూ.3,625 కోట్లు ఖర్చు చేశారు. ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మించిన ఈ బ్యారేజీ.. ప్రారంభించిన నాలుగున్నరేండ్లకే కుంగింది. నిరుడు అక్టోబర్ 21న బ్లాక్ 7లోని మూడు పిల్లర్లు కుంగిపోయాయి. 20వ పిల్లర్ 5 ఫీట్ల కంటే లోతుకు కుంగిపోయి, పెద్దపెద్ద క్రాక్‌లు వచ్చాయి. 19, 21వ పిల్లర్లు కూడా దెబ్బతిన్నాయి. రెండు గేట్లు ఖరాబయ్యాయి. అక్టోబర్ 23, 24 తేదీల్లో ఎన్డీఎస్‌ఏ ఆఫీసర్లు బ్యారేజీని పరిశీలించి రిపోర్ట్ ఇచ్చారు. దెబ్బతిన్న పిల్లర్లను కూల్చివేసి అడుగున ఉన్న పునాదిలో ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేయాలని ఆదేశించారు. బ్యారేజీలోని 7వ బ్లాక్ మొత్తం 220 మీటర్ల పొడవు ఉంది. ఈ బ్లాక్‌లో 11 పిల్లర్లు ఉన్నాయి. ముందుగా మూడు పిల్లర్లు కూల్చివేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆ తర్వాత బ్లాక్‌లోని అన్ని పిల్లర్లను కూల్చి రిపేర్లు చేయాల్సి ఉంటుంది. వచ్చే వర్షాకాలంలోగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి, ఆ రిపోర్ట్ ప్రకారం పనులు పూర్తి చేయాలి. లేకపోతే మరిన్ని పిల్లర్లకు కూడా ప్రమాదం పొంచి ఉంటుందని ఎన్‌డీఎస్‌ఏ హెచ్చరించింది.
ముందుగా మూడు పిల్లర్లు కూల్చివేత..
ఎన్‌డీఎస్‌ఏ ఆదేశాల ప్రకారం.. ఏడో బ్లాక్‌ను కూల్చి, మళ్లీ నిర్మించాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది. ముందుగా కుంగిన మూడు పిల్లర్లను కూల్చివేయాలని ఇంజినీర్లు భావిస్తున్నారు. పిల్లర్లు తొలగించడానికి చిన్న చిన్న బ్లాస్టింగ్స్ చేసే అవకాశం కూడా లేదని చెబుతున్నారు. చిన్నపాటి బ్లాస్టింగ్స్ చేసినా పక్కన ఉన్న పిల్లర్లు, ఫౌండేషన్ దెబ్బతినే ప్రమాదం ఉందని అంటున్నారు. అందుకే డైమండ్ కటింగ్ ద్వారా పిల్లర్లను కూల్చివేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ముంబై నుంచి డైమండ్ కటింగ్ మెషిన్లు, ఈ పనిలో అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్‌ను తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే కూల్చివేతలు పూర్తి చేయడానికి కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఇంజనీర్లు చెబుతున్నారు.
పది రోజుల్లో సర్వే రిపోర్టు..
ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ ఫౌండేషన్ పై ఓ ప్రైవేట్ ఏజెన్సీతో ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నారు. దీనికోసం రాడార్ సర్వే చేపట్టారు. ఈ సర్వే కోసం ప్రైవేట్ ఏజెన్సీతో ఎల్‌అండ్ టీ సంస్థ అగ్రిమెంట్ చేసుకుంది. కుంగిన పిల్లర్లు, ఫౌండేషన్ స్లాబ్ కూల్చివేయకముందే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పనులను మొదట వేరే ఏజెన్సీకి అప్పగించారు. అయితే ఆ సంస్థకు ఇలా బ్యారేజీల దగ్గర ఇన్వెస్టిగేషన్ చేసిన అనుభవం లేదని తెలుసుకుని, దాన్ని మార్చారు. సెంట్రల్ వాటర్ కమిషన్‌లో పనిచేసే ఓ ఉన్నతాధికారి ఇచ్చిన సూచన మేరకు ప్రస్తుతం సర్వే చేస్తున్న సంస్థకు బాధ్యతలు అప్పగించారు. అన్నారం బ్యారేజీ దగ్గర బుంగలు పడడానికి కారణాలు తెలుసుకునే పనులను కూడా ఈ ఏజెన్సీకే ఇచ్చారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ దగ్గర రాడార్ మెషిన్లు, కంప్యూటర్ల సహాయంతో ఏజెన్సీ సిబ్బంది సర్వే మొదలుపెట్టారు. 7వ బ్లాక్‌లోని 11 పిల్లర్ల చుట్టూరా 220 మీటర్ల పొడవునా మొదట ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పిల్లర్ల మధ్యన ఉన్న ఖాళీ ప్లేస్‌లో గేట్ల కింది భాగాన ప్రతి రెండు ఫీట్లకు ఒక మార్కింగ్ ఇచ్చి మిషన్ల సహాయంతో రీసెర్చ్ చేస్తున్నారు. ఏజెన్సీకి చెందిన 15 నుంచి 20 మంది నిపుణులు ఇక్కడ పని చేస్తున్నారు. వీరికి కాంట్రాక్ట్ సంస్థ ఇంజనీర్లు సహకరిస్తున్నారు. మరో వారం పది రోజుల్లో ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
సర్వే రిపోర్టే కీలకం..
మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లకు సంబంధించి.. ప్రస్తుతం సర్వే చేస్తున్న ప్రైవేట్ ఏజెన్సీ ఇచ్చే రిపోర్టే కీలకంగా మారనుంది. మూడు పిల్లర్లు కుంగడానికి కారణాలేమిటో ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ కోసమని ముందుగా బ్యారేజీలోని నీళ్లన్నీ ఖాళీ చేశారు. బ్లాక్ 7 చుట్టూరా గోదావరి నది ఇన్‌ఫ్లో వాటర్ రాకుండా రింగ్‌బండ్ వేశారు. పిల్లర్ల మధ్య ఉండే నీటిని 60 హెచ్‌పీ మోటార్ల సహాయంతో ఎత్తిపోశారు. పిల్లర్ల మధ్య ఉన్న ఇసుకను మెషిన్లు, కూలీల సాయంతో తొలగించారు. దీంతో బ్యారేజీ దిగువన అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ దగ్గర ఏర్పడిన పగుళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాఫ్ట్ నుంచి ఐదారు ఫీట్ల లోతుకు పిల్లర్లు కుంగడం కూడా స్పష్టంగా తెలుస్తోంది. పిల్లర్ల మధ్యన వచ్చిన క్రాక్స్ కూడా వెడల్పు అయ్యాయి. ఫ్లోటింగ్ స్ట్రక్చర్ మాదిరిగా ఈ బ్యారేజీని నిర్మించారు. అయితే రాఫ్ట్ కింద సీకెంట్ ఫైల్ నిర్మించినట్టు ఇరిగేషన్ ఇంజనీర్లు చెబుతున్నారు. ఈ సీకెంట్ ఫైల్ ఎంత లోతున వేశారు? రాఫ్ట్, సీకెంట్ ఫైల్స్ మధ్యన ఏమైనా ఖాళీలు ఏర్పడి పిల్లర్లు భూమిలోకి కుంగాయా? లేక సీకెంట్ ఫైల్ కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయి సొరిక పడిందా? అనే విషయం సర్వే రిపోర్ట్‌లో తెలుస్తుందని అంటున్నారు. సీకెంట్ ఫైల్ దాటుకుని కింది నుంచి నీళ్లు వస్తే మాత్రం బ్యారేజీకి చాలా ప్రమాదమని పేర్కొంటున్నారు.