ఓ ప్రార్థనా మందిరం కూల్చివేత.. చిలుకూరులో హైటెన్షన్

ఓ ప్రార్థనా మందిరం కూల్చివేత.. చిలుకూరులో హైటెన్షన్

చేవెళ్ల, వెలుగు :  ఓ ప్రార్థనా మందిరం కూల్చివేతతో  రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు ఏరియాలో హైటెన్షన్ నెలకొంది. సోమవారం సాయంత్రం ఓ ఎన్ఆర్ఐ తన భూమిని చదును చేయిస్తుండగా.. వందల ఏండ్లనాటి ఓ ప్రార్థనా మందిరం కూల్చివేశారని.. సమాచారం తెలియడంతో భారీగా ముస్లింలు అదేరోజు రాత్రి  ఘటనా స్థలానికి వెళ్లారు.  వక్ఫ్​బోర్డు అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశా రు. ఘటనపై తెలియడంతో ఎమ్మెల్సీ రహమత్ ​బేగ్, రాష్ట్ర ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఫహీం ఖురేషీతో పాటు వందలాది మంది ముస్లింలు అక్కడికి చేరుకుని ప్రార్థనలు చేశారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ వెళ్లి ముస్లిం పెద్దలతో చర్చించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా భారీగా పోలీసులను మోహరించారు. 

రాత్రంతా ముస్లింలు ఘటనా స్థలంలోనే ఉండగా..  స్థానిక తహసీల్దార్ గౌతంకుమార్ వెళ్లి  పరిస్థితిని సమీక్షించారు. మంగళవారం ఉదయం  వక్ఫ్ బోర్డు అధికారులు, పోలీసుల ఆధ్వర్యంలో ప్రార్థనా మందిరానికి సంబంధించిన భూమిని రెవెన్యూ అధికారులు సర్వే చేసి 4 గుంటల భూమి వక్ఫ్​బోర్డుదిగా  తేల్చారు. వెంటనే ఆ భూమి చుట్టూ హద్దులు ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడ బోరు వేసి ఒక షెడ్ కూడా నిర్మించారు. 

దీంతో చిలుకూరు గ్రామస్తులతో పాటు పలు ప్రాంతాలకు చెందిన బీజేపీ, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, హిందూ సంఘాలు భారీగా తరలివచ్చి మంగళవారం రాత్రి వరకు చిలుకూరు బాలాజీ ఆల యం వద్ద ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. అక్కడ ఎలాంటి నిర్మాణం చేయొద్దని.. అది మసీదు కాదని,  గుర్రాలశాల మాత్రమేనని నినాదాలు చేశారు.  ఎట్టి పరిస్థితుల్లో మసీదు నిర్మించొద్దని డిమాండ్​ చేశారు. మసీదు నిర్మించాలంటే పగలు నిర్మించాలి, కానీ రాత్రిపూట పని ఏంటని ప్రశ్నించారు.  మొయినాబాద్​ సీఐ పవర్​కుమార్​రెడ్డి ఆందోళన చేస్తున్న వారితో చర్చించారు. 

ఘటనకు సంబంధించి పోలీసులు ఒక జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. పురాతన నిర్మాణం కూల్చివేతపై దర్యాప్తు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ స్పష్టంచేశారు.  వక్ఫ్​ బోర్డు భూములను కబ్జా చేస్తే చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని తహసీల్దార్ హెచ్చరించారు.  స్థానిక కాంగ్రెస్ నేతలు పామేన భీం భరత్, షాబాద్ దర్శన్, కేబుల్ రాజు, మర్రి రవీంద ర్  రెడ్డి , ఎండీ మక్బుల్  తదితరులు ఉన్నారు.