ఇందిరమ్మ ఇండ్ల వద్ద ఆక్రమణల కూల్చివేత

ఇందిరమ్మ ఇండ్ల వద్ద ఆక్రమణల కూల్చివేత

జీడిమెట్ల, వెలుగు: నిజాంపేట మున్సిపల్ ​కార్పొరేషన్​ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లను ఆనుకుని అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు మంగళవారం కూల్చివేశారు. ఫేజ్​-2 నుంచి బాలాజీ హిల్స్​, కేటీఆర్​ కాలనీకి వెళ్లే మార్గంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తమ ఇండ్ల ముందు ఉన్న స్థలాన్ని ఆక్రమించుకుని రేకులతో గదులు నిర్మించుకున్నారు. దీంతో తమకు రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని బాలాజీ హిల్స్, కేటీఆర్ ​వాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో మంగళవారం ఉదయం హైడ్రా అధికారులు, కార్పొరేషన్​ సిబ్బంది పోలీసులు బందోబస్తు  మధ్య ఆక్రమణలను జేసీబీలతో కూల్చివేశారు. ఈ సందర్భంగా స్థానికులు, సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. అప్పు చేసి చిన్న గదులు తమ ఇండ్ల ముందు నిర్మించుకుంటే ఎవరికి అడ్డువస్తున్నాయంటూ ప్రశ్నించారు. కూల్చివేసిన సామగ్రిని రోడ్డుకు అడ్డంగా పెట్టి ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించి వేయడంతో గొడవ సద్దుమణిగింది. 
 
శంషాబాద్లోనూ కూల్చివేతలు
శంషాబాద్ పరిధి గొల్లపల్లిలో విమానాశ్రయాన్ని ఆనుకొని ఉన్న గోడను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. మొత్తం 18.23 ఎకరాలు ఉండగా, 1987లో అప్పటి ప్రభుత్వం గొల్లపల్లికి చెందిన కార్మికులకు జీవనాపాధి కోసం 17 గుంటల చొప్పున 42 మందికి పంపిణీ చేసింది. 

అప్పటినుంచి ఆ భూముల్లో వాళ్లు ఉంటున్నారు. వీటికి సమీపంలోనే శంషాబాద్ విమానాశ్రయం రావడంతో కార్మికులను కొందరు బెదిరించి, ఆ భూములను కబ్జా చేశారు.  విషయం తెలుసుకున్న అధికారులు  గోడను కూల్చేశారు.  ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.