గండిపేట నెక్నాంపూర్లో ఆక్రమణల కూల్చివేత

గండిపేట నెక్నాంపూర్లో ఆక్రమణల కూల్చివేత

హైదరాబాద్ సిటీ/మెహిదీపట్నం/గండిపేట, వెలుగు: గండిపేట మండ‌‌లం నెక్నాంపూర్​లో హైటెన్షన్ వైర్ల నిర్మించిన గోడను మంగ‌‌ళ‌‌వారం హైడ్రా తొల‌‌గించింది. దీంతో శ్రీవేంక‌‌టేశ్వర కాల‌‌నీకి, ఉస్మానియా కాల‌‌నీకి మధ్య రాకపోకలకు వీలు కలిగింది. ఈ రెండు కాల‌‌నీల‌‌కు మ‌‌ధ్య గుట్టలా ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించేందుకు ఇటీవల కొందరు షెడ్లు వేశారు. కాలనీ వాసుల ఫిర్యాదుతో హైడ్రా స్పందించింది. 

గత శ‌‌నివారం హైడ్రా క‌‌మిష‌‌న‌‌ర్ ఏవీ రంగ‌‌నాథ్‌‌ క్షేత్రస్థాయిలో ప‌‌ర్యటించి వెంట‌‌నే అడ్డుగా ఉన్న గోడను, షెడ్లను తొలగించాలని ఆదేశించారు. మంగళవారం హైడ్రా అధికారులు తొలగించారు. అలాగే మెహిదీపట్నం ప్రిన్స్ హోటల్స్ సమీపంలో ఫుట్​పాత్ ఆక్రమణలను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి తొలగించారు. 

బండ్లగూడ జాగీరు మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌ పరిధిలోని సెయింట్‌‌ మైఖెల్‌‌ కాలనీలో పార్కు స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని టౌన్‌‌ ప్లానింగ్‌‌ అధికారులు కూల్చివేశారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్‌‌ కేసులు నమోదు చేస్తామని కమిషనర్‌‌ బి.శరత్‌‌చంద్ర హెచ్చరించారు.