హైదరాబాద్ : ముషీరాబాద్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాంధీనగర్ డివిజన్‌లోని స్వామి వివేకానంద నగర్‌లో కొందరు దళితులు దాదాపు 70 ఏళ్లుగా చిన్నపాటి ఇళ్లను నిర్మించుకొని అక్కడే ఉంటున్నారు. 2024 జనవరి 29వ తేదీ సోమవారం రోజున రెవెన్యూ, మున్సిపల్ అధికారులు అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేయించారు. స్థానికులు ఆందోళనలు నిర్వహించే అవకాశం ఉన్నందున ముందస్తు భద్రతా చర్యలు చేపట్టి కూల్చివేతలను ప్రారంభించారు. బస్తీలోని స్థానికులను ఎవరిని కూడా అనుమతించడం లేదు.
మొత్తం 23 దళిత కుటుంబాలు గత 70సంవత్సరాలుగా ఇక్కడే నివాసము ఉంటున్నామని వచ్చే నెల అంటే ఫిబ్రవరి 6వ తేదీన హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నప్పటికి అధికారులు కూల్చివేస్తున్నారని బస్తీ వాసులు ఆందోళన చేపట్టారు. ఇళ్లలో సామాన్లు ఉన్నాయని చెబుతున్నా వినడం లేదని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ కొందరు బాధితులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.