వరంగల్​లో అక్రమ కట్టడాల కూల్చివేత

  • మొన్న హనుమకొండలో.. నిన్న వరంగల్‍ చౌరస్తాలో
  • ఫుట్‍పాత్‍, రోడ్ల ఆక్రమణలపై ఆఫీసర్ల స్పెషల్‍ డ్రైవ్‍
  • బడా షాపింగ్‍ మాల్స్, బిల్డింగులు వేటినీ వదలట్లే 
  • నిమిషాల్లో నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న బుల్డోజర్లు
  • గతంలో రాజకీయ జోక్యంతో ముందుకు కదలని ఆఫీసర్లు
  • ప్రస్తుతం రూల్‍ ప్రకారం వెళ్తున్న జీడబ్ల్యూఎంసీ సిబ్బంది

వరంగల్‍/కాశిబుగ్గ, వెలుగు: గ్రేటర్‍ వరంగల్‍ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా జీడబ్ల్యూఎంసీ అధికారులు అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు, ఫుట్​పాత్​లను ఆక్రమించిన చిన్న దుకాణాలు మొదలు బడా షాపింగ్​కాంప్లెక్స్​ల వరకు వేటినీ వదలకుండా నేలమట్టం చేస్తున్నారు.

గ్రేటర్​వరంగల్​ మున్సిపల్ ​కార్పొరేషన్​ అధికారులు ఈ నెల10న హనుమకొండలో కాళోజీ జంక్షన్‍ నుంచి అంబేడ్కర్‍ జంక్షన్‍ వరకు ఉన్న ఆక్రమణలను కూల్చివేశారు. పలు బడా షాపింగ్‍ మాల్స్, షోరూం కంపెనీల ముందు ఫుట్‍పాత్‍లపై ఇష్టారీతిన ఉన్న నిర్మాణాలను బుల్డోజర్లతో తుక్కుతుక్కు చేశారు. మంగళవారం ఉదయం వరంగల్‍ చౌరస్తాలోని ప్రముఖ వ్యాపారికి చెందిన వర్ణం షాపింగ్‍ మాల్​ఆక్రమణలపై మరోమారు జేసీబీలకు పనిచెప్పారు. నిమిషాల వ్యవధిలో బోర్డులు, సిల్ట్​పోర్షన్‍ పార్కింగ్‍ గోడలు, హోర్డింగ్స్​ను  నేలమట్టం చేశారు. నిర్మాణ సమయంలో ఆక్యుపెన్సీ ప్రకారం అనుమతి తీసుకోని క్రమంలో కరెంట్‍ సరఫరా సైతం తొలగించాలని ఎన్‍పీడీసీఎల్‍ అధికారులకు లెటర్‍ రాశారు. అనంతరం చౌరస్తా నుంచి పోచమ్మమైదాన్‍ వరకు ఆక్రమణల తొలగింపు స్పెషల్‍ డ్రైవ్‍ చేపట్టారు. వరంగల్‍, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీస్​పరిధిలోని రోడ్లు, ఫుట్‍పాత్‍లు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలతోపాటు,  అనుమతుఏలకు విరుద్ధంగా అపార్టుమెంట్ల ఎక్స్ ట్రా కట్టడాలనూ కూల్చివేస్తామని అధికారులు వార్నింగ్‍ ఇస్తున్నారు.

ఇన్నాళ్లు ముట్టుకోలే

గ్రేటర్ వరంగల్‍ 20 నుంచి 25 కిలోమీటర్ల పరిధిలో ఉంది. ట్రైసిటీ రోడ్లకు ఇరువైపులా అడుగుకో బడా షాపింగ్‍ మాల్, కంపెనీ షోరూంలు, హోటల్స్, రెస్టారెంట్లు ఉన్నాయి. దాదాపు అన్నిచోట్ల నిర్వాహకులు ఫుట్‍పాత్‍లు, రోడ్లు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. లేదంటే ప్రచారం కోసం ఫుట్​పాత్​లపైనే పెద్ద బోర్డులు అడ్డుగా పెట్టారు. షాపింగ్‍ కోసం వచ్చే జనాల వాహనాలు సెల్లార్లలో పెట్టనీయకుండా ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు. దీంతో రోడ్లమీద రాంగ్‍ పార్కింగ్‍తో ట్రాఫిక్‍ సమస్యలు వస్తున్నాయి. ఈ ఇష్యూ ఎప్పటి నుంచో ఉన్నా.. అధికారులు చర్యలు తీసుకోలేదు. గ్రేటర్‍ పరిధిలోని బడా షాపింగ్‍ మాల్‍ నిర్వాహకులంతా ఉమ్మడి జిల్లాలోని బీఆర్‍ఎస్‍ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సన్నిహితులే. వారితో క్లోజ్‍గా ఉండటంతోపాటు లీడర్లకు ఫైనాన్షియల్‍ సపోర్టుగా నిలిచారు. దీంతో పబ్లిక్‍ ఫిర్యాదుల ఆధారంగా చర్యల కోసం వెళ్లిన బల్దియా, పోలీస్‍, విద్యుత్‍ శాఖల అధికారులు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎన్నోసార్లు వెనక్కి తిరిగివచ్చిన సందర్భాలున్నాయి. 

ఆక్రమణలపై.. నో కాంప్రమైజ్‍

కాంగ్రెస్‍ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రేటర్​వరంగల్​ప్రజల సమస్యలపై దృష్టి పెట్టింది.  జిల్లా ఇన్​చార్జి మంత్రి సహా ఎమ్మెల్యేల వరకు గడిచిన నెలన్నర నుంచి అక్రమ నిర్మాణాల విషయంలో ఉపేక్షించేది లేదని చెబుతూ వచ్చారు. ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి నిర్మాణాలు చేసిన వాటిపై ఆఫీసర్లు తమ పని తాము చేసుకోవాలని, రాజకీయ జోక్యం ఉండదనే భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే గ్రేటర్‍ జనాలు ఊహించని రీతిలో కార్పొరేషన్‍, పోలీస్‍ సిబ్బంది అక్రమ కట్టడాలపై సీరియస్‍ అవుతున్నారు. బిల్డింగులు, షాపింగ్‍ మాల్స్​తీసుకున్న పర్మిషన్లు, నిర్మాణాలను బేరీజు వేసుకుని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిని నోటీసులు ఆధారంగా తొలగిస్తున్నారు. వరంగల్‍, హనుమకొండ, కాజీపేట, మడికొండ, నక్కలగుట్ట, అదాలత్‍, సుబేదారి, నయీంనగర్‍, కేయూసీ జంక్షన్‍, కరీంనగర్‍ రోడ్ల పరిధిలో అక్రమ నిర్మాణాలపై త్వరలోనే కూల్చివేతలు ఉంటాయని బల్దియా పెద్దాఫీసర్లు చెబుతున్నారు.

పర్మిషన్‍ ప్రకారం లేకుంటే కూల్చేస్తం

గ్రేటర్‍ కార్పొరేషన్‍ పరిధిలో ఫుట్‍పాత్‍లు, రోడ్లపై అక్రమ నిర్మాణాలను ఉపేక్షించం. బల్దియా నుంచి తీసుకున్న పర్మిషన్‍కు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను కూల్చేస్తాం. అపార్ట్​మెంట్లు, షాపింగ్‍ మాల్‍ నిర్వాహకులు నిర్మాణాల సమయంలో అనుమతులు ఒకలా తీసుకుని.. అదనంగా కడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. సిల్ట్, సెల్లార్‍ పర్మిషన్లు కేవలం పార్కింగ్‍ కోసం మాత్రమే ఇస్తున్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాలేని వాటి విషయంలో నిర్మాణ స్థాయి ఆధారంగా నోటీసులు ఇస్తున్నాం. 2 వారాల నుంచి స్పెషల్‍ డ్రైవ్‍ చేపడుతున్నాం.

షేక్‍ రిజ్వాన్‍ బాషా, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‍