లోటస్‌‌ పాండ్‌‌లోని జగన్‌‌ ఇంటి వద్ద అక్రమ నిర్మాణాల కూల్చివేత

లోటస్‌‌ పాండ్‌‌లోని జగన్‌‌ ఇంటి వద్ద అక్రమ నిర్మాణాల కూల్చివేత

జూబ్లీహిల్స్, వెలుగు: ఏపీ మాజీ సీఎం జగన్‌‌మోహన్‌‌ రెడ్డి హైదరాబాద్‌‌లోని నివాసం వద్దనున్న అక్రమ కట్టడాలను శనివారం జీహెచ్‌‌ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఉదయం 9 గంటల సమయంలో  జేసీబీల సహాయంతో రోడ్డుకు ఆనుకుని ఉన్న తాత్కాలిక షెడ్డును తొలగించారు. సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్‌‌లోని బంజారాహిల్స్‌‌ లోటస్ పౌండ్‌‌లో ఆయన ఇంటి ప్రహారికి ఆనుకుని తాత్కాలిక షెడ్డును నిర్మించారు. అందులో ఫ్రిజ్, ఏసీలను ఏర్పాటు చేశారు. 

సెక్యూరిటీగా ఉండే పోలీసు అధికారుల కోసం ఏర్పాటు చేసిన ఈ షెడ్డులో.. జగన్‌‌ను కలిసేందుకు వచ్చిన వారు కూడా అక్కడే కూర్చునేవారు. ఆ షెడ్ల వల్ల జగన్‌‌ ఇంటి వద్ద రోడ్డు ఇరుకుగా మారింది. ఈ క్రమంలో స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమంగా నిర్మించిన షెడ్డును స్థానికుల ఫిర్యాదు మేరకే తొలగించామని అధికారులు తెలిపారు. జీహెచ్‌‌ఎంసీ ప్లానింగ్ విభాగం సర్కిల్ 18 ఏసీపీ సంపత్ నేతృత్వంలో స్పెషల్ టాస్క్‌‌ఫోర్స్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు.