- సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై దూకుడు
రామచంద్రాపురం (అమీన్పూర్), వెలుగు : హైడ్రా కొద్ది రోజుల విరామం తర్వాత తిరిగి అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ వందనపురి కాలనీలో రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను సోమవారం హైడ్రా అధికారులు కూల్చివేశారు. సర్వే నం. 848 లో కాలనీ రోడ్డును ఆక్రమించి ఇండ్ల నిర్మాణం చేపట్టారని కొందరు కాలనీవాసులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఇటీవల కంప్లయింట్ చేశారు. విచారించిన అధికారులు సోమవారం జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు.
స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూల్చివేతలు కొనసాగించారు. కొన్నేండ్లుగా అక్కడ రోడ్డు ఉండేదని, వాదిస్తూ కాలనీ వాసులు ఇటీవల హైకోర్టు వరకు విషయం వెళ్లింది. కాగా కోర్టు పరిధిలో ఉన్న సమస్యపై అధికారులు ఎలా చర్యలు తీసుకుంటారని ఇంటి నిర్మాణదారులు ప్రశ్నించారు. తప్పడు లేఅవుట్లో రోడ్డును చూపిస్తూ ఇబ్బందులకు గురి చేశారని, పక్కా ఆధారాలను సమర్పించి మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్లో ఆర్డర్ తీసుకున్నామని వివరించారు. దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తామని బాధితులు పేర్కొన్నారు.