అబ్దుల్లాపూర్మెట్ లో ఉద్రిక్తంగా అక్రమ నిర్మాణాల కూల్చివేత

అబ్దుల్లాపూర్మెట్ లో ఉద్రిక్తంగా అక్రమ నిర్మాణాల కూల్చివేత

ఎల్​బీనగర్, వెలుగు: ప్రభుత్వ స్థలంలో నిర్మించిన దాదాపు 40 రేకుల షెడ్లతోపాటు, పలు గుడిసెలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. పోలీసుల బందోబస్త్ మధ్య జేసీబీలతో నేలమట్టం చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలోని సర్వే నం.283, 573 వద్ద ఆదివారం చేపట్టిన చర్యలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఇక్కడ ఎంతోమంది అక్రమంగా బిల్డింగులు నిర్మించుకొని దర్జాగా ఉంటున్నారని, వారి జోలికి పోకుండా తమ గుడిసెలను మాత్రమే ఎందుకు కూల్చారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. స్థానిక పోలీస్ స్టేషన్​ను ముట్టడించి నిరసన తెలిపారు. వారికి సీపీఎం(ఐ) నాయకులు సామెల్, జగన్​తోపాటు మరికొందరు మద్దతు తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూకబ్జాదారులు ప్రభుత్వ భూములు ఆక్రమించుకొన్నా పట్టించుకోని అధికారులు పేదల ఇండ్లపై దాడులు చేసి కూల్చివేయడం ఏమిటని మండిపడ్డారు. బాధితులకు మద్దతుగా నిలిచిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాన్ వెస్లీ, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్, కార్యవర్గ సభ్యుడు పగడాల యాదయ్య, జిల్లా నాయకుడు రాంచందర్, మండల కార్యదర్శి నరసింహతోపాటు మరికొంత మందిని పోలీసులు అరెస్ట్ చేసి యాచారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. సాయంత్రం విడుదల చేశారు.

పేదల గుడిసెలు కూల్చడం దారుణం: తమ్మినేని

సీపీఎం నాయకుల అరెస్టులను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. ఈ సర్వే నంబర్‌లో మొత్తం 300 ఎకరాల భూమి ఉండగా,10 ఎకరాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు 150 బిల్డింగులు అక్రమంగా నిర్మించారని ఆరోపించారు. కానీ పట్టాలిచ్చిన పేదలకు మాత్రం నేటికీ ఇంటి స్థలం హద్దులు చూపించలేదన్నారు. ప్రభుత్వం స్పందించి ఒక్కో కుటుంబానికి రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.